Jun 19,2023 07:38

''కొ న్ని స్వప్నాలు లెప్పటికీ
కనురెప్పలకు లొంగవు
జీవన ద్రావణమెపుడు
కాలం నాలికలో కుదురుగా వొదగదు..'' అంటూ ఒకే పల్లవి కి విభిన్న రాగాలు కూర్చిన అనుభూతుల అక్షర హాలికుడు, కవి మణీందర్‌ గరికపాటి. కవుల అనుభూతులు కావచ్చు, జ్ఞాపకాలు కావచ్చు, స్వప్నాలు కావచ్చు తమ మనో మందిరాల్లో నిత్యం స్వచ్ఛంగా, తాజాగా, తడితడిగా ఉంటారు. తల్చుకుంటే చాలు; దృశ్యాలు దృశ్యాలుగా కళ్ళముందు నిలుస్తాయి. ఈ అనుభూతులు, ఆలోచనలు, ఆనందాలు, ద్ణుఖాలు, ఆకాంక్షలు, కోరికలు, లోపాలు, తాపాలు ... అన్నీ కూడా కవిత్వంలో భాగం అవుతాయి. కవులు వీటిని దాటుకొని ముందుకు వెళ్ళలేరన్నది వాస్తవం.
         ఈయన గాయాలతో మేల్కొన్న హృదయాల్ని పలకరిస్తాడు. బాల్యాన్ని ఎగరేస్తున్న దృశ్యాల్లో సన సన్నని వాన తుంపర్లలో పిల్లల తోటి, పిచ్చుకల తోటి కలిసిపోతాడు. ఒక కొత్త బంగారు పూలలోకంలో బతకాలని కలగంటాడు. వెదురు పొదల్లో కోకిలగా, ప్రకృతి పాటగా అల్లుకోవాలంటాడు కవి మణీందర్‌. నీది ఎంత అత్యాశయ్యా కవీ.
''నన్నేవరైనా జనారణ్యం నుండి
తరిమేయండి
ఒక కొత్త బంగారు పూలలోకంలోకి..
వనాలపై పాలపిట్టలా
తోపులెంట ఎంత రామచిలకలా
పూల పైన సీతాకోకలా
మొక్కల్లో కొత్త చిగురులా
బతకాలని ఉంది.'' (పుట:13)
నింగి నుంచి నేల పైకి వెలుగు వాగు పొంగినట్లుగా వాన వచ్చిందనీ, వానకు చెట్ల ఆకులు ఓణీలు జారిపోతుంటే నిలువెల్లా పరవశించి నాట్యం చేస్తున్నాయంటారు. వాన పట్ల ఎంత మధురమైన భావన?
మరో కవితలో రోడ్డు స్వగతాన్ని ఇలా చెబుతూ.. నన్ను కాసేపు ఏకాంతంగా ఉంచండి. నెలవంక వెలుగులో నేను అభ్యంగన స్నాన మాచరించాలని ఉందంటాడు. జీవితం ఒక ప్రవాహమేనని, దిశల దారులు మార్చుకుంటూ పోవడమే దాని వంతు. యాంత్రిక యానంలో జీవితాన్ని పారేసుకుంటూ ఎవరికి వారు ఏకాకిగా బతకడం కవికి అస్సలు ఇష్టంలేదు.
