Sep 23,2023 09:21

అతిపెద్ద క్రీడా పోటీల్లో ఒకటైన ఆసియా గేమ్స్‌ నేటినుంచి ప్రారంభం కానున్నాయి. చైనాలోని హాంగ్జౌ వేదికగా 19వ ఆసియా క్రీడలు 23న ప్రారంభమై.. అక్టోబర్‌ 8న జరిగే ముగింపు వేడుకలతో ముగియనున్నాయి. భారత్‌నుంచి ఈసారి అత్యధికంఖ్యలో 655మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. మొత్తం 61 క్రీడాంశాల్లో 481 స్వర్ణ పతకాలకు పోటీలు జరుగుతుండగా.. భారత్‌ నుంచి 41 క్రీడాంశాల్లో బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శించిన వారు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. షెడ్యూల్‌ ప్రకారం 2022లోనే ఈ పోటీలు జరగాల్సి ఉన్నా.. కోవిడ్‌ా19 కారణంగా ఈ ఏడాది జరుగుతున్నాయి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ 70 పతకాలతో 8వ స్థానంలో నిలువగా.. ఈసారి పతకాల్లో సెంచరీ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హాంగ్జూ(చైనా)
: హాంగ్జూ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 23న ప్రారంభమై.. అక్టోబర్‌ 8న జరిగే ముగింపు వేడుకలతో ముగియనున్నాయి. చైనాలోని 56 వేదికల్లో ఈసారి ఆసియా క్రీడలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో భారత బృందానికి పురుషుల హాకీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ త్రివర్ణ పతకాన్ని చేబూని అందరికంటే ముందు నడవనున్నారు. ఈ క్రీడల్లో భారత్‌నుంచి తొలిసారి 655మంది అథ్లెట్లు పాల్గోనున్నారు. జావెలిన్‌ త్రో, హాకీ, క్రికెట్‌, టెన్నిస్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, బ్యాడ్మింటన్‌లో ఈసారి భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కడం ఖాయం. అధికారికంగా నేటినుంచి అన్ని క్రీడాంశాలు ప్రారంభమవుతున్నా.. వాలీబాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బీచ్‌వాలీబాల్‌ తదితర క్రీడాంశాలు 19నుంచే జరుగుతున్నాయి.

  • క్రికెట్‌కు తొలిసారి..

క్రికెట్‌కు ఈసారి ఆసియా క్రీడల్లో తొలిసారి చోటు దక్కింది. ఇంతకుముందు పురుషుల క్రికెట్‌కు మాత్రమే ఒకసారి చోటు దక్కగా.. ఈసారి పురుషుల, మహిళల క్రికెట్‌కు చోటు దక్కడం విశేషం. టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ పోటీల్లో పురుషుల జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కడం ఖాయం. ఇక 21న మలేషియాపై ఘన విజయం సాధించిన మహిళలజట్టు ఇప్పటికే సెమీస్‌కు చేరింది. 25న ఫైనల్‌ మ్యాఛ్‌ జరగనుంది. ఇక పురుషుల క్రికెట్‌ పోటీలు సెప్టెంబర్‌ 27నుంచి ప్రారంభం కానుండగా.. అక్టోబర్‌ 7న జరిగే ఫైనల్‌తో ముగియనున్నాయి. ఐసిసి టాప్‌ా10 ర్యాంక్‌లో ఉన్న భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. గ్రూప్‌ాఏ, బి, సి నుంచి ఒక్కో జట్టు లీగ్‌ దశ ముగిసిన తర్వాత క్వార్టర్‌ఫైనల్లో చోటు దక్కించుకోనున్నాయి.

  • ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లోనూ ఫేవరెట్‌గానే..

ఇక ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో 68మంది అథ్లెట్లు భారత్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈసారి అందరికళ్లూ నీరజ్‌ చోప్రా(జావెలిన్‌) పైనే ఉన్నాయి. 2018 జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో తొలిసారి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకొని నీరజ్‌.. నయా చరిత్రకు శ్రీకారం చుట్టాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకం సాధించినా.. ఇటీవల ముగిసిన డైమండ్‌ లీగ్‌లో రజిత పతకానికే పరిమితమయ్యాడు. స్క్వాష్‌లో దీపిక పల్లికల్‌, జోష్నా చిన్నప్ప పతకాలు సాధించగల క్రీడాకారులే.

  • టిటిలో గెలుపు..

టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల, మహిళల విభాగాల్లో భారత్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ పోటీల్లో పురుషుల జట్టు 3ా0తో యెమెన్‌, మహిళలజట్టు 3ా2తో సింగపూర్‌ను ఓడించాయి. జి. సాథియాన్‌, హర్మీత్‌ దేశారులతో కూడిన పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లోనూ 3ా1తో గెలిచింది. దీంతో ప్రి క్వార్టర్స్‌కు ఇరుజట్లు చేరాయి.

  • అరుణాచల్‌ ప్రదేశ్‌ క్రీడాకారులకు వీసా సమస్య

భారత్‌కు చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించింది. ఈ విషయమై భారత్‌ నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శనివారం జరిగే ప్రారంభ వేడుకలో పాల్గనకూడదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైనా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల స్ఫూర్తిని చైనా ఉల్లంఘించిందన్నారు.