ప్రముఖ తెలుగు కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ ఇటీవల తన వర్ణలిపి కవితా సంపుటికిగానూ పనోరమా అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సంభాషణ టూకీగా ....
పనోరమా అంతర్జాతీయ అవార్డు అందుకున్నాక మీ అనుభూతి ఏమిటి ?
నా తాజా 9వ కవితా సంపుటి వర్ణలిపి ఇండో గ్రీస్ సంస్థ రైటర్స్ కాపిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 2023 పనోరమా గోల్డన్ బుక్ అవార్డు పొందినందుకు గొప్ప ఆనందం కలిగింది. ప్రపంచంలోని వివిధ భాషల సరసన ఒక తెలుగు కవిత్వం కూడా విజేతగా నిలవడం, అవార్డు అందుకోవడం తెలుగు భాషకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గ్రీకు, స్పానిష్, ధారు, ఇంగ్లీషు లాంటి భాషల మధ్య తెలుగు కవిత గెలిచింది. గ్రీస్, కొలంబియా, స్పెయిన్, చిలీ, ధాయిలాండ్, అమెరికా లాంటి దేశాల కవులతో కొందరు భారతీయ కవుల పుస్తకాలు ఈ అవార్డును అందుకున్నాయి.
మీ కవిత్వం ఆం.ప్ర ప్రభుత్వం పాఠ్య విషయంగా నిర్ణయించారు కదా! భావితరం విద్యార్ధులకు వచన కవిత్వ పరిచయం, అవగాహన పాఠశాల స్థాయిలోనే జరిగిందని అనుకోవచ్చా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది విడుదల చేసిన 9 వతరగతి తెలుగు పరిమళం అనే పాఠ్యపుస్తకం లో నా వచన కవిత 52 లైన్లు పాఠ్య విషయంగా ఇవ్వడం నా సాహితీ జీవితంలో ఒక ప్రతిష్టాత్మక విజయంగా తలుస్తాను. ఇతర కవిమిత్రుల వచన కవితలు కూడా ఇందులో వుండటం విద్యార్ధులకు ఈ ప్రక్రియ సమగ్రంగా పరిచయం చేసి సరైన అవగాహన కలిగిస్తాయి. ఇది శుభ పరిణామమే కదా? భవిష్యత్‌లో వారు ఈ ప్రక్రియ పట్ల ఆసక్తి కలిగి రచనలు కూడా చేయవచ్చు.
కవిగా మీ ధ్యేయం ?
కవిత్వం హదయభాషగా నమ్ముతాను. సమకాలీన భారత సమాజాన్ని సామాజిక స్పహతో కవిత్వీకరణ చేసి భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తుంటాను. మానవతా వాదమే సారాంశంగా నా కవిత్వ రచనలు సాగుతుంటాయి. అలతి అలతి పదాలలో అనల్ప భావాలు చెప్పడం నాకు ఇష్టం.
ఈనాటి తెలుగు కవిత్వం అంతర్జాతీయ స్థాయిలో రాణించా లంటే ఎలా ఉండాలి ?
ఈనాటి తెలుగు కవిత్వం ఇప్పటికే అంతర్జాతీయ స్ధాయిలో రాణిస్తుంది. గొప్ప అభివ్యక్తి, వస్తు వైవిధ్యాలతో వెలువడి అలరిస్తూంది. మన చుట్టూ వున్న చిన్నఅంశాలను కూడా విశ్వజనీనం చేయడంలో తెలుగు కవి, భారతీయ కవి ముందు వరుసలోనే ఉన్నారు. మన ప్రాంతీయభాషల రచనలు విస్తతంగా ప్రపంచభాషల్లోకి అనువాద మయినపుడు మన రచనల గొప్పతనం ప్రపంచానికి మరింతగా తెలుస్తుంది. అప్పుడు ఇతర దేశాల సజనాత్మక సాహిత్యంతో తులనాత్మక అధ్యయనం చేసే వీలు కలుగుతుంది.
సంభాషణ : టేకుమళ్ల వెంకటప్పయ్య










