Jun 14,2023 08:16

ఎండాకాలం అనగానే మండే ఎండలే కాదు.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు కూడా గుర్తుకొస్తాయి. శుభకార్యాలకు వేసుకెళ్లేందుకు ఎన్నాళ్లో నుండో బీరువాలో దాచి, ఉంచిన పట్టు బట్టలు ఇప్పుడే బయటికి తీస్తారు. ధరిస్తారు. అయితే yటిపై అనుకోకుండా ఏదైనా మరకలు పడితే సాధారణ దుస్తుల్లా వాటిని ఉతకలేం. కట్టుకున్న ప్రతిసారీ డ్రైవాష్‌ చేయించడం కూడా మంచిది కాదు. మరేం చేయాలి.. పట్టుబట్టలపై పడిన రకరకాల మరకలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రకలు పడకుండా ఉన్న పట్టుబట్టలు ఉతకాలంటే ముందుగా ఆ బట్టలు మునిగేంత వరకు నీళ్లు పోసి అందులో గళ్లుప్పు కలిపి, ఆ నీటిలో పావుగంట నానబెట్టాలి. ఆ తరువాత తేలికపాటి రసాయనాలు గల షాంపు గానీ, కుంకుడుగాయ రసం గానీ కలిపిన నీటిలో మరో పావుగంట ఉంచాలి. ఆ తరువాత సాధారణ నీటిలో శుభ్రం చేయాలి.

  • చాక్లెట్‌ మరకలు పడితే వేడినీటిలో జాడించి ఉతికితే పోతాయి.
  • పెరుగు, వెన్న వంటి మరకలు పడితే మరకపై ఒక చుక్క కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ను వేసి మెత్తని వస్త్రంతో రుద్దితే మరక పోతుంది.
  • కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడి నీటిలో కొద్దిగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి ఆ నీటిలో ఉతకాలి.
  • బురద మట్టి మరకలు పడితే బాగా ఆరనిచ్చి కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌తో తుడిచి ఉతికితే సరిపోతుంది.
  • షూ పాలిష్‌ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్‌ పూయాలి.
  • ఇంక్‌ లేదా లిప్‌స్టిక్‌ మరకలు పడితే ఆ భాగంలో పేపర్‌ టవల్‌ను ఉంచి వెనుక నుంచి డ్రైక్లీనింగ్‌ ద్రావణం లేదా ఆల్కహాల్‌ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు.
  • నెయిల్‌ పాలిష్‌ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌లో ముంచితే సరిపోతుంది.

                                                             ఇలా భద్రపరుచుకోవాలి..

  • పట్టుబట్టలను విడిగా ఉంచకుండా ప్లాస్టిక్‌ సంచుల్లో లేదా పేపర్‌, కాటన్‌ సంచుల్లో ఉంచాలి.
  • ఈ బట్టలు పెట్టిన చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి.
  • బీరువాలో నేరుగా కాకుండా కవరులో పెట్టి పెట్టాలి.
  • అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకపోతే ముడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.

                                                                     నూనె మరకలు పోవాలంటే..

  • పట్టు చీరను నలు చదరంగా ఉండే ప్రదేశంలో పరుచుకోవాలి. నూనె మరక ఉన్న చోట బేకింగ్‌ సోడా, కార్న్‌ స్టార్చ్‌ లేదా ఉప్పు లాంటి పీల్చుకునే పొడిని మందమైన పొరగా మరకపై బాగా అద్దాలి.
  • ఇలా 2 గంటలు వరకు ఉంచాలి. ఇలా చేస్తే.. మరకపై ఉన్న పొడి నూనెను బాగా పీల్చుకుంటుంది.
  • తరువాత ఆ పొడిని తడి బట్టతో లేదా మెత్తటి కుచ్చులున్న బ్రష్‌తో కాని లేదా ఒక శుభ్రమైన తెల్లటి బట్టతో కాని రుద్దుతూ ఉండాలి. ఇంకా మరక మిగిలి ఉంటే, మళ్లీ మొదటినుండీ ఈ ప్రక్రియను చేయాలి. ఈ పద్ధతి వల్ల ఫాబ్రిక్‌ దెబ్బతినకుండా మరక పోతుంది.
  • రెండవ పద్దతి ఏమిటంటే, కొద్దిగా డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ను మరక పై రుద్దాలి. ఆ తరువాత మొత్తమంతా కాకుండా నీటి మరక ఉన్నచోటే జాగ్రత్తగా తడి చేసుకోవాలి. ఇప్పుడు మరక పై ఉన్న తడి ప్రదేశాన్ని హెయిర్‌ డ్రైయర్‌తో, చల్లని గాలిలో లేదా ఫ్యాన్‌ ముందు ఆరబెట్టాలి. ఇలా చేస్తే కూడా నూనె మరక పోతుంది.