Jan 04,2023 10:09

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ఫ్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిఒ నెంబరు1పై న్యాయ నిపుణులు, రాజకీయ, ప్రజాసంఘాల నాయకుల స్పందన వారి మాటల్లోనే..

General-outrage-over-GO-No-1

                                              ఇదేమి ప్రజాస్వామ్యం ? : సుంకర రాజేంద్రప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు

బ్రిటీషు పాలనలో ప్రజలను తమ అభిప్రాయాన్ని చెప్పడానికి వీల్లేకుండా తీవ్ర ఆంక్షలు ఉండేవి. జిఓ నెంబరు 1ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు. ప్రజల వద్దకెళ్లి తమ భావాన్ని వ్యక్తపరుచుకునే స్వేచ్ఛలేదు. రోడ్డుమీద, మార్జిన్‌ మీద సభలు, సమావేశాలు నిర్వహించుకోకూడదనడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. భావక్రటనా స్వేచ్ఛను నిషేధించే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చిన జిఓను వెనక్కు తీసుకోవాలి.

 

General-outrage-over-GO-No-1

                                                 బ్రిటీష్‌ పాలనా విధానాలు : చలసాని అజయ్, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు

జిఓ నెంబరు ఒకటిని చదివితే అచ్చు బ్రిటీష్‌ పాలనా విధానాన్ని గుర్తు చేస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో ఎవరు మాట్లాడినా వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టే విధంగా తీసుకొచ్చిన పోలీసు చట్టాన్ని నేడు అమలు చేస్తున్నారు. ఒకవేళ సభలు సమావేశాలు పెట్టరాదంటే గతంలో ఎల్‌కె అద్వానీ, ఇప్పుడు రాహుల్‌, రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబు వీరంతా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసేవారా ?

 

                                                     ఇది పరిష్కారం కాదు : పి శ్రీనివాసరావు, సీనియర్‌ న్యాయవాది

ఏక్కడో ఏదో జరిగిందని ప్రతిదానినీ నిషేధించడం దేనికీ పరిష్కారం కాదు. పైగా రాజ్యంగ ఉల్లంఘనే అవుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛను పోలీసు వ్యవస్థ కాలరాయాలను కుంటోంది. ఇంతకంటే దుర్మార్గం లేదు. సమస్య వచ్చినప్పుడు సంబంధిత భాగస్వాములతో చర్చల ద్వారా పరిష్కారం చూడాలి. అంతేకాని నిషేధించడం పరిష్కారం కాబోదు.

General-outrage-over-GO-No-1

                                    ప్రజాస్వామ్య ప్రక్రియకు అడ్డు చెప్పడమే : నర్రా శ్రీనివాసరావు, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా నియంత్రించాలనుకోవడం తప్పు. సభలు, సమావేశాలు బహిరంగ ప్రదేశాలు, రోడ్లు వంటి వాటిపై ఇబ్బంది లేకుండా జరుపుకోవడంలో అభ్యంతరం ఏమీ ఉండదు. దాన్ని నియంత్రిస్తామని పోలీసులు ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్దం. ఇప్పటికే 144, 30 సెక్షన్లు నిరంతరం అమలు చేస్తున్నారు. ఇటీవల జగన్మోహన్‌రెడ్డి రోడ్లపైనే వ్యాన్లు, ఆటోలు ప్రారంభిం చారు. ట్రాక్టర్ల పంపిణీ చేపట్టారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. అప్పుడు ప్రజలను పట్టించుకోకపోవడం, ఇప్పుడు మరొకరు చేశారని నిషేధించడం రాజ్యాంగ స్ఫూర్తి కాదు.

 

General-outrage-over-GO-No-1

                                                              ఏకపక్ష నిర్ణయాలు సరికాదు : బాల, హైకోర్టు న్యాయవాది

ప్రజా రవాణాకు అభ్యంతరం లేకుండా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చని జిఓలో పేర్కొన్నారు. సభలు జరపడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా చేస్తే అభ్యంతరం లేదు. కానీ ఆ పేరిట ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య ఉల్లంఘన అవుతుంది.

General-outrage-over-GO-No-1


                                                  అధికార పార్టీ కోసమే.. : ముప్పాళ్ల సుబ్బారావు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది

ఈ జిఓ అధికార పార్టీకి ఉపయోగపడే విధంగా, ప్రతిపక్షాలను నియంత్రించే విధంగా రూపొందించింది తప్ప మరొకటి కాదు. భావ వ్యక్తీకరణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత పాలకులది. కానీ స్వేచ్ఛను నియంత్రించే విధంగా పాలకులు ఆదేశాలు తీసుకురావడం ప్రజాస్వాయ్యం కాదు.

General-outrage-over-GO-No-1

                                                              జిఓ 1 చెల్లదు : పొత్తూరి సురేష్‌ కుమార్‌, పౌర హక్కుల సంఘం

సభ పెట్టుకోవద్దు అంటే పౌరహక్కులను, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును ప్రభుత్వం ఆపేసినట్లే. ప్రత్యేక సమయాల్లో మినహాయింపులు ఇవ్వొచ్చు అని జిఒలో పేర్కొన్నారు. అంటే వాళ్లకు ఇష్టం వచ్చిన వారికే అనుమతి ఇస్తారు. లేనివారికి ఇవ్వరు. రాష్ట్ర, జాతీయ రహదారులు మీద అనుమతి లేదని చెబుతున్నా జిఓలో మాత్రం పంచాయతీ, జిల్లా పరిషత్‌ రోడ్లపైనా జరపడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.

General-outrage-over-GO-No-1


                                                                                   నిరంకుశం : సిపిఐ

జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరంకుశ విధానం. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా?. ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగమే 1861 పోలీసు యాక్టు ఉత్తర్వులు. వైసిపి శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా ?

General-outrage-over-GO-No-1

                                                                జగన్‌కు భయం పట్టుకుంది : టిడిపి నేతలు నిమ్మల, గోరంట్ల

సభలు, రోడ్‌ షోలను నిషేధించడం అంటే జగన్‌కు భయం పట్టుకుంది. అందుకనే నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంక్షలు విధించిన జగన్‌ మంగళవారం నాడే రాజమండ్రిలో రోడ్‌షో నిర్వహించడం ఉల్లంఘన కాదా? అధికారపక్షానికే వెసులుబాటు కల్పించేలా జిఒ ఉంది. ప్రజా గొంతుకను అణచివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రోడ్‌షోల్లోనే ప్రశ్నిస్తాము.

General-outrage-over-GO-No-1


                                              బ్రిటీష్‌ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలా ? : జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

బ్రిటీష్‌ కాలం నాటి చట్టాల ద్వారా ఆంక్షలు విధించడం సరికాదు. విశాఖలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనను అడ్డుకున్నారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా జిఓ తీసుకొచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి తప్ప ప్రజాస్వామ్యానికి ఏ మాత్రమూ ఉపయోగం లేదు.

                                                                                గొడ్డలి పెట్టు : కాంగ్రెస్‌

జిఓ నెంబరు 1 ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. సభలు, సమావేశాలు రోడ్లపై కాకుండా ఎక్కడ నిర్వహించుకుంటారో ప్రభుత్వమే చెప్పాలి. గత ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రోడ్లపై కాకుండా ఎక్కడ చేశారు ? ఇటుంటి నియంతృత్వ విధానాలు మానుకోవాలి.