ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అవినీతి నిరోధక శాఖ కేసులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఇటీవల ఏర్పాటుచేసిన అత్యున్నతస్థాయి కమిటీ తొలి భేటీ నిర్వహించింది. కేసుల లోతును అధ్యయనం చేసేందుకు అవసరమైన వివరాలు సేకరించేందుకు ఎసిబి డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. దాదాపు 15 అంశాలతో కూడిన నమూనాను కూడా ఎసిబికి పంపించినట్లు తెలిసింది. విధి నిర్వహణలో అవకతవకలపై అనేక మంది అధికారులు, ఉద్యోగులు చాలా సంవత్సరాలుగా అవినీతి నిరోధక శాఖ కేసులను ఎదుర్కొంటున్నారు.
ఏళ్ల తరబడి ఈ కేసులు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. కొంతమంది ఉద్యోగులు, అధికారులైతే పదవీ విరమణ కూడా చేసేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కేసులపై సమీక్ష జరిగి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ అమలు జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా కేసుల పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎసిబి డిజికి పంపించిన లేఖలో పొందుపరిచిన నమూనా ద్వారా మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. కేసులో ఇరుకున్న ఉద్యోగి పేరు, కేసు కోణం, ఎఫ్‌ఐఆర్ నంబర్, సంక్షిప్తంగా కేసు వివరాలు, కేసు ప్రస్తుత పరిస్థితి, నిందితులకు ఇచ్చిన నోటీసు, వచ్చిన రిప్లై వివరాలు, కేసుపై ఎసిబి సిఫార్సులతోపాటు, ఉద్యోగి పనిచేస్తున్న శాఖ, విజిలెన్స్ కమిషన్ సిఫార్సులను కూడా సమర్పించాలని ఎసిబి డిజిని కమిటీ కోరింది.










