Dec 26,2022 11:13
  • అమ్మిన నెల రోజులకూ ఖాతాల్లో జమవ్వని నగదు
  • ప్రభుత్వం రూ. 286.46 కోట్లు ధాన్యం కొనుగోలు
  • రూ.19.40 కోట్లు మాత్రమే చెల్లింపులు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : 

  • కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడుకు చెందిన ఎం.సాయిబాబు గత నెల 26న ఆర్‌బికె ద్వారా 75 కిలోల బస్తాలు 304 విక్రయించారు. రూ.4.62 లక్షలు ఖాతాలో జమ కావాల్సి ఉంది. 
  • ఉప్పులూరు గ్రామానికి చెందిన కౌలు రైతు నక్కుర్తి మల్లేశ్వరరావు గత నెల 24న 298 బస్తాల ధాన్యం ఆర్‌బికెలో విక్రయించారు. రూ.4.53 లక్షలు ఆయన ఖాతాలో జమ కావాల్సింది.

వీరిద్దరి ఖాతాల్లో ఇప్పటి వరకూ డబ్బులు పడలేదు. ఈ రైతులే కాదు జిల్లాలోని పలువురు రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ధాన్యం అమ్మిన 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాంకేతిక లోపాలు సవరించి ఈ ఏడాది రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రకటించిన గడువులోపు నగదు చెల్లింపులు చేస్తామని జిల్లా అధికార జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రకటించినా ధాన్యం డబ్బుల కోసం నెల రోజులకుపైగా రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో, పంట పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కౌలు రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
           ఉప్పులూరు గ్రామానికి చెందిన కౌలు రైతు నక్కుర్తి మల్లేశ్వరరావు భూ యజమానికి రూ.2,58,400 కౌలుగా చెల్లించాల్సి ఉంది. ధాన్యం డబ్బులు జమ కాకపోవడంతో అప్పులకు వడ్డీలు, కౌలు ఎలా చెల్లించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ సీజన్‌లో బ్యాంకు రుణం లభించకపోవడంతో నాట్లు నుంచి నూర్పిడి వరకు పంట సాగు పెట్టుబడికి ఎకరానికి రూ. 30 వేలు చొప్పున ఎనిమిది ఎకరాలకు నెలకు నూటికి రూ.3 చొప్పున రూ.2.40 లక్షలు అప్పు చేశారు. నెలకు రూ.7,200 వడ్డీ పెరిగిపోతోందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఆర్‌బికెల ద్వారా 1,40, 547 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించింది. ఇందుకు గానూ 286.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.19.40 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమైంది.
 

                                                                          కౌలు రైతులకు వడ్డీ భారం

జిల్లాలో మొత్తం 3.93 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంట సాగైంది. 75 శాతం విస్తీర్ణంలో పంటను రెండు లక్షల మంది కౌలు రైతులు సాగు చేశారు. ఖరీఫ్‌ పంట రుణ ప్రణాళిక రూ. 3 వేల కోట్లలో పది శాతం రూ.300 కోట్లు కౌలు రైతులకు రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్‌ చివరి నాటికి 6,953 మంది కౌలు రైతులకు 22.41 కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేసింది. దీంతో, అత్యధికమంది కౌలు రైతులు వరి సాగుకు ఎకరానికి రూ.30 వేల వరకు ప్రయివేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పలు చేయాల్సి వచ్చింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో నెలకు నూటికి రూ.3 నుంచి రూ.5 వరకూ వడ్డీకి అప్పు తీసుకున్నారు. ధాన్యం నగదును ప్రభుత్వం సకాలంలో జమ చేయకపోవడంతో అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు.
 

                                                                   నిబంధనల సడలింపులో జాప్యం

తుపాను కారణంగా జిల్లాలోని 11 మండలాల్లో 26 వేల ఎకరాల్లో వరికి పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం ఆ పంటను రైతులు ఇప్పడిప్పుడే నూర్పిడి చేస్తు న్నారు. తడిచిన వరి కంకులు రంగు మారడంతోపాటు నూకల శాతం ఎక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు. నిర్దేశించిన ప్రమాణాలను సడలించి దెబ్బతిన్న ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.