May 14,2023 13:45

రావికమతం (అనకాపల్లి) : ' తాగడానికి మంచినీరివ్వండయ్యా ' అంటూ ఆదివాసి గిరిజన మహిళలంతా ఖాళీ బిందెలతో రోడ్డుపై నిలుచొని ఆదివారం ఆందోళన చేపట్టారు. కొత్తకోట నుండి రోచుపనుకో వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో కడగడ్డ గ్రామం వద్ద రోడ్డుపై ఖాళీ బిందెలు పెట్టి రాస్తారోకో నిర్వహించారు.

                                                    చేలం నీరే గతి.. మలేరియా రోగాలొస్తున్నాయి..

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణలోవ రిజర్వాయర్‌ పై భాగంలో కడగడ్డ గ్రామంలో 24 కుటుంబాలు 120 మంది కొండదొర తెగ ఆదివాసి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వారి గ్రామంలో ఒక చేతి బోర్డులు ఏర్పాటు చేశారు. వేసవికాలం రావడంతో బోరు నీరు బురదగా వస్తుంది. తప్పని పరిస్థితిలో చేల నీళ్లు తోడుకొని తాగుతున్నామని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ మలేరియా వంటి రోగాల బారినపడుతున్నామన్నారు.

                                     జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.7.5 లక్షల ప్రతిపాదన పంపామన్నారు..

ఎంపీడీవో.ఆర్‌.బ్ల్యూ.ఎస్‌జేఈ ఆదేశాల మేరకు ... బోరు మెకానిక్‌ వచ్చారు. పైపులు తమ దగ్గర లేవనీ, పంచాయతీ కేంద్రంలో లేవనీ, బోర్‌ విప్పి తాను వెళ్ళిపోతాను అని చెప్పడంతో ... గిరిజన మహిళలు బోరు పైపులు తీసుకొచ్చి బోర్‌ రిపేర్‌ చేయాలి తప్ప. పైపులు లేకుండా వచ్చి బోరివిప్పితే ఊరుకుండేది లేదని చెప్పడంతో.. బోర్‌ మీద క్లిక్‌ వెళ్లిపోయి నేటికి 14 రోజులు అవుతుందని వాపోయారు. పైపులు తీసుకురాలేదనీ, తమ చేతి బోరును రిపేరు చేయలేదనీ, కానీ ఎంపీడీవో మాత్రం జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 7.5 లక్షల రూపాయలు నిధులు ప్రతిపాదనకు పంపించామని సమాధానంతో సరిపెట్టి ఉన్నారనీ వివరించారు.

                                      కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.. అడిగితే పట్టించుకోవడం లేదు..

ఇప్పటికీ ఏ అధికారులూ తమ గ్రామంలో మంచి నీటి సమస్య కోసం పరిశీలన చేయడానికి రాలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పేరు మీద కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రకటనలు చేస్తున్నారు తప్ప వాస్తవానికి తమ ఆదివాసి గిరిజన గ్రామాలలో గడ్డలో చలమలు తొవ్వుకొని నీరు తాగే పరిస్థితిలో తామున్నామని చెప్పారు. తమకు మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని. అనేకసార్లు అధికారులు దఅష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉదయం నుంచి మంచినీటి కోసం కూలి పనులు కూడా మానుకునే పరిస్థితిలో ఉన్నామని కంటతడిపెట్టారు.

                                             'జగనన్నకి చెబుదాం' కి కాల్‌ చేసినా పరిష్కారం కాలేదు...

' జగనన్నకి చెబుదాం ' కార్యక్రమం కూడా తాము ఫోన్‌ చేసి చెప్పామనీ కానీ తమకు మంచినీటి సమస్య నేటికీ పరిష్కారం కాలేదని అన్నారు. చీమలపాడు పంచాయతీ వార్డు సభ్యురాలు టెంక.లక్ష్మి కడగడ్డ గ్రామం పొట్కూరి బాలమ్మ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.