నిన్న మొన్నటి వరకు
నింగికెగిసిన కీర్తిపతాక
ఇప్పుడు అచ్చం మాపుగుడ్డలా వుంది
సూర్యుడు చంద్రుడు
మేకప్పులు మార్చుకునేంతలోపు
ఇక్కడ సన్నివేశాలు మారిపోతుంటాయి
దేవుడికి తెలియకుండానే
సంధించబడుతున్న బాణం
కొన్ని జాతుల చరితల్ని చెండుతుంటుంది
ఇంకొన్ని మూకలకు రక్షణ వలయమవుతుంది
మరి కదులుతున్న ఈ కొత్త పారాయణం
పాడుతున్న మాయా విద్వాంసుడిని
అజకట్టాల్సి వుంది
ఇక్కడ పసినవ్వులో రసికత వెతకబడుతుంది
ఇక్కడ పైచెయ్యి కోసం అల్పుడిపై
వజ్రాయుధం విరుచుకు పడుతుంది
ఇక్కడ నమ్మకం నమ్మించి మోసం చేస్తుంది
ఇక్కడ ఆలపించబడ్డ గేయాలన్నీ
గొంతు చించుకుంటున్న ఆర్తనాదాలే
ఇక్కడ తాపడం చేయబడ్డ బూతులన్నీ
నిఘంటువులెరగని నానార్థాలే !
స్త్రీలు గౌరవించబడ్డ దగ్గర దేవతలుంటే
హింసించబడ్డ దగ్గర దెయ్యాలుంటాయనేగా
ఇప్పుడీ దేశాన్ని దెయ్యాల కొంప అనాలేమో!
కంటిముందు కదలాడుతున్న
దృశ్య రహస్యాల వెనక నిజానిజాల్లోని
ఇజాఇజాలు ఎప్పటికీ బహిర్గత రహస్యాలు
పువ్వులన్నీ కలిసి కూడగట్టుకున్న
తోట సౌందర్యానికి తానొక్కతినే కారణమని
ఒక పువ్వు పదే పదే ఓట్రించడం
సహచర పువ్వు పరిమళంపై
దాడులకు తెగబడటం ఏ సిద్ధాంతం ప్రకారం
సమధర్మమో తేల్చి చెప్పాలిప్పుడు ..!
రమారమీ
రెండు వందల కోట్ల కన్నుల నుంచి
కురుస్తున్న వానల సాక్షిగా
ఇప్పుడు దేశంలో ద్ణుఖం పుష్కలంగా పండుతుంది!
- బంగార్రాజు కంఠ
85003 50464










