Sep 26,2023 21:33

హాంగ్జౌ: ఈక్విస్ట్రియన్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ 41ఏళ్ల తర్వాత స్వర్ణ పతకాన్ని సాధించింది. సుదీప్తి హజెలా, హదరు విపుల్‌, అనూష్‌ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌ డ్రస్సేజ్‌ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. భారత బృందం 209.205పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. భారత్‌ చివరగా 1982లో ఈక్వెస్ట్రియన్‌ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. ఆ తర్వాత ఈ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం దక్కడం ఇదే తొలిసారి. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో రగ్విందర్‌ సింగ్‌ వ్యక్తిగత ఈవెంటింగ్‌ విభాగంలో, రూపిందర్‌ సింగ్‌ బ్రార్‌ వ్యక్తిగత టెంట్‌ పెగ్గింగ్‌ విభాగంలో బంగారు పతకాలు సాధించగా, టీమ్‌ ఈవెంటింగ్‌లో కూడా గతంలో ఒక బంగారు పతకం దక్కింది. ఇక చైనా 204.882 పాయింట్లు, హాంగ్‌కాంగ్‌ 204.852 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నాయి. ఇప్పుడు దక్కిన బంగారు పతకంతో కలిపి ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ మొత్తం నాలుగు స్వర్ణ పతకాలు సాధించినట్లయ్యింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు దక్కిన బంగారు పతకాల సంఖ్య మూడుకు చేరింది.

neha

సెయిలింగ్‌లో మూడు పతకాలు...

భారత సెయిలర్లు సత్తా చాటుతున్నారు. మూడోరోజు ఈ విభాగంలో భారత్‌కు ఏకంగా మూడు పతకాలు దక్కాయి. 17 ఏళ్ల నేహా థాకూర్‌ ఐఎల్‌సీఏ-4 ఈవెంట్‌లో 32పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. థాయిలాండ్‌కు చెందిన నొప్పసొరన్‌ కున్బూంజన్‌ టాప్‌ స్కోర్‌తో స్వర్ణ పతకం గెలువగా, సింగపూర్‌కు చెందిన కీరా మేరీ కార్లైల్‌ 28 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత పురుషుల విండ్‌ సర్ఫర్‌ ఈవెంట్‌లో ఎబాద్‌ అలీ పతకం కాంస్య సాధించాడు. రేసులో 52 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక 24ఏళ్ల విష్ణు శరవణన్‌ పురుషుల డింగీ ఐసిఎల్‌ఎ-7 ఈవెంట్‌లో కాంస్యం దక్కించుకున్నాడు. సింగపూర్‌, దక్షిణకొరియా సెయిలర్లకు స్వర్ణ, రజత పతకాలు దక్కాయి. మూడోరోజు పోటీలు ముగిసే సరికి భారత్‌ పతకాల సంఖ్య 14 పతకాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది.

హాకీలో సింగపూర్‌పై 16-1తో గెలుపు..

భారత పురుషుల హాకీ జట్టు విజయపరంపర కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ రెండో మ్యాచ్‌లో భారతజట్టు సింగపూర్‌ను చిత్తుచేసింది. తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌ 16-0గోల్స్‌తో ఓడించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో సింగపూర్‌పై 16-1గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. గోంగ్షూ కెనాల్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం భారత జట్టుదే ఆధిపత్యం. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 4, మన్‌దీప్‌ సింగ్‌ 3, అభిషేక్‌ 2, వరుణ్‌ కుమార్‌ 2 గోల్స్‌ చేశారు. లలిత్‌ ఉపాధ్యారు, గుర్జంత్‌ సింగ్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, షంషేర్‌ సింగ్‌ ఒక్కో గోల్‌ కొట్టారు. సింగపూర్‌ తరఫున మహమ్మద్‌ జాకీ బిన్‌ జుల్కర్‌నైన్‌ 53వ నిమిషంలో కన్సోలేషన్‌ గోల్‌ చేశాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌.. డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌తో 28న తలపడనుంది.

స్క్వాష్‌లో సునాయాసంగా..

స్క్వాష్‌ మహిళల విభాగంలో భారత్‌ అదరగొడుతోంది. మంగళవారం జరిగిన గ్రూప్‌-బి పోటీలో భారత్‌ 3-0 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. తొలి సింగిల్స్‌లో అనహత్‌ సింగ్‌ 11-6, 11-6, 11-3 పాయింట్లతో సదియా గుల్‌పై, రెండో సింగిల్స్‌లో జోష్నా చిన్నప్ప 11-2, 11-5, 11-7తో నూర్‌ ఉల్‌ హుడా సాదిఖ్‌ను ఓడించారు. భారత యువ సంచలనం తన్వీ ఖన్నా 11-3, 11-6, 11-3తో పాక్‌ క్రీడాకారిణి నూర్‌ ఉల్‌ ఐన్‌ ఇజాజ్‌పై వరుససెట్లలో నెగ్గింది. 27న నేపాల్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది. ఇక పురుషుల విభాగంలో భారత్‌ 3-0తో కతార్‌ను చిత్తుచేసింది.

బాక్సర్ల జోరు..

భారత బాక్సర్ల జోరు ఆసియా క్రీడల్లో కొనసాగుతోంది. 57 కేజీల విభాగంలో సచిన్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్‌పై 5-0 ఆధిక్యంతో విజయం సాధించాడు. 92 కేజీల విభాగంలో 16వ రౌండ్‌లో కిర్గిజిస్తాన్‌ బాక్సర్‌ ఒముర్‌బెక్‌తోపై గెలిచి నరేంద్ర క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
ఈస్పోర్ట్స్‌లో భారత ద్వయం అయాన్‌ బిస్వాస్‌, మయాంక్‌ అగర్వాల్‌ స్ట్రీట్‌ ఫైటర్‌ నాకౌట్‌ రౌండ్‌లో పరాజయాన్ని చవిచూడగా... టెన్నిస్‌లో సుమిత్‌ నాగల్‌ గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు.
చెస్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి ప్రత్యర్థులతో మ్యాచ్‌లను డ్రా చేసుకోగా.. విదిత్‌ 6వ రౌండ్‌ పోటీలో విజయం సాధించాడు.

table