Nov 14,2022 07:38

కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం గెలుచుకున్న 'బాలల తాతా బాపూజీ' పుస్తకమే కాకుండా నన్ను అమితంగా ఆకర్శించే డా.పత్తిపాక మోహన్‌ మరో పుస్తకం 'ఆకుపచ్చని పాట'. పత్తిపాక మోహన్‌కు సాహిత్య అకాడమి పురస్కార ప్రదానం, ఆయన బాల సాహిత్య రజతోత్సవం సందర్భంగా 'ఆకుపచ్చని పాట' గురించి ముచ్చటిద్దాం. ఈ పుస్తకంలో 25 గేయాలున్నాయి. ఆ గేయాలకు చక్కని బొమ్మలుఉన్నాయి. చిన్న పిల్లలు కూడా సునాయాసంగా ఆసక్తితో ఈ పుస్తకం చదవగలరు. అతి తేలిక పద నిర్మాణంతో మోహన్‌ ఈ గేయాలను విరచించారు.
        మొదటి గీతం 'జేజేలు'లో అమ్మను అనురాగపు కొమ్మ అనీ, నవమాసాలు మోసి కని, పెంచిన బంగరుతల్లి అనీ... నాన్నేమో మమకారపు పాలవెల్లి అనీ చెప్పి పిల్లల్లో తల్లితండ్రుల మీద ప్రేమను మొలకెత్తించడానికి ప్రయత్నించారు. 'స్వచ్ఛ గణపతి' గేయంలో మట్టి గణపతిని పూజించుటే మేలని, రసాయనిక రంగులు పూయడం తప్పని హితబోధచేసి... మట్టి గణపతిని అనుపు చెయ్యడం వల్ల చెరువులు, వాగులు, చెల్కల్ని స్వచ్ఛజలాలతో ఉంచగలమని ప్రకటిస్తారు. 'ప్రగతి బాట' గేయంలో పల్లెలెలా ఉండాలో చెబుతారు.
      'చెట్టును నేను' గేయంలో చిన్న పాదాల్లో అతి పెద్ద భావాలను ఎలా ప్రకటించొచ్చో చూడవచ్చు. 'ఇంటిలోన నేనుంటే / ఇల్లంత క్షేమం / తోటలోనే నేనుంటే / ఊరెంతో ఆనందం' అని చెట్టు స్వగతాన్ని పలికించారు. 'బడి-గుడి' గేయం కూడా ఇటువంటిదే. ఈ గేయం చివరిలో- 'శుచి శుభ్రత తెలిసొస్తే/ ఇల్లు స్వర్గమవుతుందోరు / బడి గుడిలా అనిపిస్తే / చదువు దైవం అవుతుందోరు' అని పేర్కొన్నారు.
'స్వచ్ఛ సైనికుడు'లో యుద్ధ సైనికుడు మాతృభూమి రక్షణకోసం నిలబడితే, చెట్టు స్వచ్ఛభారత్‌ నిర్మాణానికి సైనికుడై నిలుస్తుందని చెప్పడం మంచి భావుకత. పల్లె వర్ధిల్లితే ఏమవుతుందో, పల్లె వర్ధిల్లాలంటే ఎలా ఉండాలో కూడా ఈ పుస్తకంలో చెబుతాడు కవి. పల్లెలాగ పట్నముంటె దేశ ప్రగతికి అడ్డే ఉండదని, అందరూ కలిసి పనిచేయాలని, పరిసరాలు కాపాడుకుంటే బతుక్కు భయముండదని చెప్పే గేయం 'పల్లె పచ్చగుంటే'.
ఈ సంపుటిలోని గేయాలన్నీ ఆకుపచ్చని గేయాలే. భూమాత గాయాలను తుడిచి హరితంగా వెలగాలన్న తపనతో రాసినవే. 'ఆరుబయట' గేయంలో 'మనమంతా మానవులం/ జంతువులం కాదు కదా!' అని మనలోని లోపాన్ని ఎత్తి చూపిన కవి-
     'ఒకటి రెండు పనులెపుడు/ చాటున జరగాలి కదా/ తలుపుచాటు ఉంటేనే / పరువు మనకు మిగులు కదా' అని హితబోధ చేస్తాడు. 'స్వచ్ఛదండు'లో పిల్లల మీద తనకుండే నమ్మకాన్ని వెలిబుచ్చుతాడు ఈ బాలల మిత్రుడు. 'బడినుండే ఏదైనా/ మొదల్కెతే శుభం శుభం/ విద్యార్థులు పూనుకుంటె/ ప్రతిపనిలో జయం జయం' అన్ని 'స్వచ్ఛభారత్‌' కు శుభారంభం బడి నుండే కావాలని ఆకాంక్షిస్తారు. పరిశుభ్రతను గురించి పిల్లలకు బోధిస్తూ- 'బడిపిల్లలు పూనుకొని / స్వచ్ఛదండుయై కదలాలి / జనగణ మన గీతంలా / ఆకుపచ్చపాట పాడాలి' అని పిల్లలకు మంచి సందేశాన్నిచ్చారు.
       సరళమైన పదాలతో, చిట్టిచిట్టి పాదాలతో పిల్లల నాలుకల మీద నర్తించే గీతాలు రాయడం పత్తిపాక మోహన్‌కు తెలిసిన విద్య. అటువంటి దివ్యధనమే 'దివ్యధనం' గీతం- 'భూమి మనది/ గాలి మనది/ జీవించే హక్కు మనది/ తరతరాల ఈ సంపద/ తరగకుండ చూడాలి' అని చెబుతూ స్వచ్ఛతను ఒక దివ్యధనంగా పేర్కొని పిల్లలను ఉత్తేజపరిచారు. కాలుష్యం వల్ల మనకు కలిగే ప్రమాదాలను, పచ్చదనం, పరిశుభ్రతల ప్రమోదాలను, ప్రయోజనాలను ఈ పుస్తకంలో అనేక గేయాల్లో వివరించిన మోహన్‌ ప్రత్యేకించి 'కాలుష్యం'పై రాసిన గేయంలోనూ దానిని బలంగా చెప్పారు.
