
న్యూఢిల్లీ : వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు గానూ బాణాసంచా కాల్చడంపై తాము జారీ చేస్తున్న ఆదేశాలకు దేశవ్యాప్తంగా గల రాష్ట్రాలన్నీ కట్టుబడి వుండాలని, కేవలం ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతాలే కాదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. దీపావళి పండుగ మరికొద్ది రోజుల్లో వుందనగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ''పండుగ సంబరాలు జరుపుకోండి, కానీ కాస్త మోతాదులోనే వుండాలి. పర్యావరణాన్ని పణంగా పెట్టి జరుపుకోరాదు, ఇటువంటి సంబరాలతో ఇతరులకు మనం సంతోషాన్ని తీసుకురాగలుగుతాం.'' అని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ వ్యాఖ్యానించారు. పిల్లల కన్నా పెద్దలే అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారని జస్టిస్ ఎ.ఎస్.బొపన్న వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ వాటివల్ల కలిగే కాలుష్యాన్ని, ఇతరులకు కలిగే ఇబ్బందిని అస్సలు పట్టించుకోవడం లేదని అన్నారు. 10.30 గంటల వరకే కాల్చుకోవాలని ఆంక్షలు విధిస్తే, 10 గంటల కల్లా మొత్తం టపాసులన్నీ కాల్చేసుకోవడానికే వారు చూస్తారని జస్టిస్ బొపన్న అన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని జస్టిస్ సుందరేశ్ అన్నారు.