భారత సాహిత్యంలో గజల్‌కు విశేష ప్రాచుర్యముంది. కాస్త నెమ్మదిగానైనా తెలుగులో కూడా గజల్ సాహిత్యానికి పెద్దపీట లభించింది. దక్షిణ భారతంలో మొట్టమొదటగా ఉర్దు పర్షియన్ భాషల్లో గజల్స్ సృష్టించింది నెల్లూరీయుడు జూకా. జూకా అనేది కలం పేరు. యావత్ దక్షిణ భారతదేశంలోంచి గాలిబ్ మహాకవి ఏకలవ్య శిష్యుడితనే. ఉర్దూ, పర్షియన్ భాషల్లో గాలిబ్ శిష్యులు ఇంకెవరూ ఈ ప్రాంతం నుంచి లేరు. జూకా మరణించింది 1875వ సంవత్సరంలో. అయినా దాదాపు 100 సంవత్సరాలు అజ్ఞాత కవిగానే మిగిలిపోయారు. అసలు జూకా ఎవరు? జూకా గురించి చదివేముందు వారి పూర్వులను గురించి కొంత తెలుసుకోవాలి.
కళ్ళికోట యుద్ధాననంతరం 1565లో ఉదయగిరి గోల్కొండ పాలన కిందకు వచ్చింది. 1684లో ఔరంగజేబు దక్షిణ పథాన్నంతా ఆక్రమించాడు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంతాన్ని విభజించారు. దక్షిణ భారతదేశంలోని మొగలు సామ్రాజ్యాన్ని ఆరు భాగాలుగా విభజించి పరిపాలనను సులభం చేసుకున్నాడు. ఈ ఆరు భాగాల్లో బీజాపూర్ ప్రాంతం చాలా పెద్దది. ఔరంగాబాదు నుంచి మధుర వరకు వుండేది. అందువల్ల బీజాపూర్‌ను మరలా రెండు భాగాలుగా చేసి బీజాపూర్, కర్ణాటక బీజాపూర్‌లుగా విభజించి, కర్నాటక బీజాపూర్‌లో చాలా భాగానికి పాలిగాండ్లను, జాగీరుదార్లనూ ఏర్పాటు చేశారు. ఆర్కాట్ కేంద్రంగా హైద్రాబాద్ విభాగంలోకి ఉదయగిరి సర్వేపల్లిని చేర్చారు. ఆర్కాట్ మొదటి పాలకుడు సాదత్ ఉల్లాఖాన్. ఈతను నవాయితీ వంశస్థుడు.
ఉదయగిరి వ్యవహారాలు చూడటానికి ఫౌజ్‌దారుగా ముస్తఫా ఆలీఖాన్‌ను నియమించారు. ఈ ఆలీఖాన్ తనకు నిర్వహణాది కార్యక్రమాల్లో సహాయం చేయటానికి జూకా తాతను (తండ్రికి తండ్రి) హఫిజ్ మహమద్ అలీను నియమించి ఉదయగిరికి సంబంధించిన బాధ్యతలను అప్పగించాడు. అప్పుడే వీరు బీజాపూర్ నుంచి సంసారంతో సహా ఆర్కాటుకు వచ్చి, అక్కడి నుంచి నెల్లూరు వచ్చారు. జూకా తండ్రి హఫీజ్ అహమ్మద్ మీరానాయతీ, పిన తండ్రి పరిపాలనాధికారాన్ని పొందారు. ఉదయగిరి ఆఖరి జాగీరుదారు అబ్బాస్ అలీఖాన్ బ్రిటీషు వారికి ఎదురు తిరిగిన కారణంగా ఖైదీగా బంధించి చెంగల్పట్టులో వుంచారు. అతడు చెంగల్పట్టులో మరణించారు.
హఫీజ్ అహమ్మద్ మీరా నాయతీకి ఐదుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. వీరందరూ నెల్లూరు సంతపేటలోని మహమ్మద్ గౌస్ సత్రం (ప్రస్తుత సంతపేట మార్కెట్) అని పిలవబడుతున్న చోట జన్మించారు. ఇది వీరి మేనమామ ఇల్లు. గౌస్ సాహెబ్ జౌళి వ్యాపారస్తుడు. ఇతనికి బిడ్డలు లేని కారణంగా 'జూకా' పెద్ద అన్నయ్య హజీ రహంతుల్లాను దత్తు తీసుకున్నారు. (ఈతనే వి.ఆర్. కళాశాల భవన దాత)
జూకా అసలు పేరు మహమ్మద్ హబీబుల్లా. జననం 1828. చిన్నప్పుడు ఇంటివద్ద మౌల్వీ (గురువు) గారి చేత విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. తన 12వ ఏటినుండే కవిత్వం రాయటం అలవాటు చేసుకున్నారు. తర్వాత కాలంలో మద్రాసు నగరానికి వెళ్ళారు. అప్పట్లో బకింగ్‌హామ్ కెనాలు ద్వారా మాత్రమే రాకపోకలుండేవి. మద్రాసులో సయ్యద్ ముర్తుజా భీవిష్ అనే అతని వద్ద మూడేళ్లుశిష్యరికం చేశారు. ముర్తుజాభీవిష్ పర్షియన్ భాషలో అపారమైన కృషి చేసినవారు.
