ఇక్కడ పక్షులకు
ప్రజాస్వామ్య జీవులకు
కొన్ని షరతుల సీసం చెవిలో పోయజుస్తున్నరు
ఆచార, సంస్కార, భక్తిపడగ నీడలో
అభద్రంగా బతికితే బస్..
హేతువు హేతువుగా చూడని
అహేతుక సమాజం కసాయ రంగుపులుముకొని
ప్రశ్నించే వర్షాన్ని
అజ్ఞాన గొడుగుతో ఆపచుస్తుండ్రు
హేతువనే జడివానకు
యదార్థ ప్రళయానికి
ఏ గొడుగూ నిలవదు !
భక్తి ఇంజెక్షన్ ఇంజక్ట్ చేసి
శాస్త్రాన్ని విశ్వాసాలతో కల్పుతున్న
టెంకాయ సమర్పణ క్షిపణి
ముందు మోకరిల్లిన శాస్త్రం ...
చదివిన సదువు పొందిన అభినందన పత్రాలు
గోడమీది క్యాలెండర్లే..!
అందని అమూర్త భావానికి ఉన్న విలువ
రక్తమాంసాలతో
దేశ ఉత్పత్తిని ఉచ్ఛస్థితికి
శ్రమ మూటను విప్పి ఆకలి తీర్చి
హేతువును పంటలా పండిస్తే,
ఆలోచన ఎరువు వేస్తే,
దేశద్రోహుల జాబితా సిద్ధం..
అడ్డగించే విషపు ఆలోచన జీవికి
క్షణాలలో విడుదల పవనాలు
మిన్నకున్న బుద్ధిజీవి మౌనం
దేనికి సంకేతం?
మనిషిలోని మానవత్వం తట్టి లేపే ఏ చెట్టునైనా
ఛాందస గొడ్డలితో తెగనరుకుతున్నరు
పామరున్ని సైతం అజ్ఞాన తీర్థంలో ముంచి
ప్రశ్నించే గొంతును నొక్క ప్రయత్నిస్తుంటే
సదివిన బుర్రలు మిన్నకుండటం దేనికి గుర్తు?
భిన్న భావాలు వికసించే వెలుగులో
ప్రతిబింబంలా సత్యం యథార్థం..
జీవన విధానాలు ఎన్నున్నా
విభిన్న ఆచారలెన్నున్నా
మనిషి ఆలోచనని గౌరవించని
అభిప్రాయాన్ని అంగీకరించని
సంస్కారం సమ్మతమేనా?
- నాగరాజు మద్దెల
63019 93211










