Jun 05,2023 08:10

ఏళ్లకేళ్లు ఆడవాళ్లు
ఈడ్చుకుంటూ, ఓర్చుకుంటూ
ఒకరినొకరు పేర్చుకుంటూ
ఎర్ర జెండాలతో యుద్ధం చేస్తూ
లాఠీలతో ఎముకలు విరగ్గొట్టించుకుంటూ
బూటు కాళ్ళ కింద నలిగిపోతూ
బూతుల హెడ్‌ లైన్స్‌లో చోటు దక్కించుకుంటూ
రక్తంలో నానిపోతూ తరాలకు తరాలుగా
స్వేచ్ఛ కోసం సివిల్‌ డ్రెస్‌లో యుద్ధం చేస్తూనే ఉన్నారు...

రాజులు పోయారు రాజ్యాలు పోయాయి
స్వేచ్ఛ భూస్థాపితమైపోయింది
ప్రభుత్వాలొచ్చాయి... పాలకులొచ్చారు..
పల్లెలు మాయమైనట్టు
స్వతంత్రం కూడా సమాదైపోయింది!
సిగరెట్‌ పాకెట్‌ మీద
పొగ తాగడం నిషేధం అని రాసినట్టు....
ఆట వస్తువుల మీద ఆడటం నిషేధం
అనే అక్షరాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయి...
మైదానాలు కూడా
మగ వాసనకు సలాం చేస్తున్నాయి!
అవును, నా దేశంలో ఇప్పుడు ఆటలాడడం నిషేధం
నోరు తెరవడం నిషేధం
లైంగిక వేధింపులకు లైసెన్స్‌ ఉన్న నా దేశంలో
ఆధారముందా? అని అడిగే నోళ్ళ ముందు
నా ఆత్మ గౌరవం ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంది!
కారణమేదైనా, మగ రాజకీయ చదరంగంలో
ఆడ ఆటగాళ్లకు 'నీయమ్మ, దానెమ్మ' అనే బిరుదులూ..
అప్పుడేమో అశోక వృక్షం కింద ఒకే ఒక సీత
ఇప్పుడు వందల మంది సీతలు...
వేధింపుల ఆరోపణలు నిరూపణ చేయలేక
బలవంతపు పైత్యాలను ఎదిరించి నిలువలేక..!
 

- అమూల్యచందు, 90598 24800