Jun 23,2023 18:50

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ బాధితుల సంఖ్య మరింత పెరగనుందని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ వ్యాసం వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మధుమేహుల సంఖ్య 130 కోట్లకు చేరనుందని పరిశోధకులు వెల్లడించారు. ఇక 2021లో ప్రచురించిన లాన్సెట్‌ నివేదికలో 52.9 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారనిని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనంలో పరిశోధకులు తెలిపారు. అయితే రాబోయే సంవత్సరాల్లో అధిక బరువు సమస్యతో బాధపడేవారే డయాబెటిస్‌ బాధపడతారని పరిశోధకులు అంచనా వేశారు.
2021లో ఈ రుగ్మత కారణంగా 67 లక్షల మరణాలు సంభవించాయని అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య అంచనా వేసింది. డయాబెటిస్‌ నివారణ కోసం పటిష్ఠ చర్యలు చేపట్టకపోతే.. ప్రపంచంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకుడు కెన్యిన్‌ లియేన్‌ ఓంగ్‌ తెలిపారు.
అల్ప, మధ్యాదాయ దేశాల్లో ఈ రుగ్మతతో బాధపడే వారి సంఖ్య అత్యధికంగా పెరిగే అవకాశం ఉందని ఓంగ్‌ తెలిపారు. దీనికి కచ్చితమైన పరిష్కారమేమీ లేదని ఓంగ్‌ పేర్కొన్నారు. ఈ పరిశోధనలో భారత్‌, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాకు చెందిన పలువురు పరిశోధకులు పాల్గొన్నారు.