Jul 31,2023 09:39

మతం వ్యక్తిగతం. కానీ, మతోన్మాద పాలకుల ఏలుబడిలో ఉన్న దేశాల్లో మతం ఓ ఆయుధం. మతం పేరుతో అణచివేత, హింస, స్వేచ్ఛను కాలరాయడం అక్కడ సర్వసాధారణం. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ ప్రభావంతో పురోగామి మార్గంలో పయనించిన ఆప్ఘన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. ఆప్ఘన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నప్పటి నుంచి అక్కడి మహిళలకు స్వేచ్ఛ లేదు. విద్య లేదు. ఉద్యోగాలు లేవు. తాజాగా మహిళల సౌందర్య పోషకాలుగా చలామణి అయ్యే బ్యూటీపార్లర్లపై కూడా నిషేధం విధించారు.

044

         ఏ మతమైనా మహిళలను నిర్బంధాల సుడిలోకి నెట్టేస్తుంది. ఏ దుస్తులు వేసుకోవాలి.. ఏం తినాలి.. ఎలా ఉండాలి. ఎలా నడుచుకోవాలి వంటి విషయాల్లో మహిళలపై నిర్బంధాలు రాజ్యమేలు తాయి. అందుకే బ్యూటీపార్లర్‌లో సాధారణంగా చేసే కనుబొమ్మల ఆకృతి, వివిధ రకాల కేశాలంకరణ, గోళ్లు కత్తిరించుకోవడం, మేనిఛాయ మెరుపు వంటి పనులన్నింటినీ వారు ఘోరాతిఘోరంగా పరిగణించారు.
         మతోన్మాదం తలకెక్కిన పాలకులు మాత్రం తమ చర్యలను ఎప్పుడూ సమర్థించుకుంటూనే ఉంటారు. రెండో తరగతి వ్యక్తులుగా లెక్కగట్టి మహిళల హక్కులను కాలరాస్తూనే ఉంటారు. స్త్రీ, పురుషులు సమానమనే పురోగామి భావన వారికి ఆమోదయోగ్యం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా జీవితంలో మహిళలకు స్థానం లేకుండా చేయడమే వారి లక్ష్యం. అందుకే తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆప్ఘన్‌లో ఆడపిల్లలు రోడ్డుపై నడవాలంటేనే భయపడేలా ఆంక్షలు విధించారు. స్కూళ్లు మూసేశారు. విశ్వవిద్యాలయాల్లో సీట్లు రద్దు చేశారు. మహిళా ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగించారు. టీవీ మాధ్యమాలు, వార్తా ఛానెళ్లలో మహిళా ఉద్యోగులను కార్యాలయాల నుంచి వెళ్లగొట్టారు. క్రీడాకారులను ఆడటానికి వీల్లేదన్నారు. పార్కులకు వెళ్లేందుకు అనుమతి లేదు. బహిరంగంగా నిర్వహించే ఫంక్షన్లకు వెళ్లకూడదు. జిమ్‌లో ప్రవేశం లేకుండా చేశారు. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళలు ప్రధానంగా ఆధారపడిన రంగం మూతబడి ఆర్థికంగా వారి కుటుంబాలు అల్లకల్లోలమవుతున్నాయి. 60 వేల మంది మహిళలకు ఉపాధి పోయింది.
         'నా ఆహారం, నీళ్లు తీసుకోకండి..' అని రాసిన ప్లకార్డులతో, 'మాకు విద్య లేకుండా చేశారు. ఉపాధినిó దూరం చేశారు. ఎంతకాలం ఈ నిర్బంధాలను భరించాలి' అంటూ నినాదాలు చేస్తున్న మహిళా ఉద్యమకారులు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు. 'మేం పుట్టిన దేశంలో ఎన్నో కలలతో బతుకుతున్న మాకు ఈ రోజు ఇంతటి దుర్భర పరిస్థితులు వచ్చాయి. ఈ రోజు గొంతెత్తి నినదిస్తున్నా మా గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు. మా కోసం ఎవరూ రావడం లేదు. అసలు మేం మనుషులం కాదా? మాపైనే ఎందుకిన్ని ఆంక్షలన్న ఆ మహిళల ఆవేదన మతోన్మాద పాలకుల ఏలుబడిలో అరణ్య రోదనే అవుతోంది.
