'న్యూస్ క్లిక్'పై దాడి, ఆ సంస్థ వ్యవస్థాపక సంపాదకులు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిలను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం-యుఎపిఎ నిబంధనల కింద అరెస్టు చేయడం చూస్తుంటే మోడీ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ విధా నాలను తీవ్రంగా విమర్శించే ఆ న్యూస్ పోర్టల్‌ను అణచి వేసేందుకు చేసిన దారుణమైన ప్రయత్నంగా వుంది.
'న్యూస్ క్లిక్'పై చేపట్టిన ఈ అనూహ్యమైన చర్య మొత్తంగా స్వతంత్ర మీడియాకు చేసిన హెచ్చరికగా వుంది. అవసరమనుకుంటే స్వతంత్ర మీడియా గొంతు నొక్కివేయడానికి మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనే సంకేతాలు పంపుతోంది. 'న్యూస్ క్లిక్'కు చెందిన 46 మంది జర్నలిస్టులు, సిబ్బంది, పార్ట్‌టైమ్ ఉద్యోగుల నివాసాలపై దాడులు జరిపి...పుర్కాయస్థ, చక్రవర్తిలను అరెస్టు చేశారు. వీరందరి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పదే పదే ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు.
వీరికి సంధిస్తున్న ప్రశ్నావళి తీరు చూస్తుంటే, ఢిల్లీ పోలీసుల ఉద్దేశ్యాలు, వాటి వెనుక గల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆలోచనలు అర్ధమవుతున్నాయి. సిఎఎ వ్యతిరేక ఆందోళనలు, ఈశాన్య ఢిల్లీ అల్లర్లు, మతోన్మాద హింసాకాండకు సంబంధించిన వార్తలు, 2020-21లో రైతుల ఆందోళన కవరేజీలో పాల్గొన్నారా అంటూ జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాల గురించి రాసినా, వీడియోలు తీసినా...వారిని చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి తీసుకువచ్చారు. ఢిల్లీ పోలీసుల దృష్టిలో జర్నలిజం కూడా నేరమే!
కేంద్ర ప్రభుత్వం 2021 లోనే 'న్యూస్ క్లిక్'ను లక్ష్యంగా చేసుకుంది. వెబ్‌సైట్ కార్యాలయంపై, ప్రమోటర్, ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) దాడి జరిపింది. వారిపై మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. ఆ సమయంలోనే 'న్యూస్ క్లిక్' తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలను అందచేసింది. ఆర్‌బిఐ అనుమతితో అమెరికా లోని కొన్ని సంస్థలు, కంపెనీలు నిబంధనల ప్రకారం ఎలా నిధులు అందచేశాయో కూడా వివరించింది. 'న్యూస్ క్లిక్' సంపాదకులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, కోర్టు నుండి రక్షణ కూడా పొందారు. పుర్కాయస్థపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఇ.డి ని ఆదేశించింది.
'న్యూస్ క్లిక్' నిధులు, పెట్టుబడుల క్రమంలో ఎలాంటి అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయని నిరూపించలేకపోవడంతో మోడీ ప్రభుత్వం తన రూటు మార్చింది. ఇందులో భాగంగా, ఆగస్టు 5 నాటి 'న్యూయార్క్ టైమ్స్' వ్యాసాన్ని తనకు అనుకూలంగా వాడుకుంది. అమెరికా పౌరుడు, టెక్ కంపెనీ మాజీ యజమాని అయిన నెవిల్లె రారు సింగమ్ పెట్టుబడులు, నిధులు అందచేసిన సంస్థలు, మీడియా సంస్థల నెట్‌వర్క్ వివరాలు ఆ వ్యాసంలో వున్నాయి. భారత్ లోని 'న్యూస్ క్లిక్' గురించి అసమగ్రమైన ప్రస్తావన మాత్రమే అందులో వుంది. భారత అధికారులు ఆ సంస్థపై దాడి చేశారన్నది వాస్తవం. అంతేకానీ ఆ సంస్థ ఎలాంటి తప్పులు చేసిందనే ప్రస్తావనే లేదు. అయితే, 'న్యూస్ క్లిక్'పై విషపూరితమైన దాడి చేయడానికి బిజెపి దీన్నొక సంకేతంగా వాడుకుంది. పైగా ఈ వెబ్‌సైట్‌కు చైనా నుండి నిధులు అందుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి తప్పుడు ఆరోపణలు చేశారు. దాంతో, 'న్యూస్ క్లిక్'ను లక్ష్యంగా చేసుకోవడానికి చైనా కార్డును వాడుకోవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించేసింది. ఆ వెంటనే ఢిల్లీ పోలీసుల కార్యాచరణ ఆరంభమైంది.
