Nov 04,2023 22:08

ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడే మిగిలిన మ్యాచ్‌లకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బిసిసిఐ శనివారం ప్రకటించింది. హార్ధిక్‌ పాండ్యా స్థానాన్ని పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ భర్తీ చేస్తాడని, టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా కెఎల్‌ రాహుల్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బిసిసిఐ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇదే విషయమై బిసిసిఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. టీమిండియా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ శనివారం ఉదయమే అతడికి తెలిపాడు. అగార్కర్‌ కూడా టీమ్‌తోనే ట్రావెల్‌ చేస్తున్నాడని తెలిపారు. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఏడు వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్‌కు చేరిన టీమిండియా.. ఆదివారం పటిష్ట దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు సిద్ధమౌతోంది. కాగా ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ హార్ధిక్‌ ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సిఏ)లో చికిత్స తీసుకున్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు అతడు ముంబయిలో టీమిండియాతో కలవడంతో కనీసం సెమీస్‌ వరకైనా టీమ్‌తో కలుస్తాడని భావించినా ప్రయోజనం లేకపోయింది.