ఇది గానగంధర్వుడు ఘంటసాల శతజయంతి సంవత్సరం. ఆయన పాడిన భక్తి గీతాలు, ప్రేమ గీతాలు, విరహ గీతాలు యుగళగీతాలు, పద్యాలు ప్రైవేటు రికార్డులు (దేశభక్తి, లలిత) ఇప్పటికీ తెలుగు నేలపై ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన గానకళను అమితంగా ఆరాధించే ఎందరి గుండెల్లోనో కొలువై ఉన్న సంగీత మాధుర్య పాటల తేనె పట్టు.
గతంలో ఆయన ఆరాధకులు, వారి కుటుంబ సభ్యులు, ఆయన జీవితం గురించి, విజయనగరంలో సంగీత విద్యను అభ్యసించిన రోజుల మొదలుకొని భగవద్గీత గానం వరకు.. ఎన్నో మధుర తలపులు పలవరించి, పులకరించి మైమరపింపచేశారు. ఆ కోవలోనిదే ఇటీవలి భాస్కర సత్య జగదీష్, ఘంటసాల జీవిత చరిత్రపై రచించిన పుస్తకం. ఆయనే ఇంకొక అడుగు ముందుకు వేసి సురభి కుటుంబం చేత ఆ కథను నాటకంగా ప్రదర్శించారు. ఘంటసాల జీవిత చరిత్రను వంద నిమిషాల రంగస్థల నాటకంగా మలిచి, ఇప్పటికి వరంగల్, కాకినాడ గుంటూరులో ప్రదర్శించారు. ఈనెల 2 నుంచి 6 వరకు గుంటూరు ఎల్విఆర్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలోని బహిరంగ వేదికపై నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాల్లో మొదటి రోజు ఘంటసాల నాటకాన్ని ప్రదర్శించారు.
ఈ నాటకం ఘంటసాల తన విజయ నగర గురువులను కలిసి అక్కడ కుదురుకున్న ఘట్టంతో ప్రారంభమవుతుంది. నేపథ్యంలో వ్యాఖ్యానం, సన్నివేశ సందర్భాలను సమన్వయ పరుస్తూ, ఆయా సందర్భాలకు ఘంటసాల గాన గుబాళింపు పరిమళాలను అద్దుతూ, ఆయన జీవిత చరమాంకం వరకు దృశ్య శ్రవ్య మాధ్యమంగా ప్రదర్శించారు, సురభి సంతోష్. ఘంటసాల వారిని తనపై ఆవహింప చేసుకుని ఆహార్య ఆంగిక అభినయాలతో రూపుమాసిపోని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేక్షకుల కళ్ళ ముందు నిలిపారు. ఘంటసాల నాటక విజయానికి యధాశక్తి కృషి చేశారు. ఈ నాటక రంగస్థల బయోపిక్ మంచి చెడ్డలను ఘంటసాల, సురభి సమాజ అభిమానిగా చర్చించే ప్రయత్నం ఈ వ్యాస పరమార్థం.
తన గురువుల సమక్షంలో, ద్వారం వారు వాయులీనంపై సహకరిస్తుండగా, కచేరితో నాటకం నడక వేగాన్ని అందుకుంటుంది. స్వాతంత్రోద్యమ సమరశీల ఘట్టాలలో ఘంటసాల 'స్వాతంత్య్రమె నా జన్మహక్కని... చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!' వంటి పాటలు పద్యాల నేపథ్యంలో సాగుతాయి. ఘంటసాల, హిందుస్తానీ గాత్ర మాంత్రికుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ కు ఆతిథ్యం ఇవ్వడం, 1962 చైనాతో యుద్ధ సమయంలో ఎన్టీఆర్‌తో కలిసి దేశ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరించడం, లతా మంగేష్కర్ సమక్షంలో పాడటం ఆమెతో పాటించడం, జాషువా పద్యాలను ఆయనను కూర్చోబెట్టి వినిపించడం, కాసు బ్రహ్మానందరెడ్డి, నందమూరి, అక్కినేనిలతో వేదికపై సత్కరింపబడటం, ఘంటసాల తన జీవిత చరమాంకంలో ఆయన పడ్డ వేదన వంటి ఘట్టాలను స్మరింప చేస్తూ, స్ఫురింప చేస్తూ సాగుతుంది.
ఈ సందర్భంగా నాటకం ప్రదర్శించిన తీరును విమర్శక సహృదయంతో కొన్ని విషయాలను, ఈ నాటకం తదుపరి ప్రదర్శనలలో సవరించుకోతగిన వాటిని ప్రస్తావిస్తాను. అప్పుడెప్పుడో బీ.వీ.కారంత్, సురభి వారి నాటక ప్రదర్శనలను తిలకించి, ఎన్‌ఎస్డి శిక్షక బోధకులచే వారికి, నట శిక్షణా శిబిరం ఒకటి నిర్వహించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక సాంఘిక ఆత్మకథాత్మక నాటకాన్ని ప్రదర్శించడం ఇదే ప్రథమంగా భావిస్తూ చేస్తున్న ఆలోకనం ఇది.
