నేను కుందుర్తి గారిని, అంటే మా తాతగారిని ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయన్ను నేను ఒక వ్యక్తిగా కంటే ఒక వ్యక్తిత్వంగా, ఒక ఆశయంగా బాగా గుర్తుంచుకుంటాను. ఆయనకి నేను మనవరాలికంటే ముందు అతి పెద్ద కవిత్వాభిమానిని. సాహిత్యాభిమానిని. మా నాన్నగారు సత్యమూర్తి గారు, వాళ్ళ నాన్న గారు నమ్మిన ఆదర్శాలని అనుసరిస్తూ, ఆశయాలను ఆచరిస్తూ, తాతగారు మొదలెట్టిన ఫ్రీవర్స్ ఫ్రంట్ ఉద్యమాన్ని ఒక దీక్షగా ముందుకు నడిపించటం నేను చిన్నప్పటినుండీ చూస్తూ వచ్చాను. ప్రతి రోజూ పొద్దున్నే నాన్న కాఫీ తాగుతూ, మా తాత గారివీ, ఇతర కవులవీ పుస్తకాలను చదువుతూ ఉంటే, నేను ఆయన పక్కన కూర్చుని అర్ధమైనా కాకపోయినా వాటిని చదివేస్తూన్నట్టు తిరగేసేదాన్ని. తాతగారి పుస్తకాల్లో కవితల ఇతివృత్తమూ, సందర్భమూ ఏవీ అర్ధం కాకపోయినా, చాలా సులువైన పదాలూ, సరళమైన భాష ఉండేవి. తాతగారి పుట్టినరోజు వచ్చినా, తద్దినం వచ్చినా మా ఐదుగురు అత్తయ్యలనీ, వాళ్ళ కుటుంబాలనూ పిలిచి ఒక సంబరంలా జరిపించేవారు మా నాన్న. తాతగారు తన కవితల్ని చదివిన క్యాసెట్టు ఖచ్చితంగా ప్లే చేసేవారు. అలాగే ఆయన కంఠం నాకు పరిచయం.
తెల్లటి పంచా, లాల్చీ వేసుకునే నల్లటి మనిషనీ, కాలనీలో కూరల షాపు, కిరాణా కొట్టు, బట్టల దుకాణం అన్నిటిలో అప్పు ఖాతాలుండేవనీ, అయినా ఆయన మీదున్న అపారమైన గౌరవంతో తిరిగిచ్చేవరకూ ఎవరూ డబ్బులడిగేవారు కాదనీ మా నాన్న చెప్తూండేవారు. ఇవన్నీ విన్నాక, ఇంట్లో గోడమీద వేలాడే ఫొటో చూస్తూ చూస్తూ తెల్లటి వస్త్రాల్లో ఒక నల్లటి, ఎత్తైన, నిరాడంబరత, ఠీవీ రెండూ కలబోసిన ఒక రూపంలో కుందుర్తి గారిని ఊహించుకునేదాన్ని. తాతగారి కంఠం క్యాసెట్టులో వింటూ, ఆయన పప్పుచెక్క తింటూ కిటికీ పక్కన కూర్చుని చదివి ఉంటారు అని ఊహించుకునే దాన్ని. అక్కడ కూర్చుని ఆరు బయట ఉండే పెద్ద గుల్మొహర్ చెట్టుపై ఎర్రపూలని చూస్తూ, నేనూ తాతగారిలా కవితలు రాసేయాలి అనుకునేదాన్ని! మేము టెన్త్ క్లాసులో ఉన్నప్పుడు, అంటే 1996-97లో, తెలుగు టెక్స్ట్ బుక్‌లో తాతగారి కవిత ఒకటి సిలబస్‌లో ఉండేది. కవి పరిచయంలో తాతగారి గురించి ముందే తెలిసిన విషయాలు ఉండడం, ఫ్రెండ్స్ అందరూ మీ తాతగారా, మీ 'సొంత' తాతగారా అని ఆశ్చర్యపోవడం, నేను గర్వంతో పొంగిపోవడం నాకు ఇప్పటికీ బాగా గుర్తు.
