May 08,2023 06:54

మహాకవి గురజాడ అప్పారావు గేయ కవిత్వాన్ని ప్రచారంలోకి తీసుకుని వచ్చిన తరువాత కష్ణశాస్త్రి, శ్రీశ్రీ వంటి వారు గేయ కవిత్వానికి విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. గేయ కవిత ప్రారంభంలో భావ కవిత్వంగా కొంతవరకు పరిఢవిల్లినా, క్రమంగా అభ్యుదయ కవిత్వంగా రూపుదిద్దుకుంది. తెలంగాణా విమోచనోద్యమంలో గేయం నిర్వహించిన పాత్ర అమోఘమైనది. తరువాతి కాలంలో విప్లవ కవిత్వంగానూ మారుమ్రోగింది. పదం, గేయం, పాట సమానార్థకాలు. గురజాడ తరువాత ఒక అర్ధ శతాబ్దం పాటు గేయ కవిత నిరంతరాయంగా సాగింది. తదుపరి వచన కవిత్వం బలపడి గేయ కవిత్వం వెనుకబడిపోయింది. ఏదైనా ఒక భావాన్ని లయబద్ధంగా చెప్పినప్పుడే అది మనసుకు నాటుకుంటుంది. వచనానికి ఆ శక్తి లేదు. పాటకు శబ్దించే గుణం ఉన్నందువల్ల పాడిన వాళ్లనే కాదు, విన్నవాళ్లను కూడా ప్రభావితం చేయగలదు. పాట కంటే గొప్ప వినోద సాధనం, ప్రచార సాధనం మరొకటి లేదు. ఈ అవసరాన్ని గుర్తించి 'గేయం ఐపోతుంది మాయం/ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే/ తెలుగు కవిత్వం తన జవ సత్వాలను/ కోల్పోవడం ఖాయం' అంటూ ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ అభ్యుదయ కవి సీరపాణి 'గేయ కవితా ప్రస్థానం' పేరుతో 2017 నవంబర్‌ 26వ తేదీన ఒక గేయ కవిత ఉద్యమాన్ని విజయనగరంలో ప్రారంభించారు. గేయ రచనా సామర్థ్యం ఉన్న కవులను ప్రోత్సహించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కవుల నుంచి రచనలను ఆహ్వానించారు. 100 మందికి పైగా కవుల గేయ కవితలను 'పాటసారులు' పేరుతో ఒక సంకలనంగా ప్రచురించారు. రచయితలు తమకు నచ్చిన విషయం మీద రాసి వీలు కల్పించారు.
'అమ్మ' అనే గేయంలో రాయవరపు సరస్వతి 'అమ్మే ఇలలో దైవం/ అమ్మే జగతికి మూలం/ చందమామ చూపించి/ గోరుముద్ద తినిపించి/ తొలి మాటను పలికించి/ తొలి అడుగ వేయించె' అని సృష్టిలో మాతృమూర్తి ఔన్నత్యాన్ని ఉగ్గడిస్తారు. 'అమ్మా చల్లనినిమ్మా' గేయంలో డా: పి.బాబురావు 'అమ్మ హస్తమే అమృతం పంచు/ అమ్మ హస్తమే ఆశీర్వదించు/ అమ్మ కమ్మని తేనెల మనసు/ అమ్మ నిమ్మల నీడని తెలుసు' అని అమ్మ చేతి చలువ విలువలను వర్ణిస్తారు.
మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ కొంతమంది కవులు గేయాలను రాశారు. 'భారతీయుడ ఓయి యువకుడ' గేయ కవితలో బుడితి రామినాయుడి 'ఆడవాళ్లను ఏడిపిస్తే/ అల్పుడౌదువు అసురుడౌదువు/ అమ్మ అక్క చెల్లి కూడా/ ఆడవాళ్ళని మరచిపోకోరు' అంటూ ఆకతాయిలను హెచ్చరిస్తారు. 'భూమి కరుసు' గేయ కవితలో సంకిస భరద్వాజ శంకర్‌ 'సదువుకోను బడికి పోతె/ కోతి మూక సదువ నీదు/ సదువుకోని పనికి పోతె/ కొంటె చూపు బతక నీదు/ ఆలి కరుసు అమ్మ కరుసు/ అక్క కరుసు సెల్లి కరుసు/ భూమి కరుసు బువ్వ కరుసు/ కరుసై పోనాది వదినమ్మ' అని పీడిత స్త్రీల దుస్థితిని చెబుతారు.
