Jun 04,2023 20:14

పోర్ట్‌ అవు ప్రిన్స్‌ : గతేడాది అక్టోబరులో హైతిలో కలరా పెచ్చరిల్లి 704మంది చనిపోయారని హైతీ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందుకు సంబంధించి అధికారిక బ్యాలన్స్‌షీట్‌ను ప్రచురించారు. కలరా సంభవించినప్పటి నుండి మొత్తంగా 40,139మంది ఆస్పత్రిలో (నమోదైనవి 2,835 కేసులు) చేరాల్సి వచ్చిందని, యుక్త వయస్సు పిల్లలు కూడా దీనిబారిన పడ్డారని తెలిపింది. ప్రధానంగా ఏడాది నుండి 9ఏళ్ళ వయస్సు వారు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడ్డారని పేర్కొంది. పిల్లలకు సంబంధించే 14,673 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కలరా అంటే అపరిశుభ్రమైన ఆహారం లేదాకలుషితమైన నీరు తాగడం వల్ల తీవ్ర స్థాయిలో తలెత్తే డయేరియా వ్యాధే. అంతర్జాతీయ ప్రజారోగ్యానికి ఇదొక ముప్పుగా నిలుస్తోంది. అసమానతలకు, సామాజికాభివృద్ది కొరవడడానికి ఇదొక సూచీగా వుంది. సులభంగానే చికిత్సనందించగల వ్యాధి అయినా ఇది పెద్ద ఎత్తున సంభవిస్తే ప్రాణానికి ముప్పుగానే వుంది. అంతర్జాతీయంగా క్షుద్భాధ పీడిత ప్రాంతాలుగా సూడాన్‌, సాహెల్‌తో పాటూ హైతీని కూడా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.