మా ఇల్లు ఒక చిన్నసైజు గ్రంధాలయంలా ఉండేది. కవిత్రయ మహాభారతం నుంచి శ్రీశ్రీ మహాప్రస్థానం వరకూ తాతగారు, ఆ తరువాత నాన్నగారు సేకరించిన బోలెడు పుస్తకాలతో గదుల్లోని అరలన్నీ నిండిపోయి ఉండేవి. ఏటా వేసవి సెలవుల్లో మాకు తప్పక ఉండే ప్రాజెక్టు ఏంటంటే- వరుస తప్పిపోయిన పుస్తకాలన్నిటినీ వాటి సరైన స్థానంలో పెట్టడం. వేటివైనా అట్టలు చిరిగిపోతే మళ్ళీ వేసి పెట్టడం. కొత్తగా వచ్చిన పుస్తకాలకి సీరియల్ నంబర్లు రాయడం. దుమ్ము దులుపి శుభ్రం చేసుకోవడం. అమ్మ పాత చీర చింపి అరలకి పరదాల్లా ఎక్కించడం. మా తాతగారు కూడా అలాగే సర్దుకునేవారట!
ప్రతి సంవత్సరం దసరా (1982, అక్టోబరు 25న మా తాత గారు చనిపోయిన రోజున దసరానేనట) తరువాత నుంచి మా ఇంట్లో ఫ్రీవర్స్ ఫ్రంట్ హడావుడి మొదలయిపోయేది. నాన్న కొత్త కొత్త కవితల పుస్తకాలు ఇంటికి పట్టుకొచ్చేవారు. పడుకునే వరకూ వాటిని చదువుతూ ఉండేవారు. నేనూ నాన్న పక్కలో దూరి అందరి కవితలూ చదివేస్తూ ఉండేదాన్ని. ఫ్రీవర్స్ ఫ్రంట్ మీటింగు ప్రతి ఏడాదీ డిసెంబరులో శీలా వీర్రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించేవారు. ఆ పనుల మీద వాళ్ళింటికి నాన్న, నేనూ తరచూ వెళుతూ ఉండేవాళ్ళం. శీలావీ గారి ఇల్లు ఒక కళా మందిరం. వాళ్ళింట్లో ఉండే బొమ్మల్నీ, పెయింటింగ్స్‌నీ, మొక్కల్నీ, శీలావీ గారి టేబుల్ మీదుండే రకరకాల పెన్నులు, బ్రషులూ, రంగులూ ఇవన్నీ చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది. వీర్రాజు గారిలోని గాంభీర్యం కొంత భయపెట్టినా, సుభద్రాదేవి గారి ఆత్మీయత నాకెప్పుడూ ఆ ఇల్లు నాదే, వీళ్ళంతా నా వాళ్ళే అన్న భావనే కలిగించేది. ఈరోజుకీ ఆవిడ 'నువ్వు మా ఇంటి పిల్లవే, కవితా' అంటారు ఆప్యాయంగా. నాన్న, వీర్రాజు గారూ, సుభద్రాదేవి గారూ గంటల తరబడి చర్చించుకునేవారు. ఎవరెవరికో ఫోన్లు చేసేవారు. పెద్దయ్యాక ఈ పనులన్నీ 'నేనే చేసేస్తాను' అనేదాన్ని అమాయకంగా. అందరూ అందంగా నవ్వేవారు. ఆ నవ్వుల్లో తాతగారున్నారు.
