Aug 12,2023 08:26

రామాపురమను పల్లెన
రాముడనే పేరుండిన
షావుకారు ఒకడు కలడు
వ్యాపారపు వ్యాపకమున

గుర్రమొకటి పెంచెనతడు
శునకమునూ సాకెనతడు
పంజరాన అందమైన
చిలుకనొకటి ఉంచెనతడు

గుర్రమెక్కి దర్జాగా
ప్రయాణాలు చేయునుగా
షావుగారు గారి ఘనత
మారుమోగుతుండెనుగా

దొంగలెవరు రాకుండ
కుక్క కాపలా ఉండ
చిలుక ముద్దు పలుకులతో
గారాలను పోతుండ

కాలమలా కదలిపోయె
గుర్రమేమొ ముసలిదాయె
బరువు మోయలేకుండిన
ఆ గుర్రం భారమాయె

షావుకారు యోచించెను
తిండి దండగని తలచెను
దూరంగా విడిచిపెట్టి
దానిని వదిలించుకొనెను

ఎంత సేవ చేసినది?
ఎన్నిసార్లు మోసినది?
షావుకారు కృతఘ్నతకి
నేడు బాధ పడుతున్నది

శునకము కన్నీరు కార్చె
చిలుక కుక్కని ఓదార్చె
తగిన తరుణమొస్తుందని
అవి రెండూ బాధకోర్చె

ఒకనాడా షావుకారు
కుప్పకూలిపోయినాడు
గుండెపోటు, ఆసుపత్రి
పట్నంలోనె అన్నారు

ఆ వేసవి మధ్యాహ్నము
బండ్లు లేని ఆ సమయము
కడబట్టిన ప్రాణాలను
పోగొట్టుకొను ప్రమాదము

కుక్క పరుగు లంకించెను
ముసలి గుర్రమును పిలిచెను
వీపుపైన అతడెక్కగ
పట్నం వరకూ మోసెను

షావుకారు బతికిపోయె
సిగ్గుతోడ చితికిపోయె
గుర్రాన్నే హత్తుకొనగ
కన్నీరే ధారలాయె

గుర్రం ముసలయ్యిందని
బరువు లాగలేకుందని
వదలరాదు స్వార్థంతో
మేత దండగౌతుందని
 

- గుడిపూడి రాధికారాణి
94949 42583