జిడిపికి అధిక ధరల పోటు
న్యూఢిల్లీ : భారత దేశ ప్రగతి తిరోగమన దిశలో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 4.4 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. 2022 జూన్ నుంచి ఆగస్టుతో ముగిసిన రెండో త్రైమాసికంలో జిడిపి 6.3 శాతంగా చోటుచేసుకోగా.. ఇంతక్రితం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదైంది. ఈ రెండు త్రైమాసికాలతో పోల్చితే గడిచిన క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని చవిచూసిందని స్పష్టమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని బిజెపి పాలకులు చేస్తున్న ప్రచారానికి తాజా గణంకాలు షాక్‌ను ఇస్తున్నాయి.
గడిచిన క్యూ3లో 2011-12 వాస్తవ ధరల ప్రాతిపాదికన వాస్తవిక జిడిపి విలువ రూ.40.19 లక్షల కోట్లుగా నమోదైంది. 2011-12 ఇదే క్యూ3లో రూ.38.51 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోల్చితే గడిచిన క్యూ3లో 4.4 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చని గణంకాల మంత్రిత్వశాఖ తెలిపింది. 2021ా22 జిడిపి గణాంకాలను 8.7 శాతం నుంచి 9.1 శాతానికి సవరించింది. దేశంలోని అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా పెంచిన వడ్డీ రేట్లు జిడిపి వృద్ధి రేటును దెబ్బతీశాయి. హెచ్చు ధరల వల్ల దేశంలో వస్తువులకు డిమాండ్ పడిపోయింది. ఈ ప్రభావం తయారీ ఇతర రంగాలపై ఎక్కువగా పడింది.
ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చింది. గడిచిన క్యూ3లో ఈ రంగం 1.1 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం క్యూ2లో ఇది 3.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మరోవైపు వ్యవసాయ రంగం మాత్రం క్యూ2లో 2.4 శాతం పెరగ్గా.. క్యూ3లో 3.7 శాతం వృద్ధిని కనబర్చింది. విద్యుత్, నిర్మాణ రంగాలు వరుసగా 8.2 శాతం, 8.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. హోటళ్లు, రవాణా రంగం క్యూ2లో 15.6 శాతం వృద్ధిని సాధించగా.. క్యూ3లో 9.7 శాతానికి పడిపోయాయి. రక్షణ రంగం 5.6 శాతం నుంచి 2 శాతానికి క్షీణించింది. 2022ా23లో భారత జిడిపి 7 శాతం వృద్ధిని కనబర్చనుందని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఫలితాలు చోటుచేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ఆందోళన పెంచుతోంది.










