Mar 26,2023 21:50

అవగాహన సదస్సులో ప్రముఖ వైద్యులు
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :
స్వీయ నియంత్రణతో హెచ్‌3ఎన్‌2, కోవిడ్‌ను ఎదుర్కోవొచ్చని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పిజె శ్రీనివాస్‌, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ కె ఫణీంద్ర తెలిపారు. విశాఖ డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం (ఎవికె)లో ఆదివారం హెచ్‌3ఎన్‌2, కోవిడ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎవికె ఆరోగ్య విభాగం హెడ్‌ టి కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వైద్యులు శ్రీనివాస్‌, ఫణీంద్ర మాట్లాడారు. ప్రస్తుతం ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని, దీనిపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారీ సీజనల్‌ జ్వరాలు ఉధృతమవుతున్నాయని, కాకపోతే ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా వాటి ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది స్వైన్‌ ఫ్లూతో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఐసిఎంఆర్‌ విశ్లేషించిందన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల్లో ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువ ఉందని, కోవిడ్‌లోని ఎక్స్‌ వేరియంట్‌ ద్వారా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ఉధృతమవుతుందని తెలిపారు. ఈ వైరస్‌ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటాయన్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలిపారు. నివారణకు సాధారణంగా వాడే మందులు సరిపోతాయని, దీనివల్ల ప్రమాదం లేనప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పరీక్షలు ఎలా నిర్వహించుకోవాలో సూచించారు. .
ప్రజా వైద్యులు వైఎల్‌ నర్సింగరావుకు సన్మానం
సదస్సు అనంతరం ఆంధ్ర మెడికల్‌ కాలేజీ గైనకాలజీ విభాగాధిపతి, ప్రజా వైద్యులు వైఎల్‌ నర్సింగరావు దంపతులను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎపి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కె సత్య వరప్రసాద్‌ మాట్లాడుతూ ఆంధ్ర మెడికల్‌ కాలేజీకి నర్సింగరావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఉద్యోగ కాలంలో రోగుల సౌకర్యాల కోసం అధికారులతో పోరాడారన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ నర్సింగరావుతో ఏళ్ల కొద్దీ ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో విమ్స్‌ డైరెక్టర్‌ కె రాంబాబు, అల్లూరి విజ్ఞాన కేంద్రం కోశాధికారి పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు.