Oct 12,2022 20:40

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ :ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌ మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ ఆస్తులు అమ్మైనా ఆంధ్రా ఖాతాదారులు కట్టిన డబ్బును చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం విశాఖపట్నం డిఆర్‌ఎం కార్యాలయం సమీపంలో ఉన్న మైక్రో కాంటినెంటల్‌ హోటల్‌ వద్ద బాధితులు ధర్నా చేశారు. కంపెనీ ఖాతాదారులందరికీ న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ అక్కడ నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రమంతటా 30 వేల మంది ఖాతాదారులకు రూ.30 కోట్లు కంపెనీ చెల్లించాల్సి ఉందన్నారు. మైక్రోఫైనాన్స్‌ యాజమాన్యం పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. వైజాగ్‌లో ఉన్న కంపెనీ ఆస్తులను చూపించి ఏజెంట్లతో రూ.వేల కోట్ల వ్యాపారం చేయించారని, చెల్లింపు విషయం వచ్చేసరికి సిబిఐ కోర్టులో కేసు ఉందని, పేమెంట్‌ విషయం చెప్పలేమని దాటవేస్తున్నారని తెలిపారు. కంపెనీ ఆస్తులను అమ్మైనా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కూలీనాలీ చేసుకుంటూ కడుపు మాడ్చుకొని కంపెనీని నమ్మి కట్టిన ఖాతాదారులకు చెల్లింపులు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితుల సంఘం అధ్యక్షులు కాత అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం సంఘం ఉపాధ్యక్షులు పల్లెల ఈశ్వరరావు, కార్యదర్శి ఎల్‌.కిరణ్‌, సహా కార్యదర్శి ఎం బాబూరావు, కమిటీ సభ్యులు బి గంగునాయుడు, జి లక్ష్మి, ఒ భీమునాయుడు, టి నాగరాజు, ఆర్‌ పోతురాజు, లో రాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ ఏజెంట్లు, ఖాతాదారులు, బ్రాంచి మేనేజర్లు పాల్గొన్నారు.