Jun 14,2023 08:13

ప్రపంచ జనాభాలో 30 శాతానికి పైగా ఎనిమిక్‌ (రక్తహీనత)తో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. దీనివల్ల అతిగా అలసట, బలహీనంగా మారడం, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది, రాత్రివేళల్లో గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోవడం, జట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలలో సుమారు 50 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రక్తహీనత నుంచి బయటపడే సూచనలు ఇస్తున్నారు.

  • శరీరంలోని ఎర్ర రక్త కణాల్లో ఖనిజాల లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్‌ తక్కువగా చేరి అలసట వస్తుంది. నిత్యం నీరసంగా ఉండి ఏ పనిమీద ఏకాగ్రత ఉండదు.ఈ లక్షణాలు ఉంటే ఐరన్‌ లోపం లేదా ఐరన్‌ డెఫిషియన్సీ ఎనీమియాతో బాధపడుతున్నారని అర్థం. శరీరం స్వతహాగా ఈ ఖనిజాన్ని ఉత్పత్తి చేయలేదు. అందుకే తినే ఆహారంలో ఐరన్‌ ఉండేలా చూసుకోవాలి.
  • వెజ్‌, నాన్‌ వెజ్‌ ఆహార పదార్థాల్లో ఉండే ఐరన్‌ వల్ల ఎనీమియా సమస్య నుంచి బయటపడొచ్చు. మటన్‌, చికెన్‌, రెడ్‌ మీట్‌, లివర్‌లోలో పుష్కలంగా ఐరన్‌ ఉంటుంది. రక్తాన్ని వృద్ధిచేసే ఖనిజాలు ఉంటాయి. గుడ్లు, చేపల్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తి సమకూర్చుతాయి.
  • క్యాబేజీ, పాలకూర వంటి ఆకుకూరలు, బఠాణీ, చిక్కుడు వంటి కాయగూరల్లోనూ ఐరన్‌ లభిస్తుంది. ఈ రకంగా లభించే దాన్ని నాన్‌ హీమ్‌ ఐరన్‌గా పిలుస్తారు.
  • పచ్చి క్యాబేజీలో ఐరన్‌ ఖనిజం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉడికిస్తే దానిలోని ఐరన్‌, సి విటమిన్‌ శాతం తగ్గిపోతుంది. మరిగిస్తే మరింత ఐరన్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే పచ్చి క్యాబేజీనే మంచిదంటున్నారు నిపుణులు.
  • పాలకూరలో ఆక్సలేట్స్‌ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సాధారణంగా ఐరన్‌ను బంధించి ఉంచుతాయి. పాలకూరను ఉడికించినప్పుడు ఆక్సలేట్లు నీటిలోకి విడుదల అవుతాయి. అప్పుడు పాలకూరలో ఉన్న ఐరన్‌ శరీరం గ్రహించడానికి వీలుగా అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు.
  • కాలే, బ్రకోలీ, కాలిఫ్లవర్‌, వాటర్‌క్రెస్‌లో విటమిన్‌ 'సి' తో పాటు ఐరన్‌ కూడా ఉంటుంది. ఇలా సహజ ఆహార వనరుల నుంచి ఐరన్‌ను పొందితే రక్తహీనత సమస్య తగ్గుతుంది.