'జరభద్రం'లో పుచ్చకాయల బ్రహ్మాజీ 'జనులున్న అడవిలో జరభద్రమో/ పులులున్న అడివైన పలుతీరు నయమమ్మ/ ఏ మనిషి గుండెలో ఏ మృగము దాగెనో/ ఏ పలువ మనసులో ఏ పాములాడునో/ ఆచితూచి నీవు అడుగు వేయావమ్మా/ ఆదమరచి ఉంటే ఆపదలు దాపించు' అని ఆడపడుచులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
ఈ సంకలనంలో తెలుగు భాష యొక్క ప్రాశస్త్యానికి పరవశిస్తూ గానం చేసిన కవి కోకిలలూ ఉన్నారు. 'ఎంత సక్కని భాష మన భాష/ ఎంత కమ్మని భాష మన భాష/ సెలయేటి గలగలలు కిలకిలరావాలు/ సొగసైన నుడికార మందార హల్లులు/ తేనెలొలికే భాష తియ్యనైనా భాష/ ఓ అమ్మ ఓ అయ్య ఓ అక్క ఓ సెల్లి' అంటూ సిహెచ్‌.వి లక్ష్మి తెలుగు భాషా సౌందర్యాన్ని కళ్ళముందు పెడతారు. 'జీవనాడి నా తెలుగు' అనే ఖండికలో శ్రీ లక్ష్మీ చివుకుల ఇలా అంటారు : 'అమ్మ పాడిన పాటలా కమ్మనైనది తెలుగురా/ ఉగ్గు పట్టి లాలపోసి ఊయలూపిన జోలలా/ వాన వాన వల్లప్పా అని కురిసిన చిరుజల్లులా/ మట్టి వాసన సుగంధం పులకించినట్టి అవనిలా' ఈ గేయం మెండైన అచ్చ తెలుగు పదాలతో నిండుగా సాగింది.
కొందరు కవులు దేశభక్తిని ప్రబోధించే గేయాలు రాశారు. 'జెండా వందనమంటూ' అనే గేయంలో సబ్బని లక్ష్మీనారాయణ 'జెండా వందనమంటూ సాగి ముందుకడుగేద్దాం/ సత్యమేవ జయతే అంటూ చాటి చెప్పి నడుద్దాం' అని స్వతంత్ర సమర వీరుల త్యాగాలు కొనియాడుతూ ఈ గేయాన్ని రాశారు.
ఈ సంకలనంలో ప్రకృతి సౌందర్యానికి సంబంధించిన గీతాలు కూడా ఉన్నాయి. 'ఋతుగీతం' గేయంలో అభిలాష అనే కవి 'వసంత రుతువు వచ్చింది/ చెట్లకు చిగురు తొడిగింది/ ఉగాది పండుగ వచ్చింది/ రుతువుల రాణి అయింది' ఆరు రుతు వుల్నీ సరళమైన గేయ పాదాల్లో వర్ణించారు. ఎస్‌.లక్ష్మీనా ధాచార్యులు 'అందాలు' గేయంలో 'వినువీధికి చుక్కలె అందం/ వనరాణికి మొక్కలె అందం/ కడలి రాజుకు అలలె అందం/ హిమగిరికి శిఖరాలె అందం' అంటూ అందం యొక్క పరమార్థాన్ని సృష్టిలోని అనేక అంశాలకు ఆరోపించి చెప్పారు.
