- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు
ప్రజాశక్తి-యంత్రాంగం :మణిపూర్‌లో జరిగిన అమానుష ఘటనలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని, మహిళలపై అమానుషకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపూర్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ 62వ డివిజన్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ సెంటర్‌లో కెవిపిఎస్, డివైఎఫ్‌ఐ, దళిత సంఘాల నాయకులు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. మణిపూర్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రుల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల నిరసనలు జరిగాయి. కె.గంగవరం మండలంలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. కరపలో అంబేద్కర్ యువజన సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేశారు. కర్నూలు పాతబస్తీలో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు ఉర్దూ ఘర్‌లో దళిత, గిరిజన, మైనారిటీ, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో చర్చా వేదిక చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యాన పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్‌లో సిఐటియు ఆధ్వర్యాంలో రాస్తారోకో చేశారు. శ్రీకాకుళం నగరంలోని పిఎస్‌ఎన్‌ఎం హైస్కూల్ జంక్షన్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. అల్లర్లతో మణిపూర్ అట్టుడుకుతుంటే ప్రధాని మోడీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.