ఆనాటి మద్రాసు జాగీర్దారు నాలాజాహి వంశానికి చెందిన గులాం గౌస్ ఆజవ్న్‌కు కూడా కొంత సాహిత్య ప్రవేశం ఉండేది. వీరు 1846 నుంచి ప్రతి వారం 'ముషాయిరా'' (కవి సమ్మేళనం) నిర్వహించేవారు. ఈ కవి సమ్మేళనానికి జూకా తన గురువు ముర్తుజాభీవిష్ ఆదేశం మేరకు తన కవిత్వాన్ని పంపారు. జాగీర్దారు అయిన గులాంగౌస్ అజవ్న్ గారి ద్వితీయ వివాహం సందర్భంగా (ఇనామీ ముషాయిరా) కవి సమ్మేళనంలో అత్యుత్తమ కవిత రాసిన కవికి సన్మానం చేయదలచి మహమ్మద్ హుసేన్ రాఖిమ్ అనే కవి నిర్వహణలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. జూకా కవిత ఈ సమ్మేళనంలో చదవబడితే- తప్పకుండా అతనికే సన్మానం జరుగుతుందని, అందువల్ల తన ప్రాముఖ్యత పోతుందని భావించిన రాఖిమ్ ఒక నిబంధన విధించాడు. ఈ సమ్మేళనంలో కవే స్వయంగా చదివి వినిపించాలనేది ఆ నిబంధన. జూకాకు నత్తి కనుక, సమ్మేళనంలో పాల్గొనలేడన్న అతడి పన్నాగం నెరవేరింది. ఈ సంఘటన తరువాత జూకా నెల్లూరు వచ్చేసారు.
తదుపరి విమర్శక కవిత్వం రాశారు. అందులో జాగీర్దారు గులాంగౌస్ ఆజవ్న్ పేరు మీద రాయబడిన 'గుల్జార్ ఏఅజవ్న్' అనే గ్రంథం అసలు రచయిత రాఖీవ్న్ అని ఉదాహరణలతో సహా నిరూపించారు. తర్వాత వివాహం, ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. ఈ కాలంలో జూకా గాలిబ్ రాసిన 'పంచ్‌అహంగ్' చదవటం జరిగింది. పంచ్ అనగా ఐదు, అహంగ్ అనగా శబ్దాలు అని అర్థం. ఈ గ్రంధ పఠనం జూకా మెదడును కుదిపివేసింది. తానెంత బావిలో కప్పో తేల్చి చెప్పింది. 'యీ గ్రంథం చదవకముందు నేను సాహిత్యంలో చాలా కషి చేసానని అనుకునేవాణ్ణి, కానీ 'పంచ్‌అహంగ్' చదివిన తర్వాత నేను రచించిన రచనల్లో ఏమీ పస లేదని తేల్చుకున్నాను' అని ఆయన రాసుకున్నాడు కూడా! తరువాత గాలిబ్ వద్ద శిష్యరికం చేయాలనే ఏకైక ధ్యేయంతో ఢిల్లీకి ప్రయాణమచ్యాడు. అయితే, డబ్బు లేమి హైద్రాబాదులో ఆపేసింది. తిరిగి ధనం సంపాదించి ఢిల్లీ పోవాలనే తపనతో సోలార్‌జంగ్ వద్ద పర్షియన్ లేఖకుడిగా ఉద్యోగంలో చేరాడు. హైదరాబాదులో తను చేసిన రచనలు ఉత్తరాల ద్వారా గాలిబ్‌కు పంపి ప్రత్యుత్తరాలు పొందేవాడు. ఈ విశ్వంలో ఉండే కష్టాలు, మానవ జీవితం, భూమిపై జీవనం, ఈ మూడే ఈతని కవిత్వ ప్రేరణలు. గజల్ రచనల్లో నిష్ణాతులైన కవులు మీర్‌తఖీమీర్, మీర్ గాలిబ్ తమ రచనల్లో అనేకానేక భావాలను చొప్పించేవారు. కానీ, జూకా మాత్రం అతీంద్రియ భావాల తాలూకు నీడలు కూడా తన రచనలపై పడనీయలేదు. గజల్ రచయితల్లో ప్రత్యేక పంథా అనుసరించాడు. అతడి కషి తనకూ, తన గురువు గాలిబ్‌కు మధ్య అజ్ఞాతంగానే ఉండిపోయింది. అయితే 'తలామీజాఏ గాలిబ్' (గాలిబ్ శిష్యులు) అను అంశంపై పరిశోధన చేసిన ఢిల్లీవాసి మాలిక్‌రాం ... జూకా గురించి ప్రస్తావించారు.