''కాటుక పిట్ట లాంటి రాత్రి
తడిసి అలసి
తూర్పు దిక్కుకు అభిముఖంగా
రెక్కల్ని ఆరబెట్టుకుంటుంది
పూరెక్కపై నీటి బిందువులో
ఒదిగిన సూర్యుడిని
మోహిస్తుంది తూనీగ
పగలు వెలుగు వెల్లవేసిన దేహాలు
రాత్రిని రాగరంజితం చేస్తాయి.'' ( పుట :27)
ఈ కవితలో రాత్రిని కాటుక పిట్టగా అభివర్ణించడం, సూర్యుణ్ణి పూరెక్కపై ఒదిగించడం .. ఒక అద్భుతమైన అనుభూతి. మరో చోట ఒక నైమిశారణ్యం గురించి చిన్న చిన్న పొట్టి వాక్యాలతో ఆకు కదలదనీ, పిట్ట పాడదనీ, కొమ్మల నిండా ఘనీభవించిన చీకటితో తనదైన అనుభూతుల్ని వివరిస్తాడు. నూతన సంవత్సర ఆరంభాన్ని కాలం పూసిన దేహంగా ఆహ్వానిస్తాడు. చిర్ర, చిటికెన పుల్లతో డప్పు పైన దరువేస్తుంటే నరాలు రక్త నదులై ప్రవహిస్తాయనీ, పంచ భూతాలు సైతం పంచమ స్వరాలు అలపిస్తాయని అంటాడు.
జ్ఞాపకాల గోడలకు ఘనీభవించిన స్వప్నాలు, కాలం చెక్కిళ్ళపై కన్నీటి గోళాలు వేలాడు తున్నారు. నేనెప్పుడూ, ఎవ్వరికీ మోహరిల్లననీ, నా లోపలి ప్రపంచానికి నాకు నేనే సర్వాధికారి నని, నల్లరేగడి నేల రంగుల స్వప్నమనీ, తన్ను తాను ప్రకటించుకుంటాడు కవి. నదిలా ప్రవహిస్తున్న కాలానికి నేను వంతెనలా మిగిలిపోయానంటాడు. కవి తన ఊరి వానను సామూహిక ద్ణుఖంతో పోల్చుకున్నాడు.
''నిండు గర్భిణి
నిస్సహాయ/ పురిటి నొప్పుల బాధలా ఉంది
చేతికందిన / పంట పాపను
నీటి ఖడ్గంతో
నిలువునా చీల్చిన కడుపు కోతలా ..'' ఉందంటాడు
''నాగలి నాకు నేర్పిన పాఠం
బతుకంతా పరోపకారం కోసం
పాటుపడమని ...
మట్టి నాకు చెప్పిన వేదం
సహనం వినయ భూషణమని. ...'' ( పుట : 45)
కాలం ఒక పండిన దేహామని, పుష్పమనీ ఒక్కొక్కటిగా రాలుతున్న పుష్పరేకులే సంవత్సరాలుగా భావిస్తాడు. జీవితమంటే పాయలు పాయలుగా పేనుతున్న జీవితమనీ, అది ఎక్కడ ఏ పురి బలహీనమైనా బతుకు మోకు కూడా బలహీనమైనమౌతుందంటాడు కవి.
జీవితంలో అప్పుడప్పుడైనా మనం నడిచి వచ్చిన పాద ముద్రల్ని వెనుదిరిగి చూసుకోవాలి. నీ నడక నువ్వే నడవాలి. అరువుకాళ్ళ బరువు అవసరం లేదు.
నగరం ఎప్పుడూ బిజీనే. అది తెల్లవార్లూ మెలకువ కెరటాలపైనే తేలియాడుతూ ఉంటుంది. జీవితం మనకు చివరి చరణం కాదనీ, మనం పోషించిన పాత్రలు అలిసిపోతే వాటి కొనసాగింపు వారసులు ఆ జ్ఞాపకాలను బదలాయింపు చేస్తారు.
బతుకు తరువుకు ప్రాణ వసంతం పూయించే వాడే రైతు, ఉపాధ్యాయుడుగా తన పూర్వ విద్యార్థులు మదిలో మెదిలినప్పుడు ఇలా అనుకుంటాడు.. నిజమే గురువు అక్షర దాత.
''నేను ఏటా కొన్ని పావురాలకు
అక్షరాలను పెట్టి సాకుతుంటాను
అవి నా చుట్టూ
కువకువా తిరుగుతూ ఉంటాయి
అల్లరి చేస్తాయి
అమాయక చేష్టలతో
ఆత్మీయ నవ్వులు రువ్వుతాయి
ఎగిరిపోయిన పావురాలన్నీ
వెనక్కు వస్తే బాగుంటుంది
కాలాన్ని కాపలాగా కట్టేసి
ఈ జ్ఞాన కోవెలలోని ఎప్పటికీ ఉండిపోతాను అక్షరాలు మేపుకుంటూ బతికిపోతాను..'' ( పుట : 75)
గడియారం ముందు కాలం ప్రణమిల్లుతుంది. నిర్నిద్రల రెప్పలకు ఒక్కోసారి చీకటే దాసోహ మంటుంది. కొన్ని ఏకాంత నడకలకు ఉదయాలు పాలనురుగల నవ్వుల్లా ఎదురవుతాయి. వారంలో ఆదివారమంటే ఓ ఎదురుచూపు, ఆ రోజు కోసమే ఆమె, నేనూ, పిల్లలూ పరస్పరం కొత్తగా పరిచయమవుతామంటూ వారాంతపు తన ఫ్యామిలీతో పంచుకునే ఆనంద క్షణాల్ని తలుచుకుంటాడు కవి.
అమ్మను జీవిత భారాన్ని మోసే అట్లాస్‌తో పోల్చడం ఆర్ద్రంగా ఉంది. నాన్నను సమాధిలో కాక తన గుండెల్లో ఊపిరిగా మోస్తున్నానంటాడు. అంతే కాదు; మన చుట్టూ విస్తరించిన ప్రకృతే ఒక మహాద్భుత జీవన కావ్యం అంటాడు. అదివారాల్లో కవిత్వం కోసం వెంపర్లాడుతాడు.
తన కూతురు సాహితిగా గాళ్స్‌ హాస్టల్‌ గురించి రాస్తూ..
''పాపం పిల్లలు చదువుల కొక్కానికి
తల్ల కిందులుగా వెలాడదీయబడే కోళ్లు..'' అంటాడు. నగరానికి నడిపించి ఇరానీ చారు రుచి చూపిస్తాడు.
ఇలా మణీందర్‌ కవితలు చదువుతూ ఉంటే రెప్పలార్చడమే మర్చిపోతాం. గాజుపూలు ఎంత చక్కటి పేరు? పరిమళం, తాజాతనంతో పల్లవించిన అంతర్లోకం గాజుపూల కవిత్వం అనుభూతులకు రెక్కలు తొడుగుతాడు. భావనలో పదచిత్రాలతో పూలమొక్కలు నాటుతాడు. అఫ్సర్‌ గారన్నట్లు ... కవిత్వం కోసమే రాస్తున్నట్లు అన్పించదు. తనదైన అంతర్లోకంలో లేచివుర్ల పచ్చికలో మంచు బిందువుల్లో మేను వాల్చి నట్లుంటుంది. జీవితం, కాలం, వాన, నగరం, స్వప్నాలు, ఉదయాలు, లోకం, వర్షం వంటి శీర్షికలు పునరుక్తిగా అనిపించినా వేర్వేరు అభివ్యక్తులతో ఆసక్తి కల్గిస్తాయి. కవిత్వంలో ఎక్కడా, అల్పపీడనలూ, ఉప్పెనలు, తుఫానులు విన్పించవ్‌. ఎగసి పడే తరంగాలుండవ్‌. నిర్మల ప్రవాహంగా సాగే జీవితం ఉంటుంది. స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, వివక్షలు, వైరుధ్యాలు లేని తన లోలోపలి ప్రపంచాన్ని కవితా భాష్యమే మణీందర్‌ గరికపాటి 'గాజుపూలు' కవిత్వం. ఈ అక్షరాల్లోకి తొంగి చూడండి. తలెత్తలేరు. వాక్యాల వెంట నడవండి, పేగు బంధాలు ప్రేమతో నిన్ను పలకరిస్తారు.
 

- డాక్టర్‌ రాధేయ