
నిన్ను ఆకాశమంత
ఎత్తేస్తున్నారని
సంబర పడిపోకోయ్ !
కాసింత భూమ్మీద స్వేచ్ఛగా
నడవనివ్వమని
ఏకరువు పెడుతూనే వుంటిరీ
ప్రాతినిధ్య శాతాల లెక్కల పద్దుల్ని
తెరపైకి తెచ్చేసి
చప్పట్లు చరుచుకుంటున్నరు చూడు
ఆకలి గొన్న కాడ
నూకలు చల్లడం
మహా క్రూర ఎత్తుగడ సుమా!
మాన, ప్రాణ భద్రతల్ని వొదిలి
విలువల వలువలూడ్చి
కళ్ళప్పగించే వీళ్లంతా
ఎప్పుడో ఇంకెప్పుడో
బ్రహ్మరథం పట్టేస్తామనీ
కళ్లముందే కళ్లుగప్పి
మీ అతివలందరికీ
మంగళ హారతి
ఇస్తున్నారు చూడు
ఏ నినాదం వెనుక
ఏ లబ్ధి దాగుందో గమనించండీ
మోసపోవడం
ఆనవాయితీ అనుకొని
గాల్లో గోపురాలు కట్టెయ్యకండే...
మీ నక్క జిత్తులు
పసిగడితే మాత్రం
వాళ్లంతా అదే వాళ్లంతా
ఎర్రబడే గగనానికి
అర్ధాంగులే...!
- డాక్టర్ కటుకోఝ్వల రమేష్
9949083327