         'ఎందుకంత గోల చేస్తున్నారు.. ఇవి సాంప్రదాయ ధోరణులు. మిమ్మల్ని స్వేచ్ఛ, గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకే ఇవి నిర్దేశించబడినవి. మీరు మేకప్‌ వేసుకుని ప్రార్థనలు ఎలా చేస్తారు? జుట్టు కత్తిరించుకుని ఎలా నిగ్రహంగా ఉంటారు?' వంటి అడ్డగోలు వాదనలను అక్కడి తాలిబన్లు వినిపిస్తున్నారు. 'మహిళలు చీరలే కట్టుకోవాలి. ఉద్యోగం చేసే మహిళ విర్రవీగి ఉంటుంది. అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే అది మహిళలదే తప్పు' అన్న మన బిజెపి పాలకుల మాటలు కూడా ఇలాగే ఉంటాయి. ఇంటి గోడలను దాటి బయటి విషయాల్లో కూడా జోక్యం చేసుకునే మతం నిర్వాకం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. తాలిబన్ల ఉన్మాదం, విద్వేషం మహిళల సర్వ హక్కులనూ కాలరాస్తున్నాయి. దీంతో తాలిబన్‌ మహిళలు అల్లాడిపోతున్నారు. మానసికంగా, శారీరకంగా కుదేలైపోతున్నారు. విశ్వవిద్యాలయాల్లోకి మహిళలకు ప్రవేశం లేదన్న నిబంధన పెట్టినప్పుడు ఎంతోమంది విద్యార్థినులు తీవ్ర ఒత్తిడికి గురైన సంఘటనలు తాజాగా వెలుగుచూశాయి.
        'పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాకు చావు తప్ప మరో మార్గం లేదు. విశ్వవిద్యాలయం నుండి నన్ను, నా స్నేహితులను తరిమేశారు. మేమంతా తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాం.. మా ముందరి భవిష్యత్తు అంతా అంధకారంగా తయారైంది' అంటూ 20 ఏళ్ల ఆప్ఘన్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి కన్నీటిపర్యంతమౌతూ చెబుతోంది. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆ యువతి ప్రయత్నాన్ని అడ్డుకొన్న తల్లిదండ్రులు ఇప్పుడామెకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు. 'ఇక్కడ మాకు విద్య, ఉపాధే కాదు.. ఆకలి బాధ కూడా కాదు.. ఈ పరిస్థితులు మమ్నల్ని రోజురోజుకూ చంపేస్తున్నాయి. భవిష్యత్తు మీద ఆశలు సన్నగిల్లి జీవితమంటేనే అసహ్యమేస్తోంది' అంటూ కౌన్సిలింగ్‌ తీసుకుంటున్న మరో యువతి ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెబుతోంది.
        'చదువు లేదు, భవిష్యత్తు లేదు.. ఇంట్లో ఉండి మేమేం చేయాలి? అసలు ఈ జీవితం ఎందుకు? ఈ ఆలోచనలు నాకు నిద్రపట్టనివ్వడం లేదు. ఏ విషయం మీద నాకు ఆసక్తి కలగడం లేదు. తీవ్ర మానసిక ఒత్తిడితో రోజంతా ఏడుస్తూ కూర్చొనే ఉంటున్నాను' అంటూ డాక్టరు కావాలని కలలుగన్న మరో విద్యార్థిని బోరున విలపిస్తోంది.
         మహిళలను చదువుకు దూరం చేయమని, ఉపాధి లేకుండా చేయమని, నిర్బంధాలు విధించమని ఏ మతం చెప్పింది? కానీ అనాదిగా మతం పేరుతో మహిళలపై అణచివేత కొనసాగిస్తూనే ఉన్నారు.