Aug 22,2023 17:00

ఆసియా కప్‌నకు ఎంపికకావడంపై తిలక్‌ వర్మ హర్షం వ్యక్తం చేస్తూ.. తనకు మద్దతుగా నిలిచి నమ్మకం ఉంచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా బీసీసీఐ చేసిన ఇంటర్వ్యూలో తిలక్‌ వర్మ అనేక విషయాలను పంచుకున్నారు. ''రోహిత్‌ భయ్యా ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. నేను ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు కూడా అతను నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. నా ఐపీఎల్‌లో కెరీర్‌ ప్రారంభ దశలో కొంచెం భయపడ్డాను. దీంతో రోహిత్‌ శర్మ స్వయంగా నా దగ్గరకు వచ్చి ఆట గురించి మాట్లాడాడు. ఎల్లప్పుడూ నీ ఆటను ఆస్వాదించు, ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉండు అని ఎంకరేజ్‌ చేశాడు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా నా దగ్గరికి ఏ సమయంలోనైనా రావచ్చు లేదా మెసేజ్‌ చేయొచ్చు. నేను నీకు అండగా ఉంటానని రోహిత్‌ చెప్పాడు. అతనితో తరచూ మాట్లాడతా. ఐపీఎల్‌లో నా ఆటతీరును ప్రదర్శించా. ప్రతిచోటా అలాగే ఆడతా. ఆసియా కప్‌నకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ కూడా బాగా రాణించాలనుకుంటున్నా'' అని తిలక్‌ వర్మ వివరించాడు.