- బెంబేలెత్తుతున్న నది పరివాహక ప్రాంతాల ప్రజలు
ప్రజాశక్తి-కపిలేశ్వరపురం(కోనసీమ) : గోదావరి నది వరద రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాలైన తాతపూడి, కపిలేశ్వరపురం కోడుమిల్లి అద్దంకివార్లంక, పల్లపులంక, నారాయణలంక, కేదార్లంక, వీధి వారి లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. లంక గ్రామాల్లో అరటి, కూరగాయల పంటలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో పనికిరాకుండా పోయాయని రైతులు వాపోతున్నారు.

వరద ప్రాంతాలను సందర్శించిన అధికారులు
మండలంలోని కోరుమిల్లి అద్దంకివారిలంక పల్లపులంక తదితర గ్రామాల్లో వరద ప్రాంతాలను శుక్రవారం తహశీల్దార్ కె.సూర్యారావు, ఎంపీడీవో ఎం రామకృష్ణారెడ్డి, హెడ్ వర్క్స్ ఏఈలు, పరిశీలించారు. కోరుమిల్లి శివారులోని లాకుల సమీపంలో అనుమానంగా ఉన్న ఏటి గట్టు ప్రాంతాన్ని ఇసుక బస్తాలు అడ్డుపెట్టారు. అద్దంకి వారి లంక పల్లపులంక గ్రామాల్లో ప్రజలకు త్రాగునీరు ఏర్పాటు చేశామని ఇంజన్ బోటులను సిద్ధంగా ఉంచినట్లు తహశీల్దార్ ఎంపీడీవో తెలిపారు. వరదల పట్ల ప్లడ్ అధికారులను, సిబ్బందిని, అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి ఎక్కడ సమస్య లేవని అధికారులు తెలిపారు. లంక గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.










