మనదేశంలో గుమ్మడికాయకు మంచి స్థానమే ఉంది. ఎక్కువగా శుభకార్యాల్లో వాడటం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్నది. గుమ్మడి కాయతో.. కూర, స్వీటు ఇలా పరిమిత రుచులే మనకు పరిచయం. కానీ రకరకాల వంటలు చేసుకోవచ్చు. జ్యూస్, సూప్‌లా కూడా తీసుకోవచ్చు. అయితే గుమ్మడిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మలబద్ధకం నుంచి మధుమేహం వరకూ చాలా వ్యాధుల నివారణకు ఉపయోగపడే లక్షణాలు గుమ్మడిలో ఉన్నాయి. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారుచేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు. పూవు, కాయ, తొడిమ, ఆకు... అన్ని భాగాలూ ఔషధ గుణాలు కలిగి ఉపయోగపడేవే. ఇప్పుడు పూలతో కొన్ని రుచులను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
- బజ్జీ..
కావలసినవి : పూలు - 10, కార్న్‌ఫ్లోర్ - కప్పు, మైదా - 1/4 కప్పు, బియ్యంపిండి - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - స్పూను, అల్లం పేస్ట్- స్పూను
తయారీ : శుభ్రం చేసిన పూలను పక్కనుంచుకోవాలి. గిన్నెలో పైన తెలిపిన పదార్థాలన్నింటినీ నీటితో జారుగా కలపాలి. బాండీలో నూనె వేడి చేసి, ఒక్కొక్క పువ్వును పిండిలో ముంచి డీప్‌ఫ్రై చేయాలి. గుమ్మడి పూల బజ్జీ రెడీ. అదే నూనెలో మధ్యకు చీల్చిన పచ్చిమిర్చిని దోరగా వేయించి, బజ్జీలకు జత చేసి తింటే కమ్మకమ్మని రుచిని ఆస్వాదించొచ్చు.
- పచ్చడి ..
కావలసినవి : గుమ్మడిపువ్వులు - 10, ఎండుమిర్చి - 6, ధనియాలు - స్పూను, జీలకర్ర - 1/2 స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 6, చింతపండు గుజ్జు - స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 స్పూన్లు
తయారీ : బాండీలో నూనె వేడి చేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దోరగా వేయించుకోవాలి. అవి తీసేశాక, ఆ నూనెలోనే పువ్వులు వేసి, వేయించాలి. అన్నింటినీ మెత్తగా నూరి చింతపండు గుజ్జు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి నూరుకుంటే పచ్చడి రెడీ. దీనికి చివరిలో తాలింపు పెట్టడమే. గుమ్మడి పువ్వుల పచ్చడి రెడీ.
- కూర..
కావలసినవి : పువ్వులు - 10, ఉల్లి తరుగు - 3 స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్లు, వెల్లుల్లి తరుగు - స్పూను, పచ్చికొబ్బరి తురుము - 2 స్పూన్లు, ఉప్పు, కారం - తగినంత, నూనె - 2 స్పూన్లు
తయారీ : పువ్వులను విడదీసి, శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసి, వేయించాలి. ఎర్రగా వేగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. దానిలో పువ్వుల తరుగు, కొబ్బరి తురుము వేసి తిప్పుతూ ఉడికించాలి. దగ్గరకొచ్చిన తరువాత కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన గుమ్మడి పువ్వుల కూర రెడీ.
- పకోడీ ..
కావలసినవి : పువ్వులు - 10, బియ్యంపిండి - రెండు స్పూన్లు, శనగపిండి - కప్పు, పచ్చిమిర్చి - తగినన్ని, ఉల్లిపాయ తురుము - 1/2 కప్పు (నిలువుగా కట్ చేసినవి) , పసుపు - 1/2 స్పూను, కలోంజి సీడ్స్ - స్పూను, ఉప్పు - తగినంత.
తయారీ: పువ్వుల తొడిమలు కట్ చేసి శుభ్రం చేయాలి. పైన తెలిపిన పదార్థాలన్నీ నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి. చేతితో కొద్ది కొద్దిగా తీసుకుని, నూనెలో వేసి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ డీప్ ఫ్రై చేయాలి. అంతే రుచికరమైన పూల పకోడీ రెడీ. అదే నూనెలో మధ్యకు చీల్చిన పచ్చిమిర్చిని దోరగా వేయించి. టమాటాసాస్‌తో సర్వ్ చేసుకుంటే బాగుంటాయి.