ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కోలో ఇక ఒక ప్రైవేటు సంస్థ పెత్తనం చేయనుంది. ఆర్థిక వ్యవహారాల సలహా సంప్రదింపుల సంస్థ కెపిఎంజికి జెన్‌కోలో కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎంతోమంది సీనియర్ అధికారులు, కాకలు తీరిన ఇంజినీర్లు ఉన్నా... ప్రైవేటు సంస్థ సేవలవైపే జెన్‌కో మొగ్గు చూపిస్తోంది. సంస్థకు చెందిన అనేక కీలక రంగాల్లో కెపిఎంజి సంస్థ సేవలు వాడుకోవాలని నిర్ణయించింది. దీనికోసం అవసరమైన దస్త్రాలను కూడా జెన్‌కో సిద్ధం చేసింది. ప్రతినెలా భారీ పారితోషకాలను అందించడంతోపాటు ఇతర ఖర్చుల కోసం పాకెట్ మనీ కూడా సిద్ధం చేస్తోంది. ముందుగా ఒక ఏడాదికి పాటు ఒప్పందం చేసుకోవాలని, అవసరమైతే తరువాత ఒప్పందాన్ని పొడిగించుకోవాలని భావిస్తోంది. త్వరలో జరగనున్న జెన్‌కో బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఇంతకాలం అధికారులు నిర్వహించే అనేక అంశాల పర్యవేక్షణ, సలహాలను ఇకపై కెపిఎంజికి అప్పగించనున్నారు. ఇందులో అత్యంత కీలకమైన సంస్థ వాణిజ్య అంశాలతోపాటు, కొత్త ప్రాజెక్టులను ఈ సంస్థకు అప్పగించనున్నారు. దాదాపు ఐదు రంగాల్లో బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జెన్‌కో, ఎపి పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల వాణిజ్య, నియంత్రణ అంశాల్లో కెపిఎంజి సాయం తీసుకోనున్నారు. జెన్‌కో పాలనా వ్యూహాల్లో కూడా కెపిఎంజి సూచనలు, సలహాలు ఇవ్వనుంది. జెన్‌కో పెట్టుబడితో నిర్వహించే ప్రాజెక్టులకు సహాయం, కొత్తగా ఏర్పాటుకానున్న ప్రాజెక్టుల పర్యవేక్షణ కూడా కెపిఎంజికి అప్పగించనున్నారు. చివరకు పోలవరం హైడ్రో విద్యుత్ కేంద్రం పర్యవేక్షణ కూడా కెపిఎంజి చేతుల్లోకి వెళ్లనుంది. జెన్‌కో, ఎపి పవర్ డెవలప్‌మెండ్ కార్పొరేషన్‌కు కావాల్సిన బొగ్గుపై పర్యవేక్షణ కూడా ఈ సంస్థకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అమలులోకి వస్తే ఇప్పుడున్న అధికారులు, సాంకేతిక నిపుణుల హవా గణనీయంగా తగ్గిపోతుందన్న వాదన వినిపిస్తోంది. కొత్త సంస్థ తరపున నలుగురు పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరందరికీ కలిపి నెలకు రూ.16.60 లక్షలు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులోనే సమావేశాలు హాజరయ్యేందుకు, వాహనాల వినియోగం, వసతి వంటి అంశాలకు ఖర్చు చేసేందుకు ప్రతినెలా రూ.1.18 లక్షలు పాకెట్ మనీ పేరిట ఇవ్వనున్నారు. ఈ సంస్థను మరికొంత కాలం పొడిగిస్తే అదనంగా మరో ఐదు శాతాన్ని కలిపి చెల్లించాలని కూడా భావిస్తున్నారు.