అవార్డుగా ఇచ్చే ప్రతిమని ఆర్డరు ఇవ్వడానికి షాపుకు వెళ్ళడం నుంచి శీలావీ గారి చేతిరాతతో ఉన్న ఆహ్వాన పత్రికని చిక్కడపల్లి ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించి తెచ్చేవరకూ అన్ని పనుల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. చిన్నప్పుడు హైదరాబాదులోనే ఉండే సీనియర్ కవులకీ, ముఖ్య అతిథులకీ వారింటికి వెళ్ళి పత్రికలు అందించేవాళ్ళం. తరువాతి కాలంలో, ఫోన్ల వాడకం ఎక్కువయాక, పత్రికలు పోస్టులో పంపి, ఫోను చేసి చెప్పేవారు. కవులందరి అడ్రెసులు కవర్ల పైన రాసి, స్టాంపులతికించి, పోస్టు చేయడం మా పని. ఇక మీటింగు రోజు హడావుడి అంతా ఇంతా కాదు. తాతగారి పుస్తకాలు, తీసుకెళ్ళవలసిన సామాన్లన్నీ సర్దుకుని ఒక గంట ముందుగానే సిటీ సెంట్రల్ లైబ్రరీకి చేరి, 'ఫ్రీవర్స్ ఫ్రంట్' అని పెద్ద పేద్ద అక్షరాలతో ఉన్న నీలి రంగు బ్యానర్‌ని స్టేజీ వెనుక కట్టేవాళ్ళం. స్టేజీపై కుర్చీలన్నీ సర్ది, ప్రతి కుర్చీ ముందూ మంచినీళ్ళ గ్లాసులు, ఆపిలు పళ్ళూ పెట్టేవాళ్ళం. వచ్చినవారు కూర్చోవలసిన కుర్చీలు కూడా వరుసగా పెట్టి, కవుల కోసం ఎదురుచూసేవాళ్ళం. ఈ ఎదురుచూపులో తాతగారి కోసం తపన పడ్డ ఒక అమాయక మనవరాలుంది. మొదట ఎప్పుడూ శీలావీ దంపతులే వచ్చేవారు.
ప్రముఖ కవులు ఎవరైనా హాల్లోకి అడుగు పెట్టగానే, మా నాన్న ఆయనెవరో తెలుసా అన్నట్టు నా వైపు చూడటం, నాకు తెలిస్తే ఠక్కుమని సంతోషంగా పేరు చెప్పేయడం, లేదా తెలీదని బుంగమూతి పెడితే ఆయన చెప్పడం, అలా నేను వారిని గుర్తుపెట్టుకోవడం- ఇదంతా మాకు మామూలు. నాన్న వెనుకే తోకలా తిరిగేదాన్ని కనుక నాన్న పలకరించడానికో, ఆహ్వానించడానికో వెళ్ళిన ప్రతివారూ, మీ అమ్మాయా? పేరేంటి అని అడగటం, నేను 'కవిత' అని చెప్పడం, వారు 'ఓ కవితా, మరి నువ్వు కూడా కవితలు రాస్తావా' అని అడగడం, నేను ముసిముసిగా మురిసిపోవడం ప్రతి ఏడాదీ జరిగేది. అప్పుడే ఎప్పుడో కవిత్వ బీజం నాలో నాటుకుని ఉంటుంది. అంతే కాదు, తాతగారి కవిత్వ పుస్తకాలన్నిటి అట్టలపైనా, 'కుందుర్తి కవిత' అని ఉండేది. 'అది నా పేరే కదా' అని చాలా గర్వపడిపోయే దాన్ని. ఆ అతిశయంలో తాతగారిపై నా పెదవులకి తీరని ముద్దుంది. అందుకే ఇప్పటికీ పెళ్ళయ్యాక కూడా ఆ పేరే మార్చుకోకుండా అలాగే ఉంచుకున్నాను.
