హైదరాబాద్: దేశంలో రోజువారి లెక్కన సరకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులకు లోన్లు కావాలంటే బ్యాంకులు, లేదంటే ఇతర ఫైనాన్స్ కంపెనీలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వ్యాపారస్తుల్ని గట్టెక్కించేలా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన యూపీఐ పేమెంట్స్ ఫ్లాట్‌ఫారమ్ గూగుల్ పే ద్వారా వారికి రుణాలు అందించేందుకు సిద్ధమైంది సెప్టెంబర్ 19 ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఈవెంట్‌లో చిరు వ్యాపారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. భారత్‌లోని చిరు వ్యాపారులకు చేయూతనందించేలా తన యూపీఐ పేమెంట్ ఫ్లాట్‌ఫారమ్ 'గూగుల్ పే' ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే గూగుల్ పే ద్వారా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్.. డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. దీంతో వ్యాపారులు గూగుల్ యూపీఐ నుంచి రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు లోన్లు అందిస్తుంది. వాటిని తిరిగి 7 నెలల నుంచి 12 వ్యవధిలోపు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, వ్యాపార నిమిత్తం అవసరమే నిధుల అవసరాల్ని తీర్చేలా క్రెడిట్‌లైన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పద్దతిలో అతి తక్కువ రూ.15,000 తీసుకుంటే నెల ప్రారంభ ఈఎంఐ రూ.111 చెల్లించాలి. వ్యక్తిగత రుణాలు చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్‌తో, యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్స్ రుణాలు కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో జతకట్టింది. భారత్‌లోని చిరు వ్యాపారుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. ఏఐ సాయంతో గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్‌లో వ్యాపారుల ప్రొడక్ట్‌ల వివరాల గురించి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందించనుంది. అయితే, ఉత్పత్తుల గురించి ఎలాంటి సమాచారాన్ని గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్‌లో ఇవ్వాలనే అంశం వ్యాపారుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. త్వరలో, భారత్‌లోని వినియోగదారులకు 100కి పైగా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్నిఅందించేలా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా గూగుల్ భవిష్యత్ కార్యచరణను ప్రకటించింది. గూగుల్‌లో పేలో రూ.12,000 కోట్ల విలువైన ఆర్ధిక మోసాలకు చెక్ పెట్టిన గూగుల్.. అందుకు సాయం చేసే 3,500 లోన్ యాప్‌లను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంది.