- ఎపిఎల్ సీజన్-2
ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) : విశాఖ పిఎం పాలెం సమీపంలోని ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్, గోదావరి టైటాన్స్ జట్లు తలపడ్డాయి. 56 పరుగులతో గోదావరి టైటాన్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలుచుకున్న వైజాగ్ వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుని బరిలోకి దిగారు. గోదావరి టైటాన్స్ బ్యాట్స్‌మ్యాన్లు చెలరేగిపోయారు. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించారు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ సిఆర్ జ్ఞానేశ్వర్ 53 బంతులలో ఆరు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 80 పరుగులు చేశారు. వై సందీప్ 38 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లుతో 63 పరుగులు చేశారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తిచేయడమే కాకుండా 91 బంతుల్లో 144 పరుగులు చేసి బలమైన పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పారు. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ వారియర్స్ క్రీడాకారులు 17 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. వైజాగ్ వారియర్స్ కెప్టెన్ కె అశ్విన్ హెబ్బార్ 19 బంతుల్లో 36 పరుగులు చేశారు. బౌలింగ్‌లోనూ గోదావరి టైటాన్స్ అదరగొట్టారు. ఆ జట్టు బౌలర్ ఎస్‌కె ఇస్మాయిల్ మూడు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశారు. కెవి శశికాంత్ మూడు ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, టి విజరు నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కైవసం చేసుకున్నారు. గోదావరి టైటాన్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.