'వినరయ్యా వినరమ్మా' అనే గేయంలో డా.ఎం. లక్ష్మణాచార్యులు 'పచ్చదనం లేకుంటే నరకం నరకం/ పచ్చదనం ఆనందం పచ్చదనం ఆరోగ్యం/ పచ్చదనం సౌభాగ్యం పచ్చదనం జీవనం' అంటూ వృక్షాల అవసరాన్ని ప్రబోధాత్మకంగా వివరించారు. 'యువగీతం' గేయంలో రామతీర్థ 'పాటంటే శివమెత్తిన నయాగరా/ పాటంటే శివుడు సీమ నగారా/ గొంతెత్తి పాడరా గాయకుడా/ ప్రగతి గీతం ప్రజల కోసం/ ప్రజల గీతం ప్రగతి కోసం' అని ఎలుగెత్తి చాటారు. 'నినదించు' గేయ కవితలో గార రంగనాథం 'చెమటను తడిసిన మట్టి బెడ్డపై/ విత్తనమై మొలకెత్తుతావు/ రూపాయి నోటుపై రూపెత్తి నీవు/ చదువూ సంధ్యా భక్తీ ముక్తీ/ రూకకు దొరికే అంగడి సరుకులు/ ఓటుకు నోటు నోటుకు ఓటు/ ధనం మూలమీ జగత్తు' అంటూ జాతిని జాగృతం చేస్తున్నారు. గంటా రామకృష్ణ రైతన్న వలస బాట, బి.గోవర్ధన్‌రావు 'పల్లె పిలిచింది' గేయ కవితలు పల్లెల ప్రాధాన్యాన్ని చెబుతున్నాయి.
'శైశవ వేదన'లో 'కన్న కలలు కరిగిపోయె/ కార్పొరేటు చదువులతో/ బాల్యమే లేని బతుకు/ బండగాను మారిపోయె' అంటూ చెళ్లపిళ్ల శ్యామల ఈనాటి విద్యార్థులు తమ బాల్యంలోని కమ్మని అనుభూతులను ఎలా కోల్పోతున్నారో వివరించారు. 'వారసుడా' అనే కవితలో జక్కు రామకృష్ణ 'సైరికుడవురా నీవు/ నీ పైరు గీతములే/ సూర్యునికి మేలుకొలుపు/ నీ కోటేరు వాలకం/ సాయంకాల సూచన' అంటూ రైతు దైనందిన జీవితాన్ని హృద్యంగా చూపుతారు. 'హంసగీతి' అనే గేయంలో అలపర్తి వెంకట సుబ్బారావు 'పండు ముసలినౌతున్నా/ తిండి తిప్పలెన్నున్నా/ గుండె రాయి చేసుకుని/ మొండిగా జీవిస్తున్నా' అని ఈనాడు చాలామంది వృద్ధులు ఎలాంటి దుర్భర జీవనాన్ని గడుపుతున్నారో తెలియజేస్తుంది. 'నువు తిరగబడ్డ పులిబిడ్డగా ఇకపై మారాలి/ నీ శరీరాన్ని ఉక్కు ముక్కగా చేసుకోవాలి/ అపరంజిల్లా నిన్నే నువ్వు సాన పెట్టుకోవాలి/ లింగ వివక్షకు తిరుగుబాటు జెండా ఎగురవేయాలి' అని మహిళా లోకాన్ని మేల్కొలుపుతారు పాతూరి అన్నపూర్ణ.
ఈ సంకలనంలో గేయాలతో పాటు పాట, వచన కవితలను కూడా ప్రచురించారు. మొదట ప్రయత్నమైనందువల్ల ఇలా జరిగుండొచ్చు. మాత్రాఛందస్సు సృష్టికర్త గురజాడ. ఈ గేయ కవితా సంకలనాన్ని ఆధునిక గేయ కవిత్వానికి ఆద్యుడైన మహాకవికి అంకితమివ్వడం ఔచిత్యవంతంగా ఉంది. ఇంతటి గొప్ప ప్రయత్నానికి 2021లో సంపాదకులు దరఖాస్తు చేయగా, రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ నుంచి సైటేషన్‌ నెంబర్‌ దొరకకపోవడం శోచనీయం. అంతరించిపోతున్న గేయ కవిత్వాన్ని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నానికి ఇదేనా చేయూత? ప్రతులకు: సంపాదకులు, సీరపాణిని 87902 32565లో సంప్రదించొచ్చు.

- పిల్లా తిరుపతిరావు, 70951 84846