Feb 17,2023 21:12

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో 450 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గడిచిన జనవరిలో గూగుల్‌ సిఇఒ సుందర్‌ పిచాయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో కోతలు ప్రారంభించినట్లు సమాచారం. భారత్‌లోని వివిధ విభాగాల్లో పనిచేసే 450 మంది ఉద్యోగులను తొలగిస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. గూగుల్‌ ఇక్కడ హైదరాబాద్‌, బెంగళూరు, గుర్‌గావ్‌లో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉంది. గూగుల్‌ నుంచి తమను అర్ధంతరంగా తొలగించారని పలువురు ఉద్యోగులు లింక్డిన్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. గూగుల్‌ ఇండియాలో ఇటీవల చేపట్టిన లేఆఫ్స్‌లో అధిక నైపుణ్యాలు కలిగిన టాలెంటెడ్‌ కొలీగ్స్‌ కొలువులు కోల్పోయినట్టు తెలిసిందని గూగుల్‌ ఇండియా ఉద్యోగి రజనీష్‌కుమార్‌ ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు. గూగుల్‌ ఇండియా లేఆఫ్స్‌లో తాను బాధితుడినయ్యానని గూగుల్‌ ఇండియాలో అకౌంట్‌ మేనేజర్‌ కమల్‌ దవే పేర్కొన్నారు.