వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
నేడు కొనసాగనున్న దాయాదుల పోరు
కొలంబో : భారత్, పాకిస్థాన్ పోరుకు వరుణుడు మళ్లీ అడ్డు తగిలాడు. ఆసియా కప్ సూపర్ 4 దశలో దాయాదులు తలపడగా.. ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ ఇన్నింగ్స్‌లో 24.1 ఓవర్ల సమయంలో వర్షం రంగ ప్రవేశం చేసింది. పలుమార్లు ఫీల్డ్ అంపైర్లు పిచ్‌ను తనిఖీ చేసినా.. ఆదివారం మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. నేడు మధ్యాహ్నాం 3 గంటలకు పున ప్రారంభం కానున్న భారత్, పాక్.. యథాతథంగా భారత ఇన్నింగ్స్‌లో 24.1 ఓవర్ల నుంచి ఆరంభం కానుంది. భారత్, పాక్ గ్రూప్ దశ మ్యాచ్ వర్షార్పణమైన సంగతి తెలిసిందే.
గిల్, రోహిత్ దూకుడు : పేసర్లకు అనుకూలించే పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (56, 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (58, 52 బంతుల్లో 10 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిశారు. కొత్త బంతితో పాక్ పేస్ త్రయం షహీన్, రవూఫ్, నసీం నిప్పులు చెరిగినా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వారి భరతం పట్టాడు. పవర్‌ప్లేలో బౌండరీల మోత మోగించిన గిల్ వేగంగా పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడాడు. పది ఫోర్లతో దండెత్తిన గిల్ 35 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. పేసర్లపై గిల్ విరుచుకుపడగా.. స్పిన్నర్లపై రోహిత్ దండెత్తాడు. షహీన్‌పై సిక్సర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.. షాదాబ్ ఖాన్‌పై రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో జోరందుకున్నాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 42 బంతుల్లోనే రోహిత్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 121 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. స్వల్ప విరామంలో ఓపెనర్లు ఇద్దరు నిష్క్రమించగా.. విరాట్ కోహ్లి (8 నాటౌట్), కెఎల్ రాహుల్ (17 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచారు.










