
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గపూర్ విమర్శించారు. శుక్రవారం సాయి ఆరామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు బృందాలుగా విడిపోయి ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి పుట్టపర్తికి చేరుకున్నామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండం చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఫలితంగా వేలాదిమంది నగరాలకు వలసలు వెళుతున్నారన్నారు. ఇటీవల బెంగళూరుకు వలస వెళుతున్న 13 మంది కూలీలు ప్రమాదవశాస్తూ మృతి చెందారన్నారు. దీనిని బట్టి సత్యసాయి జిల్లాలో కరువు నెలకొందని అర్థం అవుతోందన్నారు. కరువు నివారణకు ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా విపక్షాలను, ప్రజా సంఘాలను ఎక్కడికక్కడ జగన్ ప్రభుత్వం నిర్బంధించడం అణచివేయడం కక్ష సాధింపులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబును అక్రమ కేసులో జైలు పాలు చేశారన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాలు భూమిని కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలు చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని కూడా నిర్ధాక్షణంగా కూల్చివేస్తున్నారన్నారు. అనంతపురం సమీపంలోని కల్లూరు, పెనుకొండ, చిలమత్తూరు తదితర ప్రాంతాలలో పేదల గుడిసెలను కూల్చివేశారన్నారు. కేవలం బటన్ నొక్కి కేటాయించిన నిధులు తక్కువని ప్రచారం మాత్రం ఎక్కువ అని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి మైనార్టీల, దళితుల పట్ల దాడులు చేస్తున్నారన్నారు. కార్పొరేటర్లకు కొమ్ముకాస్తూ లక్షలాది కోట్లు రాయితీగా ప్రకటిస్తున్న కేంద్రం ఇటు కార్మికులకు అటు కర్షకులకు చేసింది ఏమీ లేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. డీజల్, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసారన్నారు. దీనిని వైసిపి కానీ, టిడిపి కానీ ఖండించడం లేదన్నారు. రాష్ట్రంలో హంద్రీనీవా, నగరి, గాలేరు, తెలుగు గంగ, పోలవరం తదితర ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం పేదలకు, కార్మిక కర్షకులకు చేసిందేమీ లేదన్నారు. కార్పొరేటర్లకు ఊడిగం చేస్తోందన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తూ బస్సు యాత్ర చేపట్టామన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా కలిసొచ్చే బావ సారూప్య పార్టీలను కలుపుకొని ఒక వేదికగా ఏర్పాటు చేయడం కోసమే ఈనెల 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఆ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
పరిశ్రమల పేరిట పేదల భూములు రాక్కున్నారు - ఇంతియాజ్
జిల్లాలో పరిశ్రమల స్థాపిస్తామని ప్రభుత్వం వేలాది ఎకరాలు లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇచ్చిందే తప్ప పరిశ్రమలు నెలకొల్పలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ విమర్శించారు. సోమందపల్లి సమీపంలో నా సన్, బెల్ పరిశ్రమల స్థాపనకు 1050 ఎకరాల భూములను పేదల నుంచి లాక్కున్నారన్నారు. నష్టపరిహారం కూడా పేదలకు ఒక రకంగా అధికార పార్టీ నాయకులకు ఇంకో విధంగా ఇవ్వడం దారుణం అన్నారు. లేపాక్షి హబ్బుకు 8 వేల పైచిలుకు భూములు లాక్కున్నారే తప్ప ఇంతవరకు పరిశ్రమలు నెలకొల్ప లేదన్నారు. పరిశ్రమలైన నెలకొల్పండి లేదా భూములను తిరిగి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పలు ప్రాంతాలలో ప్రభుత్వ భూములను గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని గృహాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు నివారణ పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా కరువు ప్రాంతమైన సత్యసాయి జిల్లాలో వలసలు వెళ్లకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. లేపాక్షి కి చెందిన దళితుల 150 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థకు దారాదత్తం చేసిందన్నారు. కూల్చివేసిన గుడిసెలు స్థానంలో పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్, కృష్ణయ్య, రమాదేవి, నాగమణి, ఈ ఎస్ వెంకటేష్, నల్లప్ప, పెద్దన్న, భాస్కర్, ఉమామహేశ్వర రావు, రామకృష్ణ, బ్యాళ్ల అంజి, పై పల్లి గంగాధర్, బాబావలి తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం కార్యాలయ భవనాన్ని సందర్శించిన బస్సు యాత్ర బృందం
పుట్టపర్తి లోని సత్యసాయి ఎయిర్పోర్ట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రజా రక్షణ భేరి బస్సు బృందం పరిశీలించింది. శుక్రవారం జిల్లా సిపిఎం కార్యదర్శి ఇంతియాజ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేష్ భవన నిర్మాణం పై వివరించారు. సాధ్యమైనంత తొందరగా పవన నిర్మాణం పూర్తి చేస్తామని పేదలు కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకు కార్యాలయానికి రావచ్చు అన్నారు. భవన నిర్మాణం త్వరతగతిన పూర్తి చేయాలని కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, రాష్ట్ర నాయకులు కృష్ణయ్య, ప్రభాకర్, నల్లప్ప తదితరులు ఆకాంక్షించారు.