సభ మొదలయ్యాక కవుల ప్రసంగాలూ, మాటలూ, చిన్నప్పుడు అర్ధం కాకపోయినా వినేసేదాన్ని కానీ, పెద్దయ్యాక కొద్ది కొద్దిగా అవగాహనలోకొచ్చాక చాలా స్ఫూర్తినిచ్చేవి. ఎండ్లూరి సుధాకర్‌గారి వర్తమానం మొదలు, హైమావతి నిషిద్ధాక్షరి, యాకూబ్ గారి ఎడతెగని ప్రయాణం, ప్రసాదమూర్తి గరి పూలండోరు పూలు ... ఇలా ఎన్నో పుస్తకాలు నన్ను ఎంత పరిణితికి గురిచేశాయో మాటల్లో చెప్పలేను. ఈ కవులందరి మాటలూ, కవితలూ సరళంగా ఉంటూనే ఇంత బలంగా, ఆలోచన రేకెత్తించేవిగా, సమాజాన్ని ప్రశ్నింపజేసేవిగా ఉన్నాయి కదా. మరి వీరందరికీ మార్గదర్శి అయి, సామాన్యుడికి అర్ధమయ్యేదే, అన్యాయాన్ని ప్రశ్నించేదే కవిత్వమని నమ్మి తన జీవితాన్ని ఆ ఆశయానికి ధారపోసిన కుందుర్తి, మా తాత గారు, ఎంత గొప్పవారో కదా అని. ఆయన కవిత్వం ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా అనే తీవ్రమైన ఆలోచన నాలో అప్పుడు మెదిలింది. అప్పుడు ఒక కొత్త దృష్టితో తాతగారి పుస్తకాల అధ్యయనం మొదలెట్టాను. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన గురించి అంత గొప్పగా ఎందుకు చెప్తారో అప్పుడు అర్థమ యింది. బతికున్నంత కాలం చివరి దాకా, తన తండ్రి ఆశ యాలనీ, ఉద్యమాన్నీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిరాటంకంగా, నిర్విరామంగా కొనసాగించి, తన తండ్రికే కాదు, ఏ తండ్రికైనా ఇలాంటి కొడుకుండాలనే పేరుని సంపాదించు కున్నారు మా నాన్న, కుందుర్తి సత్యమూర్తి. నాకూ మా నాన్నకి తగ్గ కూతురని అనిపించుకోవాలని దురాశ ఉండటం తప్పు కాదేమో !
మా తాతగారి ముఖచిత్రం ఆయిల్ పెయింటింగ్‌తో ఉండాలని మా నాన్న గారి కోరిక. శీలా వీర్రాజు గారి సూచన మేరకు ఎస్‌ఎం కేతా గారి దగ్గర వేయించాము. ఆ ఫోటో చుట్టూతా అద్దం తలుపులతో చిన్న, చిన్న అరలు పెట్టించారు నాన్న. పై అరల్లో, తాతగారి పుస్తకాలన్నీ వరుసగా సర్ది పెట్టాం. ఒక అరలో, ఎన్నో ఏళ్ళ నుంచి జాగ్రత్తగా దాచిన తాతగారి కళ్ళద్దాలు, ఆయన వాడిన పెన్నూ ఉండేవి. నాకా పెన్నుతో రాసేయాలని చాలా కోరికగా ఉండేది. నాన్నేమో 'పెద్దయి తాతలా మంచి కవితలు రాస్తే నీకా పెన్ను' ఇస్తాననేవారు. మరొక అరలో కేంద్ర సాహిత్య అకాడమీ ట్రోఫీ ఉండేది. పైన మరో దాంట్లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీతలకు ఇచ్చే కలం పట్టుకున్న మనిషి ప్రతిమ ఉండేది. మా ఇంటికి అతి పెద్ద ఆకర్షణ ఆ గోడే. ఆ గోడపై అతికిన రంగులోనే తాతగారిపై నాకున్న ప్రేమ కలగలసి ఉంది.
నేను పెళ్ళయి సింగపూరు వచ్చేసేప్పుడు, నాకు ఇంట్లో నచ్చిన వస్తువులన్నీ - అంటే నా చిన్నప్పటి ఫోటోలు, డ్రాయింగులు, గ్రీటింగ్ కార్డులూ, డైరీలు, తాతగారి పుస్తకాలూ- అన్నీ ప్యాక్ చేసి తెచ్చుకున్నాను. వాటితో పాటూ నాన్నకి తెలీకుండా తాతగారి పెన్నుని కూడా (దొంగతనంగా) తెచ్చేసుకున్నాను. అప్పుడప్పుడూ తాతగారి పుస్తకాలు తిరగేస్తూనే ఉండేదాన్ని. చదివిన ప్రతిసారీ కొత్తగా అర్థమయ్యేవి, ఏదో ఒక కొత్త కోణం కనిపిస్తూనే ఉండేది. ఆయన గురించి చదివి తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా గర్వంతో మనసు ఉప్పొంగిపోయేది. కళ్ళు అప్రయత్నంగా చెమర్చేవి. ఒక దొంగలాగా పెన్ను తెచ్చేసుకున్నానన్న మాటే గానీ, ఆ పెన్నుతో రాసే అర్హత నాకు లేదని తెలిసేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే దాన్ని అందమైన చెక్కపెట్టెలో పెట్టి అలాగే భద్రపరిచాను.
