Sep 02,2023 08:26

సాగర్‌కు మంచి అలవాట్లు లేవు. ముఖం కడుక్కోకుండా పాలు తాగడం, స్నానం చేయకుండా బడికి వెళ్లడం వంటివి చేస్తుండేవాడు. తల్లితండ్రులు ఎంత చెప్పినా వినే వాడు కాదు. స్కూలుకు చింపిరి జుట్టుతో రావద్దని టీచర్లు కోప్పడేవారు. దీంతో స్కూలుకు వెళ్లడం మానేశాడు. చదువుకోకుండా పిల్లాడి భవిష్యత్తు ఏమవుతోందని తల్లిదండ్రులు తెగ గాబరా పడ్డారు. 'గారాబం చేసి పిల్లాడిని చెడగొట్టాం' అని బాధపడ్డారు.
        ఒక రోజు సాగర్‌కు వరుసకు అన్నయ్య అయ్యే సుమంత్‌ వాళ్లింటికి వచ్చాడు. అతను పట్నం స్కూల్లో టీచరు. సాగర్‌ గురించి తల్లిదండ్రులు సుమంత్‌తో చెప్పారు. ఎలాగైనా సాగర్‌లో మార్పు తేవాలని వేడుకున్నారు. 'మీరేం కంగారు పడవద్దు. తమ్ముడిని నేను మారుస్తాను' అని సుమంత్‌ వాళ్లతో చెప్పాడు. రెండు రోజుల పాటు సాగర్‌ను గమనించిన సుమంత్‌ మూడో రోజు అతనిని దగ్గరకు పిలిచి 'చూడు సాగర్‌ నీ పద్ధతి ఏం బాగాలేదు. నీ కంటే చిన్న పిల్లలు కూడా స్కూలుకి క్రమం తప్పకుండా వెళుతున్నారు. అలాగే స్కూలుకి ఎలా పడితే అలా వెళ్లకూడదు. రోజూ ఉదయాన్నే లేవాలి, పండ్లు తోమాలి, స్నానం చేయాలి. ఉతికిన బట్టలతో, తల దువ్వుకుని స్కూలుకు వెళ్ళాలి. అలా వెళితేనే నిన్ను అందరూ ప్రేమిస్తారు. టీచర్లు కూడా నిన్ను ఏమీ అనరు. నువ్వు ఇలా ఉంటే అమ్మానాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఇక నుండి నీ పద్ధతి మార్చుకో' అని చెప్పాడు.
         అప్పటికే స్కూలుకు వెళ్లకుండా నిరుత్సాహంగా ఉన్న సాగర్‌పై ఆ మాటలు బాగా పనిచేశాయి. చూస్తుండగానే తన అలవాట్లలో మార్పు వచ్చింది. వేళకి లేచి, క్రమం తప్పకుండా స్కూలుకి వెళుతున్నాడు. కొడుకులో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.

- కనుమ ఎల్లారెడ్డి,
93915 23027.