Aug 10,2023 16:43

ప్రజాశక్తి- మార్టూరు రూరల్‌ (బాపట్ల) : గ్రానైట్‌ పరిశ్రమలో విద్యుత్‌ షాక్‌కి గురై కార్మికుడు మృతి చెందిన ఘటన మార్టూరు సమీపంలోని రాజుపాలెం గ్రానైట్‌ పరిశ్రమల వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దయాసాగర్‌ (25) మార్టూరు సమీపంలోనే ఓ గ్రానైట్‌ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత నైట్‌ డ్యూటీలో భాగంగా గ్రానైట్‌ ఫ్యాక్టరీకి వచ్చిన దయాసాగర్‌ మిషన్‌ ఆన్‌ చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌కి గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన తోటి కార్మికులు దయాసాగర్‌ను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మార్టూరు ఎస్‌ఐ కోడూరి కమలాకర్‌ మృతదేహాన్ని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.