Nov 16,2022 10:27
  • విద్యార్థులకు నామమాత్రపు వసతులు
  • ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం
  • పట్టించుకోని ప్రభుత్వాలు

ప్రజాశక్తి-మడకశిర రూరల్‌ (శ్రీ సత్యసాయిజిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే బిసి రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్ట వేశాయి. వాటి పరిష్కారంపై ఏ ప్రభుత్వమూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 110 గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. సుమారు 36 వేల మందికిపైగా విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అభ్యసిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడిచిన పాఠశాలల నుంచి కొన్నింటిని వేరు చేసి బిసి వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌గా మార్చారు. ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలల్లో దశాబ్దాలుగా అనేక సమస్యలు తిష్ట వేశాయి.
         గురుకుల పాఠశాలల్లో బోధన పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిల్లో జరుగుతోంది. ఇక్కడ విద్యార్థుల దినచర్య ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై రాత్రి పది గంటలకు ముగుస్తుంది. సుమారు 10 గంటలసేపు నాలుగు గోడల మధ్య విద్యార్థులు కూర్చోవాలి. ఈ మూస విధానం వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. విశాలమైన ఆటస్థలం, లైబ్రరీ, టీవీ రూమ్‌ లాంటివి చాలా పాఠశాలల్లో లేవు. చాలా వరకు ఇరుకు, అద్దె భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. 500 మంది రెగ్యులర్‌, మిగతా వారంతా అవుటోసోర్సింగ్‌, గెస్ట్‌ టీచర్స్‌తో విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో వార్డెన్లు, కేర్‌టేకర్లు మచ్చుకైనా కనిపించరు. ఆ విధులన్నింటినీ ఉపాధ్యాయులే చేయాల్సి రావడంతో అది బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఉపాధ్యాయులకూ సమస్యలు
గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులనూ సమస్యలు వెంటాడుతున్నాయి. వీరిని ఉపాధ్యాయులు అనడం కంటే మల్టీపర్పస్‌ వర్కర్స్‌ అనడం సముచితం. వేలాదిమంది విద్యార్థులు ఉండే ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులే వార్డెన్‌ విధులనూ నిర్వహించాల్సి వస్తోంది. సంవత్సరానికి ఒక్కరు చొప్పున కిచెన్‌ వార్డెన్‌ విధులు నిర్వహించాలి. వైస్‌ ప్రిన్సిపల్‌ స్థానంలో అసిస్టెంట్‌ ప్రిన్సిపల్‌ పేరిట మరొక టీచర్‌ పనిచేయాలి. హౌస్‌మాస్టర్‌ పేరిట 40 మంది విద్యార్థుల బాగోగులు ఒక టీచర్‌ చూడాలి. ఉదయం ఎనిమిదిగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేసే ఉపాధ్యాయులు ప్రపంచంలో బహుశా ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. సెలవు రోజుల్లో కూడా కొంతమంది పని చేయాల్సి ఉంటుంది. దీనికితోడు రోజూ రాత్రిపూట పాఠశాలకు కాపలాకాసే పని కూడా వారిదే. మహిళా ఉపాధ్యాయులు సైతం రాత్రి సమయంలో అక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాత్రి విధులు చేయకుంటే ఉన్నతాధికారులు మెమోలు పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబ్బందులపై గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించగా ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా ఈ తీర్పును అమలు చేయడంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ఉపాధ్యాయులు ఇన్ని బోధనేతర పనులు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధను ఎలా అందిస్తారన్నది ప్రశ్నార్థకంగానే మిగులుతోంది. గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల జీతభత్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 2018లో నేరుగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఇంతవరకు సిపిఎస్‌ కూడా లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీకి కనీస వేతనం ఇవ్వడం లేదు. ఇక ఏళ్ల తరబడి బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు.
 

                                                        విద్యాశాఖ పరిధిలోకి తీసుకోవాలి : ఉపాధ్యాయులు

గురుకుల పాఠశాలలను విద్యాశాఖ పరిధిలోకి తీసుకుని ప్రభుత్వంలోకి విలీనం చేయాలని, రెగ్యులర్‌గా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని, బోధనేతర పనులను మినహాయించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వార్డెన్లు, కేర్‌ టేకర్స్‌ని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.