ఉర్దూఎఅల్లా, ఊద్‌ఎహిందీ అనే రెండు గ్రంథాల్లో గాలిబ్ తాను ఇతరులకు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. వీటిని మాలిక్ రాం పరిశోధించి, జూకాకు గాలిబ్ మహాకవి రాసిన దాదాపు 20 ఉత్తరాల్లోని సారాంశాన్ని గ్రహించి, హైద్రాబాద్ వచ్చారు. ఇక్కడ జూకా బంధువులను అతి కష్టం మీద కలిసి ముద్రణకు నోచుకోని జూకా చేతి వ్రాత ప్రతులన్నింటినీ కొనుగోలు చేసి తీసుకుని వెళ్లాడు. వీటి ద్వారా జూకాను వెలుగులోకి తెచ్చిన మొదటి వ్యక్తి స్కాలర్ మాలిక్ రాం.
జూకా మరణానంతరం జూకా కుమారుడు మహమ్మద్ మీరా 'ఖాష్‌ఓఖుమాష్' (చెదురు మదురు లేఖలు)అనే గ్రంథాన్ని అచ్చు వేయించాడు. జూకా తానే సొంతంగా సంకలనం చేసి ఆ ప్రతిని గాలిబ్ మహాకవికి పంపి దానికి ముందుమాట రాయించి, తెప్పించి తన వద్దనే ఉంచుకొన్నాడు. ఇది దాదాపు 80 పేజీల చేతి రాత పుస్తకం. ఇందులో మానవ శృంగారాన్ని గజల్‌లో రాశారు. ఇది అంగాంగ వర్ణనా కవిత్వం కాదు. శాస్త్రీయ శృంగారం, మానవులకు అవసరం అనే దృష్టితో రాసిన గ్రంథం. ఈ రచనకు జూకా ఇంకో కలం పేరు ఉపయోగించారు. ఆ పేరు షేక్ అలీబేబాక్ అని. ఈ రాతప్రతి ప్రస్తుతం హసన్ ఉద్దీన్ అహ్మద్, ఐఏఎస్ (రిటైర్డ్) మదీనా కాంప్లెక్స్ హైద్రాబాదు వారి పుస్తక భాండాగారంలో ఉంది.
సమకాలీన సమస్యల ప్రతిస్పందనకు ఈ గజల్ ఒక ఉదాహరణ. అప్పటికే భారతదేశంలో ఇంగ్లీషు పరిపాలన వచ్చేసింది. బ్రిటీషు సంస్క ృతి ఎల్లడలా విస్తరిస్తోంది. దీన్ని చూచి ఈ కవి అంటాడు : ''నేను పరిమళాన్ని గ్రోలే పిట్టను ప్రతి పువ్వు వద్ద నేనుంటాను. కానీ పువ్వు పరిమళాన్ని వెదజల్లుతున్నదన్న భ్రమలో ఉన్న మీరు అది పరిమళమో, పిడుగు ప్రభంజనమో తెలుసుకోలేకున్నారు. ఎందుకంటే పువ్వు పరిమళాన్ని ఆస్వాదించే నాకు పరిమళమే కాకుండా ఉన్న గూడు కూడా లేకుండా పోయింది.'' ఎంతటి భావాన్నయినా చెప్పగలిగిన ఈ రెండు పాదాలు ఎంత చిన్నవో చూడండి.
''మోజే గుల్ భీహై కోయీ బర్ ఖే
భలా అయినన్ బహార్
యాతో గుల్ బాంధా ధాయా ఆజ్
ఆషియా మిల్ తా నహీ''
మచ్చుకు మరో తునక తనెంత ధైర్యవంతుడో చెప్తుంది.
''హిమ్మత్‌కి బులంధీ కొ కోయీ
ఓజ్ న నహుండే
హై నబ్జాఎ ఖానిదా ఫలక్ మేరే
ఢమన్ కా''
'' ధైర్యం ఎత్తులు కొలిచే ధైర్యవంతుడెవడూ లేరు. కానీ నా ధైర్యం ముందు ఆకాశం ఎండకు వంగిన మొక్కలాంటిది.'' మూర్ఖ మతస్థులకు తన గజల్ చర్నాకోలుతో ఓ చురక.
ఈ కవి తన జీవిత కాలంలో గాలిబ్‌ను కలవ లేదు. తన 47వ ఏట (1857) హైద్రాబాదులో చనిపోయాడు. వందేళ్లకు అజ్ఞాతంగా ఉన్న మహమ్మద్ హబీబుల్లా జూకా దక్షిణ భారతదేశపు తొలి గజల్ కవి. నెల్లూరు వి.ఆర్.కాలేజీ ఉర్దూ లెక్చరర్ డా. షేక్ అబ్దుల్ వహాబ్ .... జూకా కవిత్వం వ్యక్తిత్వంపై పరిశోధనను ఉర్దూలోనే చేసి 1986లో డాక్టరేట్ పొందారు. జూకా గురించి విపులంగా చర్చించిన తొలి పరిశోధక గ్రంథం ఇదే!
- ఈతకోట సుబ్బారావు
94405 29785










