Aug 14,2023 09:45

పిల్లలు ఫోన్లను తెగ వాడేస్తున్నారని, ఎప్పుడు చూసినా ఫోనుతోనే గడుపుతున్నారని పెద్దలంతా వాపోతుంటారు. మన ఇంట్లో.. పక్కింట్లో.. బంధువుల ఇంటికి వెళితే అక్కడ.. ఎక్కడ చూసినా ఇవే ఫిర్యాదులు.. రైలు, బస్సు, ఏ ప్రయాణమైనా ఫోనుతోనే.. ఇలా దేశంలో ఎంతమంది పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారో ఎవరైనా.. ఎప్పుడైనా అంచనా వేశారా? ఆ సమాచారం ఇప్పుడు అందుబాటులో ఉంది. తాజాగా ఢిల్లీకి చెందిన డెవలప్‌మెంట్‌ ఇంటిలిజెంట్‌ యూనిట్‌కు చెందిన సంస్థ చేసిన సర్వేలో ఆ వివరాలు వున్నాయి. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామాల్లో 6 నుండి 16 ఏళ్ల లోపు పిల్లల మధ్య ఈ సర్వే నిర్వహించారు.

ఢిల్లీ ఆధారిత డెవలప్‌మెంట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (డిఐయు) ద్వారా నిర్వహించిన ఈ సర్వే, శంబోధి రీసెర్చ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో ట్రాన్స్‌ఫార్మింగ్‌ రూరల్‌ ఇండియా ఫౌండేషన్‌(టిఆర్‌ఐఎఫ్‌) చొరవతో రూపొందించారు.
          గ్రామీణ విద్యార్థుల్లో దాదాపు సగం మంది (49.3 శాతం) స్మార్ట్‌ ఫోన్లు కలిగివున్నారు. వీరిలో 76.7 శాతం మంది విద్యార్థులు తమ ఫోన్లను వినోదానికి అంటే గేమ్స్‌, సినిమాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. వీరిలో 34 శాతం మంది విద్యార్థులు బోధనా అంశాల కోసం వినియోగిస్తున్నారు. 18 శాతం మంది ఆన్‌లైన్‌ ట్యూటోరియల్స్‌ సేవల కోసం ఉపయోగిస్తున్నారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అత్యధికంగా 58.32 శాతం స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తుంటే.. 1 నుండి 3వ తరగతి విద్యార్థుల్లో 42.1 శాతం మంది ఉపయోగిస్తున్నారు.
        ఇంట్లో చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యార్థుల్లో 40 శాతం మంది తల్లిదండ్రులు టెక్ట్స్‌ బుక్స్‌కు బదులుగా స్మార్ట్‌ఫోన్లో దొరికే పాఠ్యాంశాలను పిల్లలకు సూచిస్తున్నారట. మరో 40 శాతం మంది స్కూలు బోధనకు సంబంధించిన అంశాల చర్చకై ప్రతిరోజూ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ తరహా చర్చలను వారానికి కొన్ని సార్లు మాత్రమే చేసే తల్లిదండ్రుల సంఖ్య 32 శాతంగా ఉంది.
          పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల చొరవను కూడా ఈ సర్వే పరిశీలించింది. 84 శాతం మంది తల్లిదండ్రులు ప్రతి పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌కి హాజరవుతున్నట్లు పేర్కొంది. డ్రాపౌట్స్‌ రేట్ల వివరాలు చూస్తే.. ఆర్థికపరమైన కారణాలతో 36.8 శాతం మంది బాలికలు స్కూలు మానేస్తున్నారు. వీరిలో 21.1 శాతం మంది ఇంటి పనుల నిమిత్తం, తమ కంటే చిన్నవారైన తమ్ముడు, చెల్లెలి ఆలనాపాలనా చూసుకోవడంలో నిమగమవుతున్నారు. అబ్బాయిల్లో.. చదువుపై ఆసక్తి లేక 71.8 శాతం మంది, కుటుంబ పోషణకై 48.7 శాతం మంది స్కూలుకు దూరమయ్యారు.
          పిల్లల చదువు పట్ల తల్లిదండ్రుల ఆకాంక్షలను కూడా ఈ సర్వే తేటతెల్లం చేసింది. కూతుర్లు ఉన్న తల్లిదండ్రుల్లో 78 శాతం మంది, కొడుకులు ఉన్న వాళ్లల్లో 82 శాతం మంది పిల్లలను గ్రాడ్యుయేషన్‌కి మించి చదివించాలనుకుంటున్నారు.
'స్టేట్‌ ఆఫ్‌ ఎలిమంటరీ ఎడ్యుకేషన్‌ ఇన్‌ రూరల్‌ ఇండియా-2023' పేరుతో చేసిన ఈ సర్వేలో 6,229 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూలుకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు, స్కూలు మానేసిన పిల్లల తల్లిదండ్రులు, ఇంతవరకు స్కూల్లో పేరు నమోదు చేయని తల్లిదండ్రులుగా వివిధ కేటగిరీలో ఈ సర్వే నిర్వహించారు. పిల్లలు ఎన్ని రకాలుగా స్మార్ట్‌ఫోన్‌ని వాడుతున్నారో.. చదువు కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారో.. అన్న అంశాలు ఈ సర్వే ద్వారా మరోసారి వెలుగు చూశాయి.