1982 అక్టోబర్‌లో తాతగారు మరణించిన తర్వాత నాన్నగారు శీలా వీర్రాజు గారి సహకారంతో 1982 నుంచి 2011 వరకూ ఫ్రీవర్స్ ఫ్రంట్ కవిత్వ పురస్కారాలని తమ సొంత ఖర్చులతో అందజేసారు. 2011లో మా నాన్నగారి హఠాన్మరణానంతరం మా అమ్మ కుందుర్తి శాంత ... వారి ఆశయాన్ని కొనసాగించింది. శీలా వీర్రాజు, సుభద్రాదేవి గార్ల సహాయ సహకారాలతో 50 పురస్కారాలు పూర్తి చేయాలని సంకల్పించి, 2012 నుంచి 2019 వరకూ ఫ్రీవెర్స్ ఫ్రంట్ కవిత్వ పురస్కారాలు అందజేసింది. వచన కవిత్వ ప్రస్తావనలో మా అమ్మ కూడా ఒక అక్షరంలా ఎప్పటికీ నిలిచిపోతుందేమో! ఇన్నేళ్ళుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన కవులందరివీ, అవార్డు గ్రహీతలైన కవులందరవీ ఫోను నంబర్లు సుభద్రాదేవి గారు ఎంతో కష్టపడి సేకరించి మాకు పంపితే, నేనూ, మావారూ వారందరినీ ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చి ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ కుటుంబాన్ని కలపగలిగాము. అవార్డు గ్రహీతలందరినీ ఓసారి స్మరించుకున్నాము. ఈ సందర్భంగా 'ఫ్రీవర్స్ ఫ్రంట్' పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించాను నేను. ఫ్రీవర్స్ ఫ్రంట్ చరిత్ర, ఇప్పటిదాకా ఈ అవార్డు అందుకున్నవారి వివరాలూ, కవితలూ, వారి స్పందన లూ, ఈ సంస్థ పట్ల అభిమానం కలవారు చేసిన వ్యాఖ్యానాలూ, కుందుర్తి గారిపై వెలువడిన వ్యాసాలు, వారి కవితలు ఇందులో పొందుపరచడానికి ప్రయత్నిస్తున్నాను. ఫ్రీవర్స్ ఫ్రంట్ తెలుగు వచన కవిత్వ చరిత్రలో ఒక మహత్తర ముద్ర.
50వ అవార్డు తర్వాత ఇక ఈ అవార్డును ఆపి వేయాలని నిర్ణయించుకున్నాము. బాధాకర విషయమే. ఏ సంస్థకైనా 50 ఏళ్ళ మైలురాయిని చేరగలగటం చిన్న విషయం కాదు. అదీకాక కుందుర్తి గారి శతజయంతి సంవత్సరంతో ఈ ముగింపుని చేయడం కొంత ఉద్విగతకి గురిచేస్తోంది. తప్పొప్పుల చర్చల మధ్య ప్రతిమలా నిల్చున్నాను. ఇప్పుడు కుందుర్తి శతజయంతి వేడుకల సందర్భంగా నా జ్ఞాపకాలనిలా పంచుకోడానికి, ఆ గొప్ప మనిషి పట్ల నా గౌరవాభిమానాల్ని ఇలా నాల్గు అక్షరాల్లో చెప్పేందుకూ, చెక్కపెట్టెలోంచి తాతగారి పెన్నునే బయటకు తీసాను. ఇలా వందేళ్ళ శతజయంతి వేళప్పుడు తాతగారి కవితలన్నీ ఇలా మిత్రులతో కలసి మీముందుకు తేవడం నన్ను ఉద్వేగానికి గురిచేస్తోంది.
- కుందుర్తి కవిత