ఘంటసాల గాన మాధుర్యాన్ని చవిచూసిన వారు జీవితాంతం ఆ మాధుర్యానుభూతులను మర్చిపోరు. ఈ నాటకం ఆయన పాటల పాటకచేరి కాకపోయినా, టైటిల్ వినగానే వేదిక ముందు ప్రేక్షకులు రూపక రసాస్వాదనకు సిద్ధమైపోయారు. వ్యాఖ్యాత ఉపోద్ఘాతం, ప్రార్థనతో ప్రారంభమైన ఈ నాటకం ప్రార్థన మరింత సభక్తిద్యోతకంగా, మదువుగా జరిగి ఉంటే వ్యాఖ్యాత స్వరం నడిపించి ఉంటే బాగుండేది. ఘంటసాల గురువులుగా నటించిన వారి వాచిక దోషాలు, ఆయా సందర్భాల్లో కావల్సినంత మృదుత్వం స్వరమాధుర్యం చెవిన పడలేదు. నేపథ్యంలో పాటల రికార్డింగ్, ప్రసార నాణ్యత లోపించడం ఒక అవరోధం. ఆయా సన్నివేశాలకు మరింత ప్రాణ ప్రతిష్ట చేయాలంటే, ఘంటసాల అభిమాన గాయకులెందరో, ఆయనను అనుకరించి పాడేవారు ఉన్నారు. వారితో గాత్ర వైవిధ్యాన్ని స్ఫురింపచేసే విధంగా నేపథ్యగానం సమకూరిస్తే బాగుంటుందనిపించింది.
లైట్స్ ఆఫ్.. ఆన్ .. అనే మాటలు సన్నివేశ తాదాత్మ్యాన్ని భంగపరిచాయి. స్వాతంత్య్రమే మా జన్మ హక్కు అనే పాటలో పాల్గొన్న బృందం, ఆంగికంపై ఏమాత్రం అవగాహన లేకుండా యాంత్రికంగా చేతులూపుతూ జై కొట్టడం- దేశభక్తి రసోత్పత్తికి విఘాతం. ఇలాంటి సన్నివేశాలను ఒద్దికల సమయంలో దర్శకుడు నటీనటుల ముందుండి, సన్నివేశం ఎలా వస్తోందో, ఇంకా ఎలాంటి సూచనలు ఇవ్వాలో గమనించి సరి చేస్తే బాగుంటుంది. బాలాంత్రపు రజనీకాంతరావు పాత్రధారి అవసరానికి మించిన వినయ విధేయతలు ప్రదర్శించగా నందమూరిగా నటించిన నటుడి ఆంగికం ఓవర్‌గా అనిపించింది.
ఘంటసాల పాత్రధారి ఒక సన్నివేశంలో తోలేటి పార్థివ దేహంపై తన శాలువా కప్పడం ఉండాల్సిన విధంగా లేదు. నిండు ద్ణుఖాన్ని వినిపించే ధోరణి ఔచిత్యవంతంగా కనిపించలేదు. తోలేటి వారి అర్ధాంగి పాత్రధారిణి, శవం దగ్గర ఏడుపు శృతిమించింది. జీవిత చక్రం పాటల (స్టూడియో) రికార్డింగ్ సందర్భంలో సంగీత దర్శకుడి వాచకం, ఘంటసాల సతీమణిగా నటించిన నటి వాచికాభినయంలో ఇంకా ఎంతో సాత్వికత అవసరం. వైద్యుడు ఘంటసాల శయ్య పక్కన కూర్చుండి మాట్లాడిన తీరు సవరించుకోవాలి. ఎంత గొప్ప వారైనా ఘంటసాల వారి ముందు ఇసుమంతైనా అవిధేయాన్ని ప్రదర్శించి ఉండరు. లతా మంగేష్ అని కాకుండా మంగేష్కర్ అని సంబోధించాల్సిందే ఎవరైనా.
ఈ సూచనలను సహృదయంతో పున:సమీక్షించు కొని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే రాబోయే ప్రదర్శనలు మరింత జనరంజకంగా సాగుతాయని, ప్రేక్షకులు మరింత ప్రచారం కల్పించడం ద్వారా వేదిక ముందు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు చేరి, నాటక దృశ్యాలను పులకిత గాత్రులై దర్శించి, సురభి వారి ప్రయత్నానికి జేజేలు పలుకుతారని నా నమ్మకం. నటీనటుల నుంచి తనకు కావలసిన స్థాయిలో, పూర్తి నటనా సామర్థ్యాన్ని రాబట్టుకోవడం దర్శకుడు ఎవరైనా చేయవలసిన పని. నటీనటులకు వాళ్ళ సహజమైన మూస ధోరణిలోనే నటిస్తుంటే, తనకు కావలసిన ఎఫెక్ట్ సాధించుకోవడంలో మొహమాట పడకూడదు. ఆహార్యం విషయంలో, ఆయా ఘట్టాల్లోని వ్యక్తులను, దగ్గరి పోలికలతో చూపే ప్రయత్నం బాగుంది. ఈ నాటకం మరిన్ని ప్రదర్శనలకు నోచుకుని, సురభి సమాజం ఇప్పటితరం ముందు లైమ్ లైట్‌లో కనిపించాలని ఆకాంక్ష.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655










