లండన్ : కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కంటే 'డిసీజ్ ఎక్స్'- అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ మానవాళి గడ్డు పరిస్థితులనే ఎదుర్కొవాల్సి ఉంటుందని లండన్‌కి చెందిన ఆరోగ్య నిపుణురాలు కేట్ బిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈమె 2020 మే నుంచి డిసెంబర్ వరకు వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమె తాజాగా 'డైలీ మెయిల్'కిచ్చిన ఇంటర్వ్యూలో డిసీజ్ ఎక్స్ గురించి వెల్లడించారు. 'డిసీజ్ ఎక్స్ 1919-1920 నాటి స్పానిష్ ఫ్లూ కంటే ప్రభావవంతమైన వైరస్. డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం డిసీజ్ ఎక్స్ వైరస్, ఫంగ్, బ్యాక్టీరియాలకు ఓ కొత్త ఏజెంట్ కావొచ్చు. దీనికి సరైన చికిత్స కూడా లేదు. 1918 - 19లో వచ్చిన ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోయారు. మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన వారి కంటే ఈ ఫ్లూ మహమ్మారి వల్లనే అప్పుడు రెండింతల జనాభా చనిపోయారు. అటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా ఎదురవొచ్చు. అప్పుడు చనిపోయినట్టుగానే.. డిసిజ్ ఎక్స్ వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా రెండింతలు మరణాలు సంభవించవచ్చు. భవిష్యత్తులో రాబోయే డిసీజ్ ఎక్స్ వల్ల దాదాపు 50 మిలియన్ల మంది చనిపోయే ప్రమాదముంది. ఇప్పటికే ఎన్నో వైరస్‌లు పుట్టుకొచ్చాయి. ఈ వైరస్‌ల నుంచే పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్ వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఈ వైరస్‌ల నివారణకు తక్షణమే సామూహిక టీకా డ్రైవ్‌లకు సిద్ధం కావాలి. తగిన సమయంలో డోస్‌లను పంపిణీ చేయాలి' అని ఆమె ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
'ఇప్పటికే 25 వైరస్ జాతికి చెందినవి వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. లక్ష కంటే ఎక్కువ వేరియంట్స్‌ని కనుగొన్నారు. కోవిడ్ 19 మరణాలు ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ మంది జనాభా చనిపోయి ఉండొచ్చు. కోవిడ్ - 19 వైరస్ వల్ల ప్రజలు త్వరగానే కోలుకున్నారు. డిసీజ్ ఎక్స్‌తో పోలిస్తే.. కోవిడ్ -19తో అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. అయితే డిసీజ్ ఎక్స్ ఎబోలా మరణాల రేటుని పోలి ఉంటుంది. ఇదొక అంటువ్యాధిలా... అందిరికీ త్వరగా సోకుతుంది. బర్డ్‌ఫ్లూ, ఎంఇఆర్‌ఎస్-కోవిడ్ వైరస్‌ల కన్నా ఎబోలా మరణాల రేటు దాదాపు 67 శాతం ఉంది. ఈ మహమ్మారిలతో పోల్చి చూసుకుంటే.. భవిష్యత్తు కాలంలో రాబోయే మహమ్మారి వల్ల మరణాల రేటు ఎవరూ ఊహించలేని స్థాయిలోనే ఉండొచ్చు' అని ఆమె అన్నారు.
'నేటికాలంలో అంటువ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎక్కువమంది ప్రజలు నగరాల్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. దీంతో అంటువ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. అటవీ నిర్మూలన.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, చిత్తడి నేలల నాశనం కారణంగా.. వైరస్‌లు ఒక జాతి నుండి మరొక జాతికి రూపాంతరం చెందుతున్నాయి' అని కేట్ బిన్ అన్నారు.
ఇక డిసీజ్ ఎక్స్ గురించి డబ్ల్యుహెచ్‌ఓ మే నెలల్లోనే హెచ్చరించింది. ఈ డిసీజ్ ఎక్స్ ఒకరి నుండి మరొకరికి అంటువ్యాధిలా సంభవించే అవకాశముందని తెలిపింది. అలాగే కోవిడ్- 19 వైరస్ గురించి డబ్య్లుహెచ్ 2018లోనే ప్రస్తావించింది. డబ్ల్యుహెచ్‌ఓ గుర్తించిన ఒక సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకి ఎంతోమందిని బలితీసుకుంది.