ఇందుగలడందు లేడని
సందేహము వలదు
చక్రి సర్వోపగతుండు
'లోకార్థం' కోసం,
కొరియాలో ముప్పై లక్షలు
ఇరాక్ లో పదకొండు లక్షలు
వియత్నాం లో మూడు లక్షలు
ఆఫ్ఘన్ లో లక్ష
సిరియా లో ఆరు లక్షలు
ఇరాన్ లో పది లక్షలు
పాలస్తీనా లో రెండు లక్షలు
లిబియాలో ముప్పై వేలు
ఇంకా మరెన్నో లక్షల మంది
ప్రాణాలు హరించిన అమెరికా,
నాకెదురు నిలిస్తే
సద్దాం హుస్సేన్ లా ఉరి తీసేస్తాం
నజీబుల్లా ప్రభుత్వంలా కూల్చేస్తాం
సాల్వడార్ అలెండీలా చంపేస్తాం,
ఇలా ...
ఎందెందు వెతికినా
అన్నింటా నేనే
యుద్ధోన్మాది
ఆయుధాల వ్యాపారి
అంతర్జాతీయ ఉగ్రవాది
ప్రపంచ పోలీస్
ఖండాంతర వ్యాప్తి
పరమార్థం కోసం,
కుంపటులుంటేనే నా చలికి సెగ
యుద్ధాలుంటేనే నాకు నిద్ర
మీరు తన్నుకు చస్తేనే నాకు భోగం
మీకు అశాంతి
నాకు మాత్రం అదే శాంతి
మీకు సంక్షోభం
నాకు సంక్షేమం
నా పాత్ర లేకుండా యుద్ధమా?
మీకేమైనా డౌటా?
నా కంటే ఉగ్రవాది ఉంటారా?
నాదే అగ్ర రాజ్యం.
- ఎ. అజ శర్మ