Aug 02,2023 08:26

          ఒక అడవిలో కుందేలు, జింక, దుప్పి మూడింటికి బాగా స్నేహం కుదిరింది. ఒక రోజు అడవిలో కూరగాయల సంత జరుగుతోందని తెలియడంతో మూడూ సంతకు బయలుదేరాయి. అటుగా వెళుతున్న నక్కకి ఇవి కనిపిస్తాయి. దీంతో ఎప్పటి నుండో వాటి మాంసం తినాలనే కోరికను తీర్చుకోవాలనుకుని ఓ పథకం వేసింది. వాటితో మంచిగా మాటలు కలిపి, తన ఇంటికి తీసుకు వెళ్ళాలనుకుంది. అనుకున్న వెంటనే వాటితో, 'ఏమిటో విశేషం! ముగ్గురూ కలిసి ఎక్కడికో బయలు దేరినట్టున్నారు' అంటూ మాటలు కలిపింది. నక్కను చూడగానే అవి చాలా భయపడ్డాయి. అది గమనించిన నక్క, 'అరే మీరు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు నేను మాంసాహారిని కాను. మీలాగే శాకాహారిని. మా అమ్మ ఓ ఏడాది పాటు మాంసం ముట్టకూడదని వ్రతం చేస్తోంది. ఇపుడు నేను కూడా మీ మిత్రుడినే' అని నమ్మ పలికింది. నక్క మాటలను నమ్మిన జంతువులు దాన్ని తమతో బయల్దేరనిస్తాయి. దారిలో ఓ చోట, నక్క తన పథకాన్ని అమలుచేసింది.
          'మిత్రులారా, ఇక్కడికి దగ్గర్లోనే మా ఇల్లు ఉంది. ఇప్పటికే చాలా దూరం నడిచి వచ్చాం. కాసేపు మా ఇంటి దగ్గర సేదదీరి ఆ తరువాత బయల్దేరదాం' అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన జంతువులన్నీ నక్క ఇంటికి బయల్దేరాయి. ఇదంతా గమనిస్తూ వస్తున్న ఓ మిడత, నక్క ఏదో జిత్తుల మారి పన్నాగం పన్నిందని వాటిని అనుసరించింది. నక్క ఇంటి అటకపై వాలి చూడసాగింది. అదను కోసం చూస్తున్న నక్క ఇంట్లోకి వచ్చిన మూడు జంతువులతో 'తలుపు వేసి వస్తాను. మిత్రులారా! అంది. నక్క నుండి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని గ్రహించిన మిడత వెంటనే కుందేలు, జింక, దుప్పి చెవిలో తప్పించుకునే ఉపాయం చెప్పింది. ఉపాయం ప్రకారం జింక, దుప్పి కింద పడి గిల గిల కొట్టుకోవడం మొదలు పెట్టాయి. వెంటనే కుందేలు 'అయ్యయ్యో! నక్క మిత్రమా వాటి రెండింటికి మూర్ఛ వ్యాధి ఉంది. నువ్వు తొందరగా రెండు ఇనుప చువ్వలు తెచ్చి వాటి చేతిలో పెడితే కాని అవి బతకవు' అని కంగారుగా అంది. ఏం జరుగుతుందో అర్థం గాని నక్కకు మూర్ఛ వ్యాధితో చనిపోయిన వీటిని తింటే తనకూ ఆ వ్యాధి వస్తుందని భయపడి కుందేలు చెప్పినట్టు చేస్తుంది. ఇనుప చువ్వలు తెచ్చి జింక, దుప్పి చేతిలో పెట్టగానే అవి గబుక్కున లేచి ఆ చువ్వలతో నక్క తల పై బాదాయి. ఆ దెబ్బతో నక్క కిందపడిపోయింది. ఆ మూడు జంతువులు బయటకొచ్చి ఆ జిత్తులమారి నక్క నుండి కాపాడిన మిడతకు కృతజ్ఞతలు తెలియచేశాయి.

- కయ్యూరు బాల సుబ్రమణ్యం,
94417 91239