ప్రబీర్ పుర్కాయస్థ తదితరులపై నమోదు చేసిన ఎఫ్‌ఆఐర్ కాపీని ఎట్టకేలకు అరెస్టు చేసిన నిందితులకు అందచేశారు. అది కూడా పోలీసులను కోర్టు ఆదేశించిన తర్వాతనే జరిగింది. ఎఫ్‌ఐఆర్‌లో నిరంకుశమైన యుఎపిఎ, ఐపిసి సెక్షన్లు 153-ఎ, 120-బి లను (మతం, నేరపూరితమైన కుట్ర ప్రాతిపదికగా వివిధ వర్గాల మధ్య మతపరమైన శతృత్వాన్ని పెంపొందించినందుకు) వారిపై మోపారు.
ఆ ఎఫ్‌ఐఆర్ అంతా ఆరోపణలతో నిండిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి, అసంతృప్తులను సృష్టించాలనే, దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను దెబ్బ తీయాలనే లక్ష్యంతో శత్రు శక్తులు ఏ విధంగా విదేశీ నిధులను భారత్ లోకి అక్రమంగా చొప్పించారో సాధారణ వర్ణనలు వున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్‌లను భారత్‌లో అంతర్భాగం కాదని చూపించేందుకు కుట్ర జరిగిందని కూడా ఆ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణల్లో వేటినీ నిరూపించే సాక్ష్యాధారాలను అందచేయలేదు. పైగా, 2020-21లో ప్రజల నిత్యావసరాల సరఫరాలు, సేవలకు అంతరాయం కలిగేలా రైతాంగ ఆందోళనను సుదీర్ఘంగా పొడిగించేందుకు ప్రయత్నించారనే విపరీతమైన ఆరోపణలు చేశారు. ఇలా చేయడం ద్వారా, రైతుల ఆందోళనకు అప్రతిష్ట పాల్జేశారు. దాన్నొక విధ్వంసకర కార్యకలాపంగా ముద్ర వేశారు. జియోమి, వివో వంటి చైనా టెలికం కంపెనీల నుండి అందుకున్న ప్రయోజనాలకు ప్రతిగా ఆ కంపెనీలపై నమోదైన కేసుల్లో వాదించడానికి గానూ లీగల్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి, దానికోసం ప్రచారం చేయడానికి కుట్ర పన్నారంటూ నిందితులపై వింతైన అభియోగాలు మోపారు. అక్కడితో ఆగకుండా, ఈ కుట్రను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు భారత్ లోకి అక్రమంగా విదేశీ నిధులను చొప్పించడం కోసం...ఈ రెండు చైనా టెలికం కంపెనీలు పిఎంఎల్‌ఎ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భారత్ లోకి వేలాది బూటకపు కంపెనీలను చొప్పించాయంటూ ఆరోపించారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినా కూడా, ఈ కంపెనీలకు, 'న్యూస్ క్లిక్'కు లేదా నిందితులకు సంబంధాలున్నాయని చూపించలేకపోయారు.
పైన చెప్పినట్లుగా, చైనా వనరుల నుండి నిధులు అందుతున్నాయన్న తప్పుడు ఆరోపణలతో 'న్యూస్ క్లిక్' ప్రతిష్టను మసకబరచాలని లక్ష్యంగా పెట్టుకున్న మోడీ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశ్యాలను ఎఫ్‌ఐఆర్ వెల్లడించింది. పైగా యుఎపిఎ నిబంధనలను మోపడాన్ని సమర్ధించు కోవడానికి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నారన్న అభియోగాలను దీనితో ముడిపెట్టారు. ఈ 'న్యూస్ క్లిక్' వెబ్‌సైట్ వామపక్షాల భావజాలంతో పని చేసే, రైతులు, కార్మిక వర్గం ఉద్యమాలకు బలంగా నిలిచే వార్తా వెబ్‌సైట్ కావడమే ఇంతటి విషపూరితమైన దాడి జరగడం వెనుక గల ప్రధాన వాస్తవంగా వుంది. ఇటీవలే, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, భారతదేశంలో వామపక్ష అనుకూల శక్తులపై నిరంతరం పోరాడాలని పిలుపిచ్చారు.
'న్యూస్ క్లిక్'పై దాడి పత్రికా స్వేచ్ఛపై జరిగిన అతి దారుణమైన దాడి. అరతేకాదు, ప్రజాస్వామ్యం, పౌరుల హక్కులపై పెరుగుతున్న నిరంకుశ దాడుల్లో భాగం కూడా. అందువల్ల, పూర్తి శక్తియుక్తులతో, నిబద్ధతతో ఈ దాడులను ప్రతిఘటించాలి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)