          'శుభ్రbళిన లోగిళ్ళు/ భగవంతుని ఆలయాలు/ స్వచ్ఛమ్కెన పరిసరాలు/ నాగరికత ఆనవాళ్ళు' అంటారు. అంతటితో ఆగక-
   'స్వచ్ఛతయే దేవుడని / గాంధితాత అన్నాడు'/ స్వచ్ఛంగా బతికి తాను / గౌరవాన్ని పొందాడు' అని గాంధీని, ఆయన ఆచరణను పిల్లలకు అర్థమయ్యేలా చెబుతారు. గాంధీతత్వ్తాన్ని బాలలకు అందించినందుకే కదా, మోహన్‌కు సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. మానవుడు సంఘజీవి, బుద్ధిజీవి. అటువంటి వాడు హద్దుమీరి చేసే పొరపాట్లతో భూగోళానికి ఎన్ని ఇబ్బంధులు ఏర్పడుతున్నాయో, జీవజంతుజాలానికి ఎంత నష్టం కలుగుతుందో మనకు తెలుసు. మానవుడు చేస్తున్న పొరపాట్లను బాలలకు బాల్యంలోనే తెలియజేస్తూ, భవిష్యత్తులో రేపటి పౌరులు వాటిని చేయకూడదన్న తపనతో రాసిన గేయం 'బుద్ధిజీవి'. సఫాయీ కార్మికులు చేసిన, చేస్తున్న సేవలు అమూల్యం, ప్రశంసనీయం. మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నప్పుడు తమ ప్రాణాలకు తెగించి వైద్యులు, పోలీసు ఇతరులతో పాటు వాళ్ళు చేసిన సేవలు, త్యాగాలు మనం చూశాం. వాళ్ళను 'ఆరోగ్య దూతలు' అని అంటారు మోహన్‌. 'అగ్నిగోళం' పిల్లలనే కాదు పెద్దలనూ ఆలోచింపజేసే గేయం. పర్యావరణ సమస్యపై పూర్తి అవగాహన కలిగించే బాల గీతం ఇది. ఇందులో 'విశ్వం' అనే గేయం కూడా ఉంది. ఇది పర్యావరణ విపత్తుల గురించి పిల్లలకు అవగాహనను పెంచి ఆలోచనలను కలిగిస్తుంది. తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ, ఆ పండుగ వెనుకవున్న పర్యావరణ నేపథ్యాన్ని 'ఎరువు' గేయంలో చెప్పారు. గాంధీ పట్ల, ఆయన మార్గం పట్ల, ఆచరణ పట్ల, తత్వ్తంపట్ల కవికి అపారమైన గౌరవం, నమ్మకం. అది ఆయన గేయాలన్నింటిలో కనిపిస్తుంది. 'గాంధీమార్గం' గేయంలో కవి 'పల్లెటూర్లు దేశానికి పట్టుగొమ్మలు' అని చెప్పి- 'పరిసరాలు శుభ్రమైతె / పల్లె సీమయే స్వర్గం / పాడిపంట వర్ధిల్లితె / అన్నపూర్ణ ఆ దేశం / శుభ్రతను పాటిస్తే / అదే రామ రాజ్యం' అని చెబుతారు.
       'జీవనగీత'లో 'మనసు శుభ్రమైతె / మాత్సర్యం ఉండదు / మనం శుభ్రమైతె/ అనారోగ్య మంటదు', 'ఇల్లు శుభ్రమైతె / వెల్లువెత్తును ఆరోగ్యం / ఊరు శుభ్రమైతే / అభివృద్ధికి ఆదర్శం' అంటారు. పచ్చని చెట్లకు 'ఆహ్వానం' పలికిన కవి అందుకు వానలు కురావాలని కోరతారు. వర్షాకాలం వర్ణనతో గేయాన్ని నింపి, ప్రకృతి వ్యవసాయం గురించి కూడా పరిచయం చేసి భూసారం నిలపండని బాలలను, పెద్దలను కోరుతారు. ఈ 'ఆకుపచ్చని పాట'లో ప్రకృతి, పర్యావరణం, పచ్చదనం, పరిశుభ్రతతో పాటు వైజ్ఞానిక అంశాలకు సంబంధించిన గేయాలు కూడా ఉన్నాయి. ఇందులోని 'పరిసరాలు' గేయం పరిసర విజ్ఞాన సుభాషితాలు చెప్పే గేయం.
        డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ తన నైపుణ్యమంతా రంగరించి ఈ 'ఆకుపచ్చని' గీత రచించారు. మానవాళికంతకు నేడు అవసరమైన పరిశుభ్రత అంశాన్ని సరళ భాషలో గేయాలుగా మలిచి మన పిల్లల కందిండం చాలా అభినందించదగిన విషయం. 2022 సంవత్సరపు ప్రతిష్టాత్మక 'కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం' ఇవ్వాళ్ళ అందుకుంటున్న బాల సాహితీవేత్త డా. పత్తిపాక మోహన్‌కు శుభాకాంక్షలు. భవిషత్తులో మరిని 'బాలగీత'లు ఆయన కలం నుంచి రావాలని ఆకాంక్షిద్దాం.

(నేడు డాక్టర్‌ పత్తిపాక మోహన్‌కు ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార ప్రదానం జరుగుతుంది.)
- బెలగాం భీమేశ్వరరావు
99895 37835