Jun 20,2023 08:00

పూర్వం ధారా నగరంలో ఎర్రోడు అనే దొంగ వుండేవాడు. ఓ రోజు ఓ ఇంటికి కన్నం వేసి లోనికి దూరాడు. ఆ గదిలో మసక వెలుతురులో ఒక మూట కనిపించింది. అది అందుకుని బయటపడ్డాడు. తెల్లారి పట్టుబట్టతో కట్టిన ఆ మూటను విప్పాడు ఎర్రోడు. అందులో ఏవో రాతలున్న తాటాకు కట్టలు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత కష్టపడి దొంగతనం చేస్తే దొరికినవి ఇవా అని నీరసపడ్డాడు. సరే!... వాటినే ఎవరికైనా అమ్మి సొమ్ము చేసుకోవాలని బజారు బాట పట్టాడు. ఓ షావుకారు వాటిని చూసి... ' నాకు చదువు రాదు... వీటి విలువ తెలిసిన ఏ పండితుడి దగ్గరకెళితే వీటిని తీసుకుని కొంత ధనం నీకు ఇవ్వవచ్చు' అని సలహా ఇచ్చాడు.
         పండితుల దగ్గరికి వెళితే తన దొంగతనం గురించి బయటపడుతుందని భయపడ్డాడు. ఆ కవిలెకట్టతో వీధిలోకి వచ్చి నీరసంగా నడుస్తున్నాడు. సాధారణంగా పండితులు, కవులు దగ్గర వుండే ఆ తాళపత్రాలు ఓ సామాన్యుడి దగ్గర వుండేసరికి, అటుగా వెళుతున్న రాజభటులకి అనుమానం వచ్చి, ఎర్రోణ్ణి పట్టుకుని సైనికాధికారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ అధికారి కవిలెకట్టను పరిశీలించి, ఇది రాజుగారి దగ్గరికి తీసుకెళ్లవలసిన విషయమని, ఎర్రోణ్ణి రాజు ముందు ప్రవేశపెట్టారు. 'ఆ తాళపత్రాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి?' అని మంత్రి గద్దించాడు. ఎర్రోడు తాను నోరు విప్పితే తన బండారం బయటపడుతుందని... మూగవాడిగా నటించడం మొదలుపెట్టాడు. అంతేకాదు... రాజు గారికి ఇవ్వడానికి వస్తుంటే సైనికులు పట్టుకున్నారని... సైగల ద్వారా చెప్పాడు.
          సేవకులు ఆ తాళపత్రాల్ని వెండిపళ్లెంలో వుంచి రాజు ముందుంచారు. స్వయంగా కవి అయిన రాజు వాటిని సావధానంగా పరికించారు. ఆయన కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆ తాళపత్రాల్లో వున్నవి... మామూలు పద్యాలు కావు. అప్పటికి మూడు వందల సంవత్సరాల క్రితం ఆ నగరంలో నివశించిన ఒక మహా కవి రచించిన కావ్యం అది. అంత అపురూపమైన కావ్యం అనుకోకుండా తన రాజ్యంలో లభించడం రాజుకెంతో సంతోషం కలిగించింది. అప్పటికప్పుడు పూలను తెప్పించి ఆ తాళపత్ర గ్రంథంపై వుంచి రాజుతో సహా అంతా నమస్కరించారు. కావ్యం దొరికిన ఆనందంలో అవి ఎర్రోడి చేతికి ఎలా వచ్చిందన్న విషయం ఎవరూ పట్టించుకోలేదు. అతనికి వేయి వరహాలు కానుకగా ఇప్పించి పంపించేశాడు రాజు.
        బ్రతుకు జీవుడా అని బయటపడ్డ ఎర్రోడు, దొంగతనాలు మాని కొత్త జీవితం గడపాలనుకున్నాడు. మరుసటి రోజే పక్క నగరానికి కుటుంబంతో సహా మఖాం మార్చాడు. ఆరోజు తనకి శిక్ష పడకుండా ఆ తాటాకు పత్రాలలోని అక్షరాలే కాపాడాయని భావించాడు. అక్షరాల విలువ తెలిసి తన ఇద్దరు పిల్లల్ని విద్య నేర్పించడానికి ఒక గురువు దగ్గర చేర్చాడు. బ్రతుకుతెరువు కోసం పూల వ్యాపారం ప్రారంభించాడు. పూల బజారులో చిన్న తక్కెడతో మొదలైన అతని పూల వ్యాపారం, కొద్ది రోజుల్లోనే మూడు పువ్వులు, ఆరు కాయల్లా వృద్ధిలోకి వచ్చింది. ఒక వైపు పిల్లలు చదువులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే, మరో వైపు ఎర్రోడి పూల వ్యాపారం బాగా పెరిగింది. మామూలు తక్కెడ బదులు గంపల తక్కెడ అమర్చాడు. తన జీవితం ఇలా మలుపు తిరగడానికి తాళపత్రాలు, వాటిపై వున్న అక్షరాలే కారణమని మనసులోనే వాటికి మొక్కుతుంటాడు.
 

- ఎస్‌. హనుమంతరావు
88978 15656