అతడు సూరీడుతో పోటీ పడతాడు
దాని కంటే ముందుగా
తోటలోకి వస్తాడు
సూరీడుతో స్నేహం చేస్తాడు
రెండు చేతులూ పైకెత్తి
రా రమ్మని పిలుస్తాడు
లేలేత కిరణాల్ని దోసిట్లోకి తీసుకుని
లేలేత ఆకులకు తినిపిస్తాడు
అతడు సామాన్యుడు కాదు
భూమికీ ఆకాశానికీ మధ్య
వారధి కడుతున్న నిర్మాణ నిపుణుడు
అతడు మొక్కలతో మాట్లాడుతాడు
పువ్వులతో ముసిముసిగా నవ్వుతాడు
ఏంటి తాతా ఇది అంటే
ఆకులు పలకరిస్తున్నాయి చూడమంటాడు
వాటికి తలంటుతాడు
ఒళ్ళంతా మెల్లగా నీటితో నిమురుతూ
స్నానం చేయిస్తాడు
సబ్బూ షాంపూ పెట్టమని
నేను వెటకారమాడుతాను
బురద మట్టితో మొక్క వేళ్ళను
సుతారంగా ఒత్తుతాడు
మొక్కలకు పున్నమి చూపిస్తాడు
వెన్నెల్లో తడిసి అలుపులేకుండా ఆడుకుంటున్న
మొక్కల్ని చూసి మురిసిపోతాడు
ఎండాకాలంలో
ఆకుపచ్చ వలతో గొడుగు పడతాడు
వానాకాలంలో
నాలుగువైపులా చిన్న చిన్న కాలువలు తీస్తాడు
అతడు శ్వాస బిందువులను
కాలంతో కలిపే సరళరేఖ
తాతకు మొక్క అంటే పసిపాప
దాని బుగ్గలు ఎరుపెక్కితే
తాత కనురెప్పల కింద నల్లఛాయ వస్తుంది
అంత గారాబం ఎందుకంటే
నువ్వు పెద్దోడివైపోయావంటాడు
తాత మొక్కల భాష
నాకు ఎంతకీ అర్థం కాదు!
ఉన్నట్టుండీ ఓ వేకువజామున
నేను బాల్యంలోకి వెళ్ళిపోయాను
తోటలోకి వెళ్లి చప్పుడు లేకుండా చూసాను
అప్పుడు మొక్కల భాష
నా రక్తనాళాల్లోకి చేరిపోయింది.
- కిల్లాడ సత్యనారాయణ










