ఢిల్లీ : చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ నివాసం, కార్యాలయంలో సీబీఐ బుధవారం సోదాలు చేపట్టింది. ఈ ఉదయం ప్రబీర్ నివాసానికి, కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలను ఉల్లంఘించి పోర్టల్‌కు విదేశీ నిధులు అందాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం (UAPA) కేసులో పాటియాలా హౌస్ కోర్టు పుర్కాయస్థ మరియు హెచ్.ఆర్ విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిలను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఒకరోజు తరువాత ఈ చర్యలకు పాల్పడింది.










