Oct 05,2023 22:35

విచారణకు రావాలని సీనియర్‌ జర్నలిస్టులకు మళ్లీ సమన్లు జారీ చేసిన పోలీసులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:యుఎపిఎ కింద అరెస్టయిన న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థా, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అమిత్‌ చక్రవర్తికి ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందించాలని ఢిల్లీ పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ దశలో ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేమన్న ఢిల్లీ పోలీసుల వాదనను అదనపు సెషన్స్‌ జడ్జి హర్దీప్‌ కౌర్‌ తోసిపుచ్చారు. అదే సమయంలో ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే చర్యలో భాగంగా ఢిల్లీ పోలీసులు సీనియర్‌ జర్నలిస్టులు పరంజోరు గుహా ఠాకుర్తా, అభిసార్‌ శర్మలను విచారణకు హాజరుకావాలని మళ్లీ సమన్లు పంపారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందజేయడాన్ని వీలైనంత వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నం కోర్టు జోక్యంతో విఫలమైంది. కాపీని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు విచారించింది. ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ.. ఈ దశలో కాపీని ఇవ్వలేమని వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, నిందితులు మొదట కాపీ కోసం కమిషనర్‌ను సంప్రదించాలని, ఆ తరువాత డిమాండ్‌ను పరిశీలించేందుకు కమిటీ వేయాలని అన్నారు. ప్రస్తుత దశలో అటువంటి అభ్యర్ధనను కోర్టు స్వీకరించొద్దని, అరెస్టుకు దారితీసిన పరిస్థితులు, ఇతరులను రిమాండ్‌ దరఖాస్తులో పేర్కొనడం జరిగిందని శ్రీవాస్తవ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని పొందేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని ప్రబీర్‌ తరపు న్యాయవాది అర్ష్‌దీప్‌ సింగ్‌ ఖురానా అన్నారు. అంతేకాదు, అరెస్టుకు గల కారణాలను కూడా లిఖితపూర్వకంగా అందజేయాలని న్యాయవాది పోలీసులను కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కాపీని అందజేయాలని ఆదేశించింది. ప్రబీర్‌, అమిత్‌ ప్రస్తుతం వారం రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
సీనియర్‌ జర్నలిస్టులకు సమన్లు
సీనియర్‌ జర్నలిస్టులు పరంజోరు గుహా ఠాకుర్తా, అభిసార్‌ శర్మలకు మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు మంగళవారం 46 మందిని ప్రశ్నించారు. ప్రశ్నలను ఎ, బి, సి అనే మూడు జాబితాలుగా విభజించారు. అరెస్టు చేయవలసిన వారిని జాబితా ఎ చేర్చింది. ప్రబీర్‌, అమిత్‌లతో పాటు ఈ జాబితాలో మరో నలుగురు ఉన్నారని కొన్ని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఠాకుర్తా, అభిసార్‌లను అరెస్టు చేయడానికి మళ్లీ పిలుస్తున్నట్లు చర్చ జరుగుతుంది.

పూర్తిగా నిరాధార ఆరోపణలు
కాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, గౌతమ్‌ నవ్‌లాఖాతో స్నేహం అంశాలు
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఢిల్లీ పోలీసులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అమిత్‌ చక్రవర్తిలను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ చేసిన రిమాండ్‌ రిపోర్టులోనూ, యుఎపిఎ కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఢిల్లీ పోలీసులు పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని భీమా కోరేగావ్‌ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్క్సిస్ట్‌ ఆలోచనాపరుడు, జర్నలిస్టు గౌతమ్‌ నవ్‌లాఖాతో ప్రబీర్‌ పుర్కాయస్థ స్నేహాన్ని 'తీవ్రమైన' నేరంగా ఢిల్లీ పోలీసులు అభివర్ణించారు. కాశ్మీర్‌ కాకుండా భారతదేశాన్ని ఎలా మ్యాప్‌ చేయాలని, అరుణాచల్‌ను వివాదాస్పద ప్రాంతంగా ఎలా చిత్రీకరించాలని 'చర్చించారు' అని ఢిల్లీ పోలీసులు విపరీతమైన వాదనలు కూడా చేస్తున్నారు.
న్యూస్‌క్లిక్‌పై ఆరోపణలు గాలి బుడగల్లా తేలిపోతున్నాయని దర్యాప్తు అధికారులే గుసగుసలాడుకుంటున్నారు. యుఎపిఎ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందజేయడానికి పోలీసులు విముఖత చూపడానికి కూడా ఇదే కారణం. నిజానికి 2021లో న్యూస్‌క్లిక్‌పై ఈడీ కేసులో ఆరోపణలతో పాటు, గౌతమ్‌ నవ్‌లాఖాతో స్నేహం, కాశ్మీర్‌, అరుణాచల్‌ సమస్యలపై ఢిల్లీ పోలీసులు చెప్పవల్సి ఉంది. కానీ ఎఫ్‌ఐఆర్‌లో లేదా రిమాండ్‌ దరఖాస్తులో దీనిని ధ్రువీకరించే ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు.
ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం, న్యూస్‌క్లిక్‌ 2018 నుండి యుఎస్‌ వ్యాపారవేత్త నెవిల్లే రారు సింఘమ్‌తో లింక్‌ చేయబడిన మూడు సంస్థల నుండి నిధులు అందాయని, వాటితో చైనా అనుకూల ప్రచారం చేస్తోందని, 1991 నుండి నవ్‌లాఖాతో ప్రబీర్‌ స్నేహం గురించి ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించినట్లు లీకైన వార్తలస్తున్నాయి. న్యూస్‌క్లిక్‌పై ఎఫ్‌ఐఆర్‌ ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు ఆధారంగా రూపొందించారు. ఎసిపి విచారణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేందుకు కోట్లాది విదేశీ నిధులు అక్రమంగా భారత్‌లోకి వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు నిఘా ఉందని రిమాండ్‌ దరఖాస్తులో పేర్